brs
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

మళ్లీ తెరపైకి గులాబీ సెంటిమెంట్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల యుద్ధం మొదలుకాబోతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు… వ్యూహలు, ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. పోటీలో నిలిచి గెలిచే వారి జాబితాను కూడా రెడీ చేసుకునే పనిలో పడ్డాయి. కీలకమైన స్థానాల విషయంపై కూడా మేథోమథనం చేస్తున్నాయి. ప్రత్యర్థిని ఢీకొట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి. బీఆర్ఎస్ ఏకంగా 115 మంది అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల సమరంలోకి దిగింది. నియోజకవర్గాల్లో ప్రచారం కూడా మొదలుపెట్టేసింది. ప్రతిరోజూ గ్రౌండ్ లోని పరిస్థితులను అంచనా వేసి… నేతలకు ఫీడ్ బ్యాక్ ఇస్తూ దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. అసంతృప్తులను కూడా లైన్ లోకి తీసుకువచ్చే పనిలో పడింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్…ఈసారి ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని చూస్తోంది. అందుకు తగ్గట్టే కార్యాచరణను సిద్ధం చేయటంతో పాటు… ఆపరేషన్ ఆకర్ష్ తో నేతలను చేర్చుకుంటూ వేగం పెంచుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో… అధికార బీఆర్ఎస్ మరోసారి సెంటిమెంట్ అస్త్రాన్ని కూడా సంధించేందుకు రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేలా అస్త్రాలను సిద్ధం చేస్తున్నట్లు తాజా పరిస్థితులను బట్టి అర్థమవుతోంది.

ఉద్యమం తర్వాత టీఆర్ఎస్… అంటే తెలంగాణ, తెలంగాణ అంటే టీఆర్ఎస్ అన్న పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. సెంటిమెంట్ నినాదంతో సక్సెస్ అయిన పార్టీల్లో టీఆర్ఎస్ ఒకటి అని చెప్పొచ్చు. తెలంగాణ సాధనలో అగ్రభాగన ఉన్న టీఆర్ఎస్… రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత… అనూహ్యంగా రూట్ ను మార్చేసింది. ఏకంగా టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చేశారు అధినేత కేసీఆర్. తెలంగాణ పేరుతోనే రాజకీయం చేసే ప్రాంతీయ పార్టీ… తెలంగాణ అనే పదమే లేకుండా పార్టీ పేరును మార్చటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చినప్పటికీ… తెలంగాణపై తమకే పేటెంట్ ఉందన్నట్లు అడుగులు వేస్తోంది బీఆర్ఎస్.  సమయం, సందర్భాన్ని బట్టి… నాటి ఉద్యమ ఘట్టాలను గుర్తు చేస్తూ… ప్రత్యర్థులను ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ సెంటిమెంట్ తో పెద్దగా పని ఉండదని అంతా భావించినప్పటికీ… 2014, 2018 ఎన్నికల్లో సెంటిమెంట్ అస్త్రాన్ని ఫర్ ఫెక్ట్ గా వాడేసేంది గులాబీ పార్టీ.

ముఖ్యంగా 2018 ఎన్నికల వేళ… టీడీపీ – కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవటం కేసీఆర్ కు అత్యంత కలిసివచ్చిన అంశమని చెప్పొచ్చు. మహాకూటమి పేరుతో చంద్రబాబు మళ్లీ… తెలంగాణకు వస్తున్నారని, ప్రజలంతా గమనించాలంటూ ఓటర్లను ఆలోచనలో పడేశారు గులాబీ దళపతి. ఇలా ప్రతి సభలోనూ…. వీరి పొత్తును ప్రస్తావిస్తూ తనకు అనుకూలంగా మార్చేసుకున్నారు కేసీఆర్.  దీంతో… కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవి చూడగా, గులాబీ పార్టీ 88 సీట్లు సాధించి తిరుగులేని శక్తిగా మారిపోయింది.ఇదిలా ఉంటే మరోకొద్దిరోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గతంలో చంద్రబాబుతో పొత్తు అంశం బెడిసికొట్టడంతో బోల్తా పడిపోయింది కాంగ్రెస్. ఈసారి మాత్రం పక్కాగా ప్లాన్ గా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. కట్ చేస్తే…తెలంగాణలో పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల… కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇస్తారనే చర్చ గట్టిగా జరుగుతోంది. ఇదే విషయాన్ని షర్మిల కూడా ధ్రువీకరించారు. ఇటీవలే ఢిల్లీలో సోనియా గాంధీతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె… తెలంగాణలో కేసీఆర్ ను పడగొట్టడమే తమ లక్ష్యమని ప్రకటించారు. రేపోమాపో ఆమె పార్టీ… కాంగ్రెస్ లో విలీనమయ్యే అవకాశం కనిపిస్తోంది.

విలీనం జరగటంతో పాటు షర్మిల గతంలో ప్రకటించిన మాదిరిగా పాలేరులో పోటీ చేస్తే… కాంగ్రెస్ గుర్తుపైనే బరిలో ఉండాల్సి వస్తుంది. అలా కాకుండా  రాజ్యసభకు పంపినా… అదే గుర్తుపై వెళ్తోంది. దాదాపు ఆమె తెలంగాణ వేదికగానే రాజకీయాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు కనిపిస్తోంది.  ఇక ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు.  తాను నాలుగు దశాబ్ధాల నుంచి తెలంగాణలోనే రాజకీయాలు చేస్తున్నానని.. ఏపీ పాలిటిక్స్ లో చొరవ చూపలేదని అన్నారు. తన భార్య, పిల్లలు అందరూ తెలంగాణలోనే ఉంటున్నారని అన్నారు. తాను ఇక్కడి మట్టిలోనే కలిసిపోతానని వ్యాఖ్యానించారు. తనను తెలంగాణ వ్యక్తి లాగా గుర్తించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలను కోరారు. ఈ వ్యాఖ్యలు కూడా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సరిగ్గా ఈ ఇద్దరు నేతలను టార్గెట్ చేసే పనిలో పడింది బీఆర్ఎస్. వీరిద్దరిని ప్రస్తావిస్తూ…  అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెట్టాలని చూస్తోంది.