ఆయన గుంటూరు నగర ప్రధమ పౌరుడు. చంద్రబాబు అరెస్ట్‌కి నిరసనగా జరిగిన బంద్‌తో మూసేసిన షాపులు తెరిపించేందుకు ఆయన రోడ్డెక్కటంతో రచ్చరచ్చయింది. మేయర్ తీరుపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరించి బలవంతంగా షాపులు తెరిపిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో వైసీపీ, జనసేన కార్యకర్తలు బాహాబాహీకి సిద్ధమయ్యారు. అడ్డుకున్న పోలీసులు రెండువర్గాలను అక్కడినుంచి పంపించేశారు. కర్ర పట్టటంతోనే ఆగలేదు మేయర్ కావటి మనోహర్. నోటికి పనిచెప్పారు. జనసేన అధినేతను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పవన్‌కల్యాణ్‌పై నోరుపారేసుకున్న మేయర్ మనోహర్‌పై ఫైరయ్యారు జనసేన నేతలు. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయినా మేయర్ తగ్గకపోవటంతో ఆయన ఇంటిముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో గుంటూరు నగరంలో ఉద్రిక్తత ఇప్పటికీ అలాగే ఉంది. కేడర్ నిరసనకు మద్దతు పలికిన జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెచ్చగొట్టే వ్యాఖ్యలు వారిపై కేసు నమోదు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. 24గంటల టైమ్ ఇచ్చిన నాదెండ్ల పోలీసులు మేయర్‌పై కేసు పెట్టకపోతే సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తామన్నారు. ఎంత టైమిచ్చినా సారీ చెప్పేది లేదని మేయర్ మొండికేయటంతో.. ఈ మ్యాటర్‌ని అంత తేలిగ్గా వదలదల్చుకోలేదు జనసేన కూడా.తమ పార్టీ అధినేతని దూషించడమే కాకుండా.. పవన్‌కల్యాణ్ సారీ చెబితేనే తాను క్షమాపణ కోరతానంటున్న మేయర్ మనోహర్‌పై జనసేన శ్రేణులు మండిపడుతున్నాయ్. పోలీసులపై ఒత్తిడి పెంచేందుకు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలనుకుంటున్నారు జనసేన నేతలు. ఇప్పటికే మేయర్ చేసిన వ్యాఖ్యల వీడియోలను న్యాయవాదులకు అందించినట్లు ప్రచారం జరుగుతోంది.
గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, అరండల్ పేట సీఐ రాంనాయక్‌పై కంటెప్ట్ ఆప్ కోర్టు కేసు నమోదుకు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు జేఎస్పీ నేతలు చెబుతున్నారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. మేయర్‌తో పాటు పోలీసులను కూడా టార్గెట్ చేస్తూ జనసేన నేతలు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. మరోవైపు వైసీపీ తమ పార్టీ మేయర్‌కి అండగా నిలిచింది. అటు పోలీసులు జనసేన ఫిర్యాదుపై న్యాయ సలహా కోరినట్లు చెబుతున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా గుంటూరులో రెండు పార్టీల మధ్య రాజకీయ రచ్చ ఇప్పట్లో చల్లారేలా కనిపించడంలేదు. మధ్యలో పోలీసులు బలి కావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.