ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పాత్ర ఏమిటన్నది నిన్న మొన్నటి వరకు క్లారిటీ లేదు. రాజకీయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నా పవన్ కళ్యాణ్ పక్కా రోడ్ మ్యాప్‌తోనే ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఏపీ రాజకీయాల్లో పవన్ ప్రాధాన్యత క్రమంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. పార్టీ పెట్టిన పదేళ్లలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా దక్కించుకున్నది ఏమి లేకపోయినా ప్రత్యర్థుల విమర్శల్ని మాత్రం భరించాల్సి వచ్చింది. జనసేన రాజకీయ పార్టీగా పురుడు పోసుకుని పదేళ్లలో పెద్దగా సాధించింది ఏమి లేదు. పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి కూడా ఎన్నిక కాలేకపోయారు. ప్రత్యర్థుల విమర్శలు, ఆరోపణలు, తిట్లు, శాపనార్థాలు ఇవన్నీ రాజకీయంగా పవన్ కళ్యాణ్‌ను రాటు దేలేలా చేసినట్టున్నాయి. 2014లో రాష్ట్ర విభజన సమయంలో పార్టీని ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్, విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ కూటమికి మద్దతిచ్చారు. ఆ ఎన్నికల్లో ఆ కూటమి గెలిచింది. 2019లో వామపక్షాలతో కలిసి నేరుగా ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కేవలం 6శాతం ఓట్లకు పరిమితం కావాల్సి వచ్చింది.
ఒకే ఒక్క అసెంబ్లీ స్థానంలో గెలుపొందారు. పవన్ పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలయ్యారు.2019 తర్వాత బీజేపీతో మళ్లీ జత కట్టిన పవన్ కళ్యాణ్ తన బలాన్ని క్రమంగా పెంచుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు. రాజకీయంగా పవన్ బలం ఎంత అని సందేహించిన వారికి ఇప్పుడు పవన్ ఏదో చేస్తాడనే అభిప్రాయం కలిగించాడు.ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనంటూ దాదాపు ఏడాదిన్నర క్రితం పవన్ తొలిసారి ప్రకటించాడు. అప్పటికి బీజేపీతో పవన్‌కు బంధం ఉన్నా ఆయన మాటల్లో స్పష్టత లేదని అంతా భావించారు. 2014 ఎన్నికల్లో కాపు ఓట్లను బీజేపీ-టీడీపీ కూటమికి మళ్లించడంతో పవన్ పాత్ర కూడా గణనీయంగా ఉంది. 2019లో ఓటమికి కమ్మ, బీసీ ఓట్లలో చీలిక కారణమనే స్పష్టత కూడా పవన్‌కు వచ్చింది.విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ పర్యటన అడ్డుకున్న సమయంలో జనసేన-టీడీపీల మధ్య మళ్లీ స్నేహం చిగురించింది. పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా టీడీపీ నాయకుడు చంద్రబాబు విజయవాడ నోవాటెల్ హోటల్లో పరామర్శించారు. ఆ తర్వాత చంద్రబాబుతో హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.
రాజకీయ పొత్తుల గురించి ఈ సమావేశాల్లో ఎక్కడా ప్రస్తావనకు రాలేదు.ఓ వైపు బీజేపీని రోడ్ మ్యాప్ అడుగుతూనే టీడీపీని కూడా తమతో కలుపుకోవాలని పవన్ చూస్తున్నాడని ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. టీడీపీ పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడంటూ వైసీపీ ఆరోపించింది. “తనకు ముఖ్యమంత్రి పీఠంపై కోరిక లేదని ఓసారి, అవకాశం వస్తే ముఖ్యమంత్రి పదవి వెదుక్కుంటూ వస్తుందని మరోసారి.. గతంలో టీడీపీ అధికారంలోకి రావడానికి తాను సహకరించానని, ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని ఇంకోసారి..”తానేమి అనుకుంటున్నాడో స్పష్టత ఇవ్వకుండానే సమయానుకూలంగా పవన్ ఇటీవలి కాలంలో మాట్లాడేవాడు. “ముఖ్యమంత్రి పదవి తమకు దక్కాల్సిందేనని పవన్ కళ్యాణ్ బలంగా చెప్పినప్పుడు అతనితో బేరం కుదిరే పని కాదని టీడీపీ భావించింది”. అధికారాన్ని పంచుకోడానికి, ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోడానికి ఆ పార్టీ నేతల నుంచి పెద్దగా సానుకూలత రాలేదు. 2019 ఎన్నికల్లో 40శాతం ఓట్లు దక్కించుకున్న టీడీపీ, 6శాతం ఓట్లకు పరిమితమైన జనసేనతో అధికారాన్ని పంచుకోవడమనే ఆలోచన కూడా చాలా మంది టీడీపీ నేతలకు రుచించలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చంద్రబాబు ఎంత కాలం జైల్లో ఉండాల్సి వస్తుందనే దానిపై ఎవరికి స్పష్టత లేదు. కానీ చంద్రబాబు జైలుకు వెళ్లిన వెంటనే ములాఖత్‌లో ఆయన్ని పరామర్శించిన పవన్ కళ్యాణ్ బయటకు రాగానే టీడీపీ-జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. నిన్న మొన్నటి వరకు టీడీపీ-జనసేన పొత్తు కుదిరితే పవన్ కళ్యాణ్ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలనే విషయంలో బేరాలు ఆడాలనే ఆలోచనలో టీడీపీ ఉండేది.ఇప్పుడు తమ పార్టీకి ఎన్ని సీట్లు ఎక్కడ కావాలో డిమాండ్ చేసే పరిస్థితికి పవన్ కళ్యాణ్ జనసేన వచ్చింది. చంద్రబాబు తర్వాత టీడీపీని ముందుండి నడిపించే నాయకుడెవరు కనిపించడం లేదు. చంద్రబాబుతో పాటు నారా లోకేష్‌ను కూడా అరెస్ట్ చేస్తారని ఆ పార్టీ అనుమానిస్తోంది. అదే జరిగితే టీడీపీ-జనసేన కూటమిని ఎన్నికలకు నడిపించాల్సిన బాధ్యత కూడా పవన్ కళ్యాణ్‌దే అవుతుంది. నిన్న మొన్నటి వరకు టీడీపీ ఇచ్చిన సీట్లతో సర్ధిపెట్టుకోవాల్సి ఉంటుందనే భావన నుంచి కోరిన సీట్లను దక్కించుకునే వ్యూహం కనిపిస్తోంది. పవన్ డిమాండ్లకు టీడీపీ తప్పనిసరిగా తలొగ్గాల్సి రావొచ్చుజనసేన-టీడీపీ-బీజేపీల మధ్య నడుస్తున్న రాజకీయాలను గమనిస్తే ఏపీ రాజకీయ పరిణామాలపై బిజెపి హైకమాండ్ అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తోందా లేక తెరవెనుక పావులు కదుపుతున్నది కమలం పార్టీ పెద్దలేనా అనే అనుమానాలు కూడా కలుగుతాయి.
గత మూడు నాలుగు నెలలుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బీజేపీ పాత్రను సందేహించాల్సి ఉంటుంది.దక్షిణాదిన బిజెపికి మద్దతు మినహా సంతబలం లేదన్న వాస్తవాన్ని మార్చేందుకు బిజెపి ప్రయత్నిస్తున్నట్లు భావించాల్సి ఉంటుంది. 2024కి కాకపోయినా 2029కల్లా తమకంటూ కొంత బలాన్ని ఏర్పరచుకునేందుకు తమిళనాడు సహా ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రయత్నిస్తున్నట్టే కనిపిస్తోంది.తమిళనాడులో రెండు ప్రాంతీయ పార్టీల మధ్య నెమ్మదిగా బిజెపి కూడా ఉంది అనే చర్చ తీసుకొచ్చింది.అదే ప్రయత్నం ఆంధ్ర ప్రదేశ్ లోనూ ప్రారంభమైంది. ఒక్క శాతం ఉన్న తమ ఓటుకు ఆరు శాతం ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీని జత చేసుకుని ఇప్పుడు దాన్ని మరింత పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించడం బీజేపీ వ్యూహమైతే ఏపీ రాజకీయాలు మున్ముందు రసవత్తరంగా ఉండొచ్చు. ఈ మొత్తం ఆటలో టీడీపీ భవిష్యత్ ఏమిటనేది కూడా చర్చనీయాంశమే.