తెలంగాణ రాజకీయం

పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు సన్నద్దం కావాలి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

మాడల్ కోడ్ ఆఫ్ కండెక్ట్ ను పకడ్బందిగా అమలు చేయాలి
అభ్యర్థుల ఎన్నికల ఖర్చు పై పకడ్బంది నిఘా ఏర్పాటు
ఎన్నికల విధుల నిర్వహణలో అలసత్వం వహించరాదు
ఎన్నికల విధుల నిర్వహణ పై నోడల్ అధికారులతో  సమావేశం  నిర్వహించిన జిల్లా కలెక్టర్

రాబోయే అసెంబ్లీ ఎన్నికలను జిల్లాలో పారదర్శకంగా నిర్వహించేందుకు సన్నద్దం కావాలని జిల్లా కలెక్టర్  భవేష్ మిశ్రా తెలిపారు. బుధవారం తన చాంబర్ లో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా  నోడల్ అధికారులతో రివ్యూ సమావేశాన్ని  నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ…  ఓటరు జాబితా సవరణ పూర్తి చేసుకొని అక్టోబర్ 4న తుది ఓటరు జాబితా విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. అక్టోబర్ మొదటి రెండు వారాల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులు పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు.  ఎన్నికల విధుల నిర్వహణకు అవసరమైన మానవ వనరులు సిద్దం చేయాలని, మన జిల్లాలో భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో ఎన్నికల విధులు పర్యవేక్షణ ఉంటుందని అన్నారు.  ఎన్నికల విధుల నిర్వహణ కోసం కేటాయించే సిబ్బంది ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం జరగాలని కలెక్టర్ తెలిపారు.  
ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి పంపిణీ పకడ్బందిగా జరిగేలా ప్రణాళికలు తయారు చేయాలని,  ఎన్నికల నేపథ్యంలో వినియోగించే వాహనాల పరిశీలించి  సర్టిఫై చేయాలని అన్నారు.
పోలింగ్ అధిక శాతం నమోదయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా ఓటు ప్రాముఖ్యత పై అవగాహన కల్పించాలని కలెక్టర్ అన్నారు.
ఎన్నికల సమయంలో  అభ్యర్థుల ఖర్చు పై పకడ్బంది  నిఘా ఉండాలని కలెక్టర్ తెలిపారు. సి విజల్  వినియోగం పై ప్రచారం కల్పించాలని అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుంచి మాడల్ కోడ్ ఆఫ్ కండెక్ట్ ను పకడ్బందిగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
మీడియా సర్టిఫికెషన్ మానిటరింగ్ సెంటర్ ఏర్పాటు, పేయిడ్ న్యూస్, మీడియా సెంటర్ ఏర్పాటు తదితర అంశాల పై పాత్రికేయులకు ముందుగా సమాచారం అందించాలని కలెక్టర్ తెలిపారు.  ఎన్నికల సమయంలో 1950 నెంబర్ కు వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి  చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగుల ఓటర్లు పోలింగ్ లో పాల్గోనేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అన్నారు.  ఈ సమావేశంలో  ఆర్డీవో   రమాదేవి,  డీఎస్పీ రాములు, డి ఆర్ డి ఓ పురుషోత్తం, జెడ్పి సీఈవో విజయలక్ష్మి, సిపిఓ శామ్యూల్, డీఈఓ రామ్ కుమార్, డీఎఫ్ఓ అవినాష్, డి పి ఆర్ ఓ శ్రీధర్, ఈ డి ఎస్ సి కార్పొరేషన్ వెంకటేశ్వరరావు, ఉద్యానవన శాఖ అధికారి సంజీవరావు, ఎస్సీ డెవలప్మెంట్ అధికారి సునీత, డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ శ్రావన్, రవాణా అధికారి సంధాని , తదితరులు  పాల్గోన్నారు.