తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ పై ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశమైన భారత్ అన్ని రంగాల్లోనూ పురోగమిస్తుంటే.. పాకిస్థాన్ పరిస్థితి మాత్రం నానాటికీ దిగజారుతోందన్నారు. భారత్ చందమామను చేరుకోవడంతోపాటు ప్రతిష్ఠాత్మక జీ20 సమావేశాలను నిర్వహించిందన్నారు. అయితే పాక్ మాత్రం అడుక్కునే స్థితికి చేరిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం లండన్‌లో ఉన్న ఆయన లాహోర్‌లోని పార్టీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని మాట్లాడారు. ‘పాకిస్థాన్ ప్రధాని నేడు ఆ దేశానికి, ఈ దేశానికి తిరుగుతూ నిధుల కోసం అడుక్కుంటున్నారు. భారత్ మాత్రం అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తోంది. చంద్రుడిని చేరింది.
ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సుకు ఆతిథ్యమిచ్చింది. భారత్ చేయగలిగింది పాకిస్థాన్ ఎందుకు చేయలేకపోతోంది..? ఈ దారుణ పరిస్థితులకు ఎవరు బాధ్యులు..?’ అని సూటిగా ప్రశ్నించారు.అటల్ బిహారీ వాజ్‌పేయూ ప్రధాని అయినప్పుడు భారత్ వద్ద విదేశీ మారక నిల్వలు కేవలం ఒక్క బిలియన్ డాలర్లు మాత్రమే ఉండేదని నవాజ్ షరీఫ్ గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు భారత్ విదేశీ మారకం విలువ 600 బిలియన్ డాలర్లకు చేరిందని ఆయన వివరించారు. భారత్ ఉన్నత స్థాయికి చేరితే పాక్ మాత్రం అడుక్కునే స్థితికి ఎందుకు చేరుకుంది..? అని ఆయన ప్రశ్నించారు. పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభానికి మాజీ సైనిక జనరల్స్, న్యాయమూర్తులే కారణమని షరీఫ్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.