ఆంధ్రప్రదేశ్ బీజేపీ విచిత్రమైన పరిస్థితుల్లో ఉంది. ఏపీ బీజేపీ అధ్య్యక్షురాలు పురందేశ్వరి మాత్రమే అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కానీ ఇతర నేతలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. రాజకీయంగా అత్యంత సున్నితమైన అంశాలపై ఇప్పుడు హాట్ హాట్ డిబేట్స్ జరుగుతున్నాయి. కానీ బీజేపీ వాయిస్ మాత్రం ఎక్కడా వినిపించడం లేదు. ఆ పార్టీలో సీనియర్లు , మీడియాతో తరచూ మాట్లాడేవాళ్లు అంతా ఏమయ్యారన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పురందేశ్వరిని టార్గెట్ చేసినా ఎవరూ స్పందించడం లేదు. ఏపీలో మద్యం పేరుతో కుంభకోణం జరుగుతోందని పురందేశ్వరి కీలక లెక్కలు వెల్లడించారు. రాష్ట్ర బడ్జెట్‌లో మద్యం ద్వారా రూ.20 వేల కోట్ల ఆదాయం వస్తోందని చెబుతున్నారని, వాస్తవానికి ఏడాదికి రూ.56,700 కోట్ల ఆదాయం వస్తోందని తెలిపారు. మరి మిగిలిన రూ.36,700 కోట్ల సొమ్ము ఎటు పోతోందని ఆమె ప్రశ్నించారు. ఇంతకన్నా పెద్ద కుంభకోణం ఉంటుందా? అని అన్నారు. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశిస్తే నిజానిజాలు వెలుగు చూస్తాయన్నారు.
ఈ అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని అంటున్నారు. పురందేశ్వరి తీవ్రమైన ఆరోపణలు చేసిన తర్వాత కూడా బీజేపీ నేతలు ఎవరూ దీనిపై స్పందించలేదు. ఏపీ బీజేపీకి చెందిన సీనియర్ నేతలంతా సైలెంట్ మోడ్ లో ఉన్నారు. సోము వీర్రాజు నుంచి జీవీఎల్ నరసింహారావు వరకూ ఎవరూ నోరు మెదపడం లేదు. గతంలో జీవీఎల్ ప్రతి వారాంతంలో హడావుడి చేసేవారు. విశాఖలో కచ్చితంగా ప్రెస్ మీట్లు పెట్టేవారు. ఇప్పుడు ఆయన కూడా సైలెంట్ అయ్యారు. సత్యకుమార్ లాంటి నేతలు కూడా ఏపీ రాజకీయాలపై మాట్లాడటం తగ్గించారు. ఇక ప్రతి సందర్భంలో మీడియాలో బీజేపీ తరపున గట్టిగా వాదించే విష్ణువర్ధన్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు కూడా సైలెంట్ అయిపోయారు. పురందేశ్వరి వ్యవహారశైలి కారణంగానే వీరంతా సైలెంట్ అయిపోయారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పురందేశ్వరి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూండటంతో… ఆమె మాటను సీనియర్లు పట్టించుకోవడం లేదంటున్నారు. పురందేశ్వరిని టార్గెట్ చేసి విజయసాయిరెడ్డి వంటి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో సోమ వీర్రాజుపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పార్టీలో నేతలంతా వారిపై విరుచుకుపడేవారు. కానీ ఇప్పుడు పురందేశ్వరిని టార్గెట్ చేసినా ఎవరూ మాట్లాడటం లేదు.
అాలాగే బండి సంజయ్ పై పేర్ని నాని కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కానీ ఏపీ బీజేపీ నుంచి అంత స్పందన రాలేదు. ఎవరూ కౌంటర్ ఇవ్వలేదు. ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా సేవా పఖ్వాడా కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర పార్టీ పిలుపునిచ్చింది. కానీ ఎక్కడా చేయడం లేదు. పురందేశ్వరి మాత్రం పుట్టిన రోజు నాడు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఏపీ బీజేపీలో లో పురందేశ్వరి అధ్యక్షురాలిగా వచ్చిన తర్వాత జోష్ రావాల్సింది పోయి నీరసం వచ్చిందన్న అభిప్రాయంలో ఆ పార్టీ క్యాడర్ ఉన్నారు