తెలంగాణ బీజేపీలో నాయకత్వ మార్పు కూడా పరిస్థితుల్ని దారికి తీసుకురావడం లేదు. అసంతృప్తి వాదులు పెరిగిపోతున్నారు. కొంత మంది సైలెంట్ గా ఉంటూండగా.. మరికొంత మంది కాంగ్రెస్ నేతల్ని పొగడటం ప్రారంభించారు. రహస్య సమావేశాలు నిర్వహిస్తూ భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. అమిత్ షా పర్యటన తర్వాత కూడా అదే పరిస్థితి నెలకొంది. బీజేపీ తరపున పార్లమెంట్ అభ్యర్థులు అవుతారనుకుంటున్న కొంత మంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న చర్చ జరుగుతోంది. మూడు రోజుల క్రితం బీజేపీలోని అసంతృప్త నేతలు మాజీ ఎంపీ వివేక్ ఫామ్ హౌస్‌లో సమావేశం అయ్యారని బీజేపీలో ఒక్క సారిగా పుకారు గుప్పు మంది. ఈ సమావేశానికి మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, విజయశాంతి, రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, సీనియర్ నేతలు గరికపాటి రామ్మోహనరావు, చాడా సురేశ్‌రెడ్డిలు హాజరయ్యారని చెబుతున్నారు. బీజేపీ అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం గత కొంతకాలంగా తమ పట్ల అనుసరిస్తున్న తీరుపై వీరంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమను పట్టించుకోవడం లేదని పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదని వారు భావిస్తున్నారు.
బీజేపీ బీఆర్‌ఎస్‌కు దగ్గరవుతుండటంతో పాటు పార్టీలో బండి, ఈటల, కిషన్‌రెడ్డికే ప్రాధాన్యతనిస్తున్నారని అసంతృప్త నేతలు భావిస్తున్నారు. ఇదే విషయమై గతంలో కూడా ఈ సీనియర్లు తమ నిరసన గళాలను విప్పారు. అధిష్టానంతో తాడో పేడో తేల్చుకోవాలని భావించినా… ఢిల్లీ పెద్దల జోక్యంతో అది అప్పటికి ఆగిపోయింది. కానీ ఇటీవల మారిన రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా కాంగ్రెస్‌కు జోష్ పెరిగిందనే వాతావరణం ఏర్పడటంతో మళ్లీ ఈ సీనియర్లందరూ తమ భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు జరిపినట్టు తెలిసింది. ఈ ఎనిమిది మందిలో ఐదారుగురిని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించాలని బీజేపీ భావించింది. ప్రస్తుతం వారు రహస్యంగా భేటీ కావటం, కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే సంకేతాలతో కమలంలో కలకలం రేగుతోంది. సీడబ్ల్యూసీ భేటీ, విజయభేరి సభ కోసం మూడు రోజుల పాటు హైదరాబాద్ లో ఉన్న సోనియా దృష్టిలో పడేందుకు సీనియర్ నేత విజయశాంతి ప్రయత్నించారు.
సోనియాగాంధీని వ్యక్తిగతంగా గౌరవిస్తానని ప్రకటించారు. విజయశాంతి ట్వీట్ చేయటం బీజేపీలో కీలక పరిమామాలకు దారి తీస్తోంది. గతంలో ఈటల రాజేందర్ కూడా అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ అవసరం బీఆర్ఎస్‌కు ఏర్పడేలా సీట్లు తెచ్చుకోవాలన్న టార్గెట్ మాత్రమే అమిత్ షా పెట్టినట్లుగా ప్రచారం జరుగుతూండటంతో.. బీఆర్ఎస్ ను ఓడించాలన్న తమ సంకల్పం నెరవేరదని.. కొంత మంది అసంతృప్తి చెందుతున్నారు. వీరు పార్టీ మారుతారా లేదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.