మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిమాండ్ ను ఈ నెల 24 వరకు విజయవాడ ఏసీబీ కోర్టు పొడిగించింది. శుక్రవారం నాడు సిఐడి చంద్ర బాబును వీడియో కాన్ఫిరెన్స్ లో జడ్జి ముందు ప్రవేశపెట్టింది. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం నాది. నాకు నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారు. నా తప్పు ఉంటే విచారణ చేసి అరెస్టు చేయాల్సింది. ఈ వయసులో నాకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు. నా పై ఉన్నవి ఆరోపణలు మాత్రమే.. నిర్ధారణ కాలేదు. చట్టం ముందు అందరూ సమానమే.. చట్టాన్ని గౌరవిస్తా. న్యాయం గెలవాలి.. చట్టం ముందు అందరూ సమానమే. నేను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. నన్ను అకారణంగా జైల్లో పెట్టారు. నా బాధ ఆవేదనంతా అదే. నా గురించి దేశంలో, రాష్ట్రంలో అందరికీ తెలుసని చంద్రబాబు కోర్టుకు విన్నవించుకున్నారు. చంద్రబాబు చెప్పిన విషయాలు నోట్ చేసుకున్నానని జడ్జి అన్నారు. మీపై ఆరోపణలు మాత్రమే వచ్చాయి.
దర్యాప్తులో అన్ని విషయాలు తేలుతాయి. రిమాండ్ ను శిక్షగా భావించొద్దు. ఇది చట్ట ప్రకారం జరుగుతున్న కార్యక్రమమని జడ్జి వ్యాఖ్యానించినట్లు సమాచారం. చంద్రబాబు రిమాండ్ పొడిగించాలని సీఐడీ వాదనతో కోర్టు ఏకీభవించింది. దాంతో చంద్రబాబు ఈ నెల 24 వరకు రిమాండ్ లో వుంటారు.