ind-chi
జాతీయం రాజకీయం

క్రీడాకారులపై చైనా చిన్న చూపు.. భారత్ ఆగ్రహం

చైనాలో 19వ ఆసియా క్రీడల జరగనున్నాయి. అయితే ఇందుకు సంబంధించి ఇండియాకు చెందిన క్రీడాకారులపై చైనా వివక్ష చూపుతోందని వార్తలు వచ్చాయి. అంతేకాదు ముఖ్యంగా అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందినటువంటి క్రీడాకారులకు వీసాలతోసహా అక్రిడిటేషన్‌ను కూడా నిరాకరించినట్లు సమాచారం. అయితే దీనిపై తాజాగా ఇండియా తన స్పందనను తెలియజేసింది. అంతేకాదు క్రీడాకారులను అడ్డుకునేందుకు చైనా ఉద్దేశపూర్వకంగానే ఇలాంటీ చర్యలకు దిగిందని ఆరోపించింది. ఈ అంశంపై అధికారికంగా తమ నిరసనను తెలియజేసింది. ఇదిలా ఉండగా.. కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సైతం చైనా పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు భారత విదేశాంగశాఖ తెలిపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని హాంగ్‌జౌలో జరగనున్న 19వ ఆసియా క్రీడల ప్రవేశానికి ఇండియాలోని అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన కొందరు క్రీడాకారులకు అక్రిడిటేషన్‌ నిరాకరించినట్లు భారత ప్రభుత్వం దృష్టికి వచ్చింది.ఉద్దేశపూర్వకంగానే భారత క్రీడాకారులపై చైనా ఇలాంటి వివక్ష చూపినట్లు తెలుస్తోంది.

అయితే స్థానికత, వర్గం ఆధారంగా తమ దేశ పౌరులను భిన్నంగా చూడటం పట్ల భారత్‌ గట్టిగా తిరస్కరిస్తోంది. అలాగే అరుణాచల్‌ప్రదేశ్‌ ప్రాంతం ఎప్పటికీ భారత్‌లో భాగమేనని భారత విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శి అరిందమ్‌ బాగ్చి తెలిపారు. భారత క్రీడాకారులపై ఉద్దేశపూర్వకంగా, ఎంపిక పద్ధతిలో వివక్ష చూపడం పట్ల ఢిల్లీతోపాటు అటు బీజింగ్‌లోనూ భారత్‌ తమ నిరసను వ్యక్తం చేసింది. చైనా పాల్పడ్డ ఇలాంటి చర్యలు నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందంటూ పేర్కొంది. తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకునే హక్కు ఇండియాకు ఉంటుందని చెబుతూ విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు సరిహద్దుల విషయంలో పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి చైనా ఇటీవల మరోసారి అలాంటి చర్యకే పాల్పడింది. అరుణాచల్‌ప్రదేశ్‌, అక్సాయ్‌ చిన్‌లను తమ భూభాగంలో చూపుతూ ఓ కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. దీంతో ఇది దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అంతేకాదు దీనిపై భారత ప్రభుత్వం కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి తప్పుడు చర్యలకు పాల్పడటం సరిహద్దు వివాదాలను మరింత రగల్చడమేనని ఆగ్రహం వ్యక్తంచేసింది.

అసలు ఎటువంటి ఆధారాలు అనేవి లేకుండా మ్యాప్‌ను రూపొందించడంపై మండిపడింది. అయితే దౌత్యమార్గాల్లో దీనిపై గట్టి నిరసన వ్యక్తం చేసినప్పటికీ కూడా ఇదంతా చట్టం ప్రకారమే చేస్తున్నామంటూ చైనా తమ చర్యను సమర్థించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే చైనా ఇలా తప్పుడు మ్యాప్ విడుదల చేసినంత మాత్రాన ఎలాంటి మార్పులు జరగవంటూ భారత్ గట్టి కౌంటర్ వేసిన సంగతి తెెలిసిందే.