lokesh
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

రాజోలు నుంచి తిరిగి యువగళం పాదయాత్ర

నారా లోకేశ్ యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. వచ్చే వారం నుంచి పాదయాత్ర మొదలయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్రను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే యువగళం పాదయాత్రను వచ్చేవారం నుంచి తిరిగి ప్రారంభించే యోచనలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు అరెస్టుతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ వద్ద లోకేశ్ పాదయాత్ర నిలిపివేశారు. తిరిగి అక్కడ నుంచే యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. చంద్రబాబు అరెస్టు, అనంతరం పరిస్థితులపై పార్టీ ముఖ్యనేతలతో లోకేశ్‌ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పాదయాత్రను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం.వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలకు పాల్పడినా చంద్రబాబుపై అవినీతి మరక వేయలేకపోయారని ఈ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు.

ప్రజలు, టీడీపీ నేతలు చేపడుతున్న నిరసన కార్యక్రమాలను వైసీపీ ప్రభుత్వం పోలీసులతో అణిచివేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలిపిన వారిపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు కేసు విషయంలో దిల్లీలో న్యాయవాదులతో నిత్యం సంప్రదిస్తున్నట్లు లోకేశ్‌ పేర్కొన్నారు. కోర్టులో పోరాడుతూ… జనంలోకి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. చంద్రబాబు అరెస్టు, వైసీపీ ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపును ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నాయకులంతా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని నిర్ణయించారు.యువగళం మళ్లీ మొదలవుతుందని వార్తలు రాగానే, వైసీపీ విష ప్రచారం మొదలుపెట్టిందని టీడీపీ ఆరోపించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకు కుయుక్తులు చేస్తున్నారని మండిపడింది. యువగళం సమన్వయకర్త కిలారు రాజేష్ పరారీ అంటూ వైసీపీ విష ప్రచారం చేస్తుందని మండిపడింది. ఎలాగైనే యువగళం పాదయాత్రను జరగనివ్వకూడదని జగన్ ఆదేశాలతో రకరకాల ప్లాన్లు వేస్తున్నారని ఆరోపించారు.లోకేశ్ సన్నిహితుడు, గతంలో కాంట్రాక్టర్ల దగ్గర నుంచి చంద్రబాబు పేరిట ముడుపులు తీసుకున్న కిలారు రాజేష్ పరారీలో ఉన్నారని వైసీపీ ఆరోపించింది.

చంద్రబాబుకు ఇచ్చిన నోటీసుల్లోనూ కిలారు రాజేష్ పేరును ఐటీ శాఖ పేర్కొందని తెలిపింది. అంతేకాకుండా స్కిల్ స్కామ్ లో కొట్టేసిన వందల కోట్ల నిధులను షెల్ కంపెనీల నుంచి రికవరీ చేసి మళ్లీ చంద్రబాబుకు, లోకేశ్ కు చేర్చడంలో రాజేష్ కీలకపాత్ర పోషించారని వైసీపీ ట్వీట్ చేసింది. దీంతో చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్ లోనూ కిలారు రాజేష్ పేరును సీఐడీ పేర్కొందని తెలిపింది. చంద్రబాబును విచారించిన సమయంలోనూ రాజేష్ పాత్ర మీద సీఐడీ ప్రశ్నలు సంధించిందని తెలిపింది. చంద్రబాబు అరెస్ట్ అవ్వగానే లోకేశ్ తో పాటు దిల్లీ వెళ్లిన రాజేష్ ఇప్పుడు అక్కడి నుంచి విదేశాలకు పరారయ్యారని ఆరోపించింది. దీంతో ఆయన కోసం సీఐడీ వెతుకులాట ప్రారంభించిందని తెలిపింది. మొత్తానికి కోట్లు కొట్టేసిన ఒక్కొక్కడూ చెట్టుకోపిట్ట అన్నట్లు పారిపోయారని ఎద్దేవా చేసింది.