ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసు విషయంలో ఇప్పటికే అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇదే సమయంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీంతో స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంపై చర్చ జరుగుతుందని.. కేసు గురించి వాస్తవాలు వివరించేందుకు అధికార, ప్రతిపక్షాలకు చక్కటి అవకాశం దొరికిందనుకున్నారు. అయితే, సమావేశాల్లో పాల్గొంటామని, చంద్రబాబు అరెస్టుపై గళం విప్పుతామని టీడీపీ ప్రకటించి సమావేశాలకు హాజరైంది. సభ ప్రారంభమవడంతోనే టీడీపీ సభ్యులు చంద్రబాబు అరెస్టుపై చర్చించాలంటూ నినాదాలు, ఆందోళనలు.. టీడీపీకి వైసీపీ సభ్యుల కౌంటర్ ఇలా సభ గందరగోళంగా మారింది. శాసనసభ అలా ఉంటే.. మండలిలోనూ అదే రచ్చ కొనసాగింది. ఇలా గందరగోళం అనంతరం.. టీడీపీ సభ్యుల సస్పెన్షన్.. సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం అంతా జరిగిపోయింది. అయితే, చంద్రబాబు అరెస్టు, స్కిల్ స్కామ్ పై చర్చ.. ఇలా అనేక విషయాలపై చర్చించే అవకాశాన్ని వాడుకోవడంలో టీడీపీ.. వ్యూహాత్మక తప్పిదం చేసిందా..? అనే ప్రశ్నలు ఇప్పుడు పుట్టుకొస్తున్నాయి.
చంద్రబాబుపై అక్రమంగా కేసులు బనాయించారని మొదటి రోజు నుంచి.. మైకుల ముందు వాదిస్తున్నారు టీడీపీ నేతలు.. ఇదే విషయాన్ని అసెంబ్లీలో వినిపించి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకులు నుంచి వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అసెంబ్లీలో జరిగే ప్రతి విషయం ప్రజల్లోకి వెళ్తుంది. తమ పార్టీకి కేటాయించే విలువైన సమయాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వ ఆరోపణలను తిప్పి కొట్టి ఉంటే.. టీడీపీ వాదన ప్రజల్లోకి బలంగా వెళ్లేది. కానీ, ఆ అంశంపై సభలో మాట్లాడకపోవడానికి కారణం ఏంటో టీడీపీకే తెలియాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు..సాధారణంగా ఎప్పుడు సమావేశాలు జరిగినా మైక్ విషయంలో ప్రభుత్వంపై.. ప్రతిపక్ష టీడీపీ అనేక ఆరోపణలు చేస్తుంది. తమకు మైక్ ఇవ్వడం లేదనీ.. మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది. కానీ ఈసారి మాత్రం టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు సిద్ధమని స్వయంగా మంత్రి బుగ్గన సభలో ప్రకటించారు. అయినా సభలో గందరగోళంతో సస్పెన్షన్‌కు గురై.. మొదటిరోజు సభ నుంచి బయటికి వెళ్లిపోయారు. ఇక రెండో రోజు కూడా సభలో కొంతమంది సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. అదే సమయంలో మిగలిన సభ్యులు కూడా సభ నుంచి వెళ్లిపోయారు.
సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.స్కిల్ స్కామ్‌పై చర్చ సందర్భంగా టీడీపీ తమ వాదన వినిపించి ఉంటే అసెంబ్లీ రికార్డులకు ఎక్కేది. కానీ టీడీపీ సభ్యుల వైఖరితో కనీసం సభలో తమ అధినేతపై వచ్చిన ఆరోపణలను ఖండించినట్లు కూడా రికార్డులకి ఎక్కలేదు. కొన్ని కీలక అంశాల్లో గతంలో ఉన్న రికార్డులను కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తుంటారు. కానీ చంద్రబాబు విషయంలో మాత్రం ఆ అవకాశం లేకుండా పోయింది. అసెంబ్లీకి దూరంగా ఎక్కడో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇవ్వడం కంటే సభలోనే మాట్లాడి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.