అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీతో రిలయన్స్ ఒప్పందం
వ్యూహాత్మక భాగస్వామ్యంతో జాయింట్ వెంచర్
అబుదాబిలో రువాయస్‌లో పెట్రోకెమికల్ కాంప్లెక్స్
దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) మరో కీలక ఒప్పందాన్ని చేసుకుంది. ఇటీవల రిలయన్స్ 44 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆర్‌ఐఎల్ అధినేత ముఖేశ్ అంబానీ ప్రకటించిన అంతర్జాతీయీకరణ వ్యూహంలో తొలి అడుగు వేసింది. ఇందులో భాగంగా అబుదాబి ప్రభుత్వానికి చెందిన కంపెనీతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. అబుదాబిలోని రువాయిస్‌లో కొత్త పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఏడీఎన్‌ఓసీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ ప్రకారం ఏడ్‌నాక్, రిలయన్స్ సంయుక్తంగా క్లోర్-ఆల్కలీ, ఇథిలీన్ డైక్లోరైడ్, పాలీ వినైల్ క్లోరైడ్ (పీవీసీ) ని ఉత్పత్తి చేయనున్నాయి. దీనికి సంబంధించి అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఎడిఎన్‌ఓసి) అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
ఒప్పందం నిబంధనల ప్రకారం, ఈ ఇంటిగ్రేటెడ్ ప్లాంట్‌లో ఏడాదికి 9.40లక్షల టన్నుల క్లోర్-ఆల్కలీ, 1.1 మిలియన్ టన్నుల ఇథిలీన్ డైక్లోరైడ్, 3.60లక్షల టన్నుల పీవీసీ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుందని ఆర్‌ఐఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్ట్ భారతదేశంలో పీవీసీ ఉత్పత్తికి కీలకమైన బిల్డింగ్ బ్లాక్ అయిన ఇథిలీన్ డైక్లోరైడ్‌ను తయారు చేస్తుందనీ, తమ కార్యకలాపాలను ప్రపంచీకరించడంలో ఇదొక ముఖ్యమైన దశ అని రిలయన్స్ ఛైర్మన్ అండ్ ఎండీ, ముఖేశ్ అంబానీ అన్నారు. ఈ రసాయనాల మార్కెట్ డిమాండ్ అవసరాలకు, ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికాలో స్థిరమైన వృద్ధిని సాధిస్తుందన్నారు.
ప్రతిపాదిత జాయింట్ వెంచర్ టాజిజ్ (TA’ZIZ)ఇండస్ట్రియల్ కెమికల్స్ జోన్‌లో నిర్మించబడుతుంది. వాటర్ ట్రీట్‌మెంట్, వస్త్రాలు , లోహాల తయారీలో క్లోర్-ఆల్కాలిని ఉపయోగిస్తారు. అల్యూమినియం ఉత్పత్తికి అవసరమైన కాస్టిక్ సోను ఉత్పత్తి చేయనుంది. గృహనిర్మాణం, ఇతర వినియోగ వస్తువుల్లో విరివిగా వినియోగిస్తున్నపీవీసీని ఉత్పత్తి చేయడానికి ఇథిలీన్ డైక్లోరైడ్ వినియోగిస్తారు. అయితే పెట్టుబడి వివరాలు వెల్లడికానప్పటికీ పెట్రో కెమికల్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి 30వేల కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని చమురు రంగ నిపుణులు భావిస్తున్నారు.