జాతీయం ముఖ్యాంశాలు

కోవిడ్ మృతుల‌కు ప‌రిహారంపై మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందించండి : సుప్రీం

కోవిడ్‌తో మృతిచెందిన కుటుంబాల‌కు ప‌రిహారం అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో వాద‌న‌లు జ‌రిగాయి. కోవిడ్ బాధిత కుటుంబాల‌కు ఎక్స్‌గ్రేషియా ఎంత ఇవ్వాల‌న్న దానిపై మార్గ‌ద‌ర్శ‌కాలు త‌యారు చేయాల‌ని ఎన్డీఎంఏ(నేష‌న‌ల్ డిజాస్ట‌ర్ మేనేజ్మెంట్ అథారిటీ)ను సుప్రీం ఆదేశించింది. అయితే ఎంత న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాల‌న్న దానిపై ఎన్డీఎంఏనే డిసైడ్ చేసుకునేలా కోర్టు తీర్పునిచ్చింది. ఆరు వారాల‌ వ్య‌వ‌ధిలోగా ఆ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందించాల‌ని కోర్టు ఆదేశించింది. సాధార‌ణ ప్ర‌మాణాల ప్ర‌కారం న‌ష్ట‌ప‌రిహారంపై గైడ్‌లైన్స్ త‌యారు చేయాల‌ని ఎన్డీఎంఏను ఆదేశించామ‌ని, అయితే ఎంత ఇవ్వాల‌న్న దానిపై మాత్రం ఆ సంస్థ‌కే స్వేచ్ఛ‌ను ఇచ్చిన‌ట్లు కోర్టు చెప్పింది. డిజాస్ట‌ర్ మేనేజ్మెంట్ యాక్ట్‌లోని 12వ సెక్ష‌న్ ప్ర‌కారం న‌ష్ట‌ప‌రిహారాన్ని ఫిక్స్ చేయ‌నున్నారు. కోవిడ్‌తో చ‌నిపోయివారికి ఇచ్చే డెత్ స‌ర్టిఫికేట్‌లో తేదీ, ఏ కార‌ణం చేత మ‌రణించాడో ఉండాల‌ని కోర్టు తెలిపింది. బాధితుల మృతి ప‌ట్ల ఏదైనా అనుమానం ఉన్నా.. ఆ స‌ర్టిఫికేట్‌లో మార్పుల కోసం అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు కోర్టు పేర్కొన్న‌ది. జ‌స్టిస్ అశోక్ భూష‌ణ్‌, ఎంఆర్ షాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ తీర్పును ఇచ్చారు. కోవిడ్ మృతుల‌కు 4 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాల‌ని దాఖ‌లైన పిటీష‌న్ల‌ను సుప్రీం విచారించింది. ఈ నేప‌థ్యంలో కోర్టు ఈ వ్యాఖ్య‌లు చేసింది.