10th
ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

ఇక టెన్త్ లో ఏడు పేపర్లే

ఆంధ్రప్రదేశ్‌లో జరిగే పదో తరగతి పరీక్షల్లో తెలుగు కాంపోజిట్ రద్దు చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ ఏడాది యథాతథంగా తెలుగు కాంపోజిట్ పరీక్షను కొనసాగించనున్నారు.ఆంధ్రప్రదేశ్‌ సెకండరీ బోర్డ్‌ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో కాంపోజిట్‌ తెలుగు పరీక్షను కొనసాగించాలని నిర్ణయించారు. ఇప్పటికే విద్యా సంవత్సరం సగానికి పైగా పూర్తి కావడంతో వచ్చే ఏడాది నుంచి ఈ పరీక్షను తొలగించాలని నిర్ణయించారు.పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఈ ఏడాది కూడా కాంపోజిట్‌ తెలుగు, కాంపోజిట్‌ సంస్కృతం పేపర్లను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితం విద్యార్ధులపై ఒత్తిడి తగ్గించే క్రమంలో ఈ పేపర్లను రద్దు చేస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. దీంతో కాంపోజిట్‌ ప్రశ్నపత్రంపై విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్ధుల్లో గందరగోళం నెలకొంది.విద్యా సంవత్సరం మధ్యలో పరీక్షల విధానంలో మార్పు చేయడంపై విమర్శలు రావడంతో ప్రభుత్వం రద్దు నిర్ణయంపై వెనక్కి తగ్గింది.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి కాంపోజిట్ పరీక్షలను తొలగించాలని నిర్ణయించింది. 2025లో జరిగే పదో తరగతి పరీక్షల్లో కాంపోజిట్‌ ప్రశ్నపత్రం ఉండదని స్పష్టత ఇచ్చారు.కాంపోజిట్‌ విధానంలో తెలుగుకు 70 మార్కులు, కాంపోజిట్‌ సంస్కృతం 30 మార్కులకు ఉంటుంది. ఇదే విధానాన్ని ఉర్దూ/హిందీ, ఉర్దూ/అరబిక్‌, ఉర్దూ/ పార్శి పేపర్లకు అమలు చేయనుంది.పదో తరగతి పరీక్షల్లో ఈ ఏడాది ఏడు పేపర్లు ఉండనున్నాయి. ఫిజిక్స్‌, కెమిస్ట్రీలకు కలిపి ఒక పేపర్‌గా 50 మార్కులకు, బయాలజీకి 50 మార్కులకు మరో పేపర్‌‌లో పరీక్ష ఉంటుంది. ఈ రెండు పరీక్షలను వేర్వేరు రోజుల్లో నిర్వహిస్తారు. రెండు పరీక్షల్లో 17 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. రెండింటిలో కలిపి 35 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులైనట్లు ప్రకటిస్తారు.మిగిలిన సబ్జెక్టులైన తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం, సాంఘికశాస్త్రం పేపర్లు యథావిధిగా ఉంటాయి. పదో తరగతి పరీక్షల్లో తెలుగు, హిందీలో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్‌ అవుతుండటంతో ప్రశ్నపత్రం విధానంలో మార్పు చేశారు.తెలుగు ప్రశ్నపత్రంలో ఇప్పటి వరకు ఉన్న ప్రతిపదార్థం, భావం రాసే ప్రశ్నను తొలగించారు. దాని స్థానంలో ఒక పద్యం ఇచ్చి దానిపై ప్రశ్నలిచ్చే విధానాన్ని తీసుకొచ్చారు. పద్యంపై నాలుగు ప్రశ్నలు ఇస్తారు. ఒక్కోదానికి రెండు చొప్పున 8మార్కులకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

రెండో ప్రశ్నగా ఇప్పటి వరకు పద్యం, దాని భావానికి సంబంధించి 8 మార్కులు ఉండగా.. ఇప్పుడు ప్రశ్నగా గద్యాన్ని చదివి, నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. దీనిలో ఒక్కో ప్రశ్నకు రెండు చొప్పున మార్కులు ఉంటాయి.హిందీ పరీక్షలో విద్యార్థులు తేలికగా ఉత్తీర్ణులయ్యేలా ప్రశ్నపత్రాన్ని మార్చేశారు. గతంలో బిట్‌ పేపర్‌ను తొలగించారు. విద్యార్ధులకు సులువుగా ఉండేలా అదే విధానాన్ని తిరిగి తీసుకొచ్చారు. 14 ఒక మార్కు ప్రశ్నలు, 19 రెండు మార్కుల ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఎక్కువగా మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి.