కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఉండటంతో రెండు పార్టీల మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. కేటీఆర్ చేసిన ఒక ట్వీట్‌కి కౌంటర్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి రీట్వీట్లు మొదలయ్యాయి. కోమటిరెడ్డి లాంటి సీనియర్ లీడర్స్, టీపీసీసీ ధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్వీట్లతో బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డారు. కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో కాంగ్రెస్‌ను ఉద్దేశించి కర్ణాటకలో ఎన్నికైన కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం.. తెలంగాణ ఎన్నికలకి కాంగ్రెస్‌కు ఫండింగ్ చేసేందుకు చదరపు అడుగుకి 500 రూపాయల రాజకీయ ఎన్నికల పన్ను రియల్ ఎస్టేట్ బిల్డర్ల నుంచి వసూలు చేస్తోందని.. కాంగ్రెస్ పార్టీకి స్కాములు వారసత్వమని అందుకనే దాన్ని కాంగ్రెస్ కాదు స్కామ్ గ్రేస్ అని పిలవాలని ట్వీట్ చేశారు కేటీఆర్. అయితే దీనికి ప్రతిగా కాంగ్రెస్ నేతలు స్పందించారు. ఉద్యమ పార్టీగా ప్రారంభమైన గులాబి పార్టీ తొమ్మిదేళ్లలో వేల కోట్లను దోచిందని బీఆర్ఎస్ పార్టీకి 900 కోట్ల ఎలక్షన్ ఫండ్ ఎక్కడినుంచి వచ్చిందని ప్రశ్నించారు.
కేటీఆర్, కేసీఆర్ 90 వేల కోట్లని అక్రమంగా దోచేశారని ఆస్తులన్నీ బినామీల పేర్ల మీద ఉన్నాయని ట్వీట్ చేశారు. ఇక పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్‌కు రిట్వీట్ చేస్తూ స్పందించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలను చూసి తండ్రికి చలి జ్వరం పట్టుకుంటే, కొడుకేమో పూర్తిగా మతి తప్పినట్టుగా మాట్లాడుతున్నాడు అని రేవంత్ ట్వీట్ చేశారు. నిండా అవినీతిలో మునిగి, నిద్రలో కూడా కమీషన్ల గురించే కలవరించే మీరా కాంగ్రెస్ గురించి మాట్లాడేది? పక్క రాష్ట్రంపై నీ గాలి మాటలను కాసేపు పక్కనబెట్టి, తెలంగాణలో మీ కల్వకుంట్ల స్కామ్లీ గురించి చెప్పు అంటూ కేటీఆర్ చేసిన స్కామ్ గ్రేస్ అనే మాటకి కౌంటర్ గా కేసీఆర్ ఫ్యామిలీని స్కామిలీగా సంబోధించారు. దళిత బంధులో 30 శాతం కమీషన్లు దండుకుంటున్నమని స్వయంగా మీ తండ్రి ఒప్పుకున్న సంగతి గురించి చెప్పు.. లిక్కర్ స్కామ్ లో మీ చెల్లి రూ.300 కోట్లు వెనకేసిందని దేశమంతా చెప్పుకుంటున్న మాటల గురించి చెప్పు.. భూములు, లిక్కర్ అమ్మితే తప్ప తెలంగాణలో పాలన నడుస్తలేదని కాగ్ కడిగేసిన విషయం గురించి చెప్పు.. అని ప్రశ్నించారు.
తెలంగాణలో ఎన్ని ప్రభుత్వ భూములను అమ్ముకున్నారో, ఎన్ని ఎకరాలను మీ రియల్ ఎస్టేట్ మాఫియాకు కట్టబెట్టిండ్రో, ఎంత మంది మీ బినామీ బిల్డర్లతో హైదరాబాద్ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నరో, ఎన్ని లక్షల చదరపు అడుగుల స్థలాలు మీ మాఫియా కబంధ హస్తాల్లో చిక్కుకున్నయో.. అన్నీ లెక్కలతో సహా తేలుస్తామని అన్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలపై ప్రణాళికలు రచిస్తున్నాయి.