చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా నారా భువనేశ్వరి సత్యాగ్రహ దీక్ష
మా కుటుంబాన్ని జైలులో పెట్టాలన్నదే వైసీపీ నేతల ఆలోచన అని నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా సోమవారం నాడు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ దీక్షను కొద్ది సేపటి క్రితం విరమించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ…‘‘ చంద్రబాబునాయుడు కోసమో.. మా కుటుంబం కోసమో కాదు.. రాష్ట్ర ప్రజల క్షేమం కోసమే ఈ సత్యాగ్రహ దీక్ష చేపట్టాం. మహాత్మాగాంధీ లాంటి వారికే జైలు జీవితం తప్పలేదు. ఏనాడు మా కుటుంబంపై అవినీతి ఆరోపణలు లేవు. మేం ఎప్పుడూ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు. మహాత్మాగాంధీ స్వాతంత్య్రం కోసం పోరాడి జైలుకి వెళ్లారు. ప్రజలకు సేవ చేయాడానికి చంద్రబాబు నిత్యం పరితపించారు. చంద్రబాబు నీతిగా బతికారు. మా తండ్రి ఎన్టీఆర్ నీతిగా బతకటం నేర్పారు.
చంద్రబాబు జైలులో, లోకేష్ డిల్లీలో, నేను బ్రాహ్మణి రాజమండ్రిలో ఉన్నాం. ఇలాంటి రోజు మా కుటుంబానికి వస్తుందనే అనుకోలేదు. చంద్రబాబు ఎప్పుడూ పోలవరం, అమరావతి కోసమే ఆలోచించేవారు. ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు ఎన్నో కలలు కన్నారు.చంద్రబాబు మీద నమ్మకంతో హైదరాబాద్‌లో.. బిల్ క్లింటన్, బిల్ గేట్స్ పెట్టుబడులు పెట్టారు’’ అని భువనేశ్వరి పేర్కొన్నారు.