తెలంగాణలో ఎన్నికల సమరం మొదలైంది. ఎన్నికలకు రెండు నెలలు మాత్రమే సమయం ఉండటం, త్వరలోనే షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉండటంతో పార్టీలన్నీ దూకుడు పెంచాయి. అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియను వేగవంతం చేసుకోవడంతో పాటు ప్రచారాన్ని పార్టీలన్నీ మొదలుపెట్టాయి. పార్టీల ముఖ్య నేతలందరూ వరుస పర్యటలతో ప్రజల్లోకి వెళుతూ వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించాలని కోరుతున్నారు.బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పాటు బీఎస్పీ కూడా ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో తమ సత్తాను చాటాలని చూస్తోంది. వచ్చే ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో పోటీలోకి దిగేందుకు సిద్దమవుతోంది. అందులో భాగంగా మంగళవారం బీఎస్పీ తొలి జాబితాను విడుదల చేసింది. తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 20 మంది అభ్యర్థులతో కూడిన ఫస్ట్ లిస్ట్‌ను రిలీజ్ చేశారు. ఈ లిస్ట్ చూస్తే.. వచ్చే ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. సిర్పూర్ నుంచి తాను పోటీ చేస్తానని ఎప్పటినుంచో ప్రవీణ్ కుమార్ చెబుతూ వస్తున్నారు. ఆయన చెప్పినట్లుగానే ఆ సెగ్మెంట్ నుంచి పోటీ చేయనున్నారు.
తొలి జాబితాలో నాగర్ కర్నూల్ నుంచి కొత్తపల్లి కుమార్, అందోల్ నుంచి ముప్పారపు ప్రకాష్, కోదాడ నుంచి పిల్లిట్ల శ్రీనివాస్, వనపర్తి నుంచి నాగమోని చెన్న రాముడు, నకిరేకల్ నుంచి మేడి ప్రియదర్విని, ధర్మపురి నుంచి నక్క విజయ్ కుమార్, వైరా నుంచి బానోత్ రాంబాబు నాయక్, మానకొండూరు నుంచి నిషాని రామంచందర్, జహీరాబాద్ నుంచి జంగం గోపీ, పాలేరు నుంచి అల్లిక వెంకటేశ్వర్ రావు, చొప్పదండి నుంచి కొంకటి శేఖర్, పెద్దపల్లి నుంచి దాసరి ఉష, దేవరకొండ నుంచి ముడావత్ వెంకటేష్ చౌహాన్‌లకు సీటు దక్కిందిఅటు కొత్తగూడెం నుంచి ఎర్ర కామేష్, సూర్యాపేట నుంచి వట్టే జానయ్య యాదవ్, ఖానాపూర్ నుంచి బాన్సీలాల్ రాథోడ్, అందోల్ నుంచి ముప్పారపు ప్రకాష్, వికారాబాద్ నుంచి గోర్లకాడి క్రాంతి కుమార్, జుక్కల్ నంచి మాధవరావులకు తొలి జాబితాలో అవకాశం దక్కింది. తెలంగాణ బీఎస్పీ సీఎం అభ్యర్ధిగా ఇప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరును బీఎస్పీ అధినేత మాయావతి ప్రకటించారు. ఐపీఎస్‌కు స్వచ్చంధ పదవి విరమణ చెసిన ఆర్‌ఎస్పీ.. ఆ తర్వాత బీఎస్పీలో చేరారు. ఆయనను తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడిగా మాయావతి నియమించారు. గత రెండేళ్లుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు.
ప్రజల సమస్యలను తెలుసుకుని వారికి భరోసా కల్పిస్తున్నారు. అలాగే కేసీఆర్ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తప్పుబడుతూ వస్తున్నారు. కేసీఆర్‌పై ఆయన చేసే తీవ్ర విమర్శలు రాజకీయ వర్గాల్లో హీట్ పుట్టిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎన్నికల సమయంలో విమర్శల వేడిని మరింత పెంచుతున్నారు. అలాగే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉండే ఆర్‌ఎస్పీ.. ప్రజా సమస్యలపై ట్వీట్లు పెడుతూ ఉంటారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా వేదికగా ఎండగడుతూ ఉంటారు. అలాగే రాష్ట్రంలో బీఎస్పీని సమర్థవంతంగా నడిపిస్తున్నారు.