ముఖ్యాంశాలు

చేరికలు……నిష్క్రమణలు…

కర్ణాటక విజయం తర్వాత తెలంగాణలో ఫుల్‌ జోష్‌లో ఉన్న కాంగ్రెస్‌ గెలుపు తనదేనంటోంది. కొత్త నేతల చేరికలు పార్టీకి ఊపుతీసుకొచ్చినా అదే సమయంలో కొందరు ముఖ్యనేతల నిష్క్రమణలు పార్టీకి సవాలుగా మారాయి. టికెట్ల ప్రకటన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన ఆ పార్టీకున్నా.. ఏఐసీసీ సర్వేలే ప్రాతిపదికగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ముందే సంకేతాలిస్తున్నారు పార్టీ నేతలు. అభయహస్తంపేరుతో ఆ పార్టీ స్కీములు ప్రకటిస్తోంది. పది పోలింగ్‌ స్టేషన్లకు ఒక ఇంచార్జిని నియమించేలా ఎలక్షనీరింగ్‌పై కసరత్తుచేస్తోంది. అభ్యర్థుల ప్రకటన కాస్త ఆలస్యమైనా పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది కాంగ్రెస్‌. తిరగబడదాం- తరిమికొడదాం ఇదే ఇప్పుడు కాంగ్రెస్ ఎలక్షన్‌ స్లోగన్‌..అధికారంలో కొచ్చేది తామేనంటోంది. అంతర్గత విభేదాలున్నా, నేతల అలకలు ఆగకున్నా అధికారపీఠం అందుకోవాలన్న టార్గెట్‌తో.. వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది హస్తం పార్టీ.

ఆరు గ్యారంటీ స్కీములతో కన్నడ ఫార్ములాని తెరపైకి తెచ్చింది. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఆ ఆరు స్కీములను ప్రకటించిన కాంగ్రెస్‌.. ప్రజల్లోకి వాటిని విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉంది. మహిళలకోసం మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ల పథకం, యువ వికాస పథకం, చేయూత పథకంతో.. కర్ణాటక విక్టరీ ఇక్కడ కూడా రిపీట్‌ అవుతుందన్నది కాంగ్రెస్‌ ఆలోచన. తన మార్క్‌ స్కీములు ప్రకటించటంతో పాటు.. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అమలుచేస్తున్న పథకాలకు ఎక్స్‌టెన్షన్‌ ఇచ్చేలా ఉన్నాయ్‌ కాంగ్రెస్‌ హామీలు షాదీముబారక్‌ తరహా పథకంలో తులం బంగారం ఈ అడిషనల్‌ ఆలోచనే.అగ్రనేతల పర్యటనలు, హామీలతో కాంగ్రెస్‌ ప్రచారానికి హైప్‌వచ్చింది. డిక్లరేషన్లతో అందరి భవిష్యత్తుకూ హామీ ఇస్తోంది హస్తంపార్టీ. వరంగల్‌జిల్లాలో రైతు డిక్లరేషన్‌ ప్రకటించారు రాహుల్‌గాంధీ. యూత్‌ డిక్లరేషన్‌తో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్‌. ఇబ్రహీంపట్నం సభలో ప్రియాంకగాంధీ మహిళా డిక్లరేషన్‌ ప్రకటిస్తే, చేవెళ్ల సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్‌ ప్రకటించారు. ఈ డిక్లరేషన్లతో తన పాలసీని ప్రజల్లోకి వెళ్లేలా చేసుకోగలిగింది కాంగ్రెస్‌.

కాంగ్రెస్ తో వామపక్షాల పొత్తు
కాంగ్రెస్‌తో సీపీఎం, సీపీఐ పొత్తు ఖరారు అయింది. అంతేకాదు సీట్ల సర్దుబాటు కూడ ఒక కొలిక్కి వచ్చింది. సీపీఐ, సీపీఎంకు చెరో రెండు సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.ముందుగా సీపీఎం, సీపీఐకి చెరొక సీటు ఇవ్వాలని కాంగ్రెస్ భావించింది. కానీ కాంగ్రెస్ ప్రతిపాదనను కమ్యూనిస్టులు తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్ తలొగ్గి చెరోక రెండు స్థానాలు ఇచ్చేందుకు ఓకే చెప్పింది. సీపీఐకి కొత్తగూడెం, మునుగోడు నుంచి, సీపీఎంకు భద్రాచలం, మిర్యాలగూడ నుంచి టికెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించినట్లు తెలుస్తోంది. భద్రాచలం నుంచి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పోడెం వీరయ్య ఉన్నారు. అయినా అక్కడ వామపక్ష పార్టీల బలం ఎక్కువగా ఉండటంతో సీపీఎంకు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. పోడెం వీరయ్యను పినపాక నియోజకవర్గానికి పంపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావును బరిలోకి దింపే యోచనలో ఉంది.కాంగ్రెస్‌లో వామపక్షాల పొత్తుపై గత కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్నాయి.

ఇటీవల హైదరాబాద్‌లో భేటీ అయిన వామపక్ష నేతలు.. కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాలని తీర్మానం చేశారు. అనంతం పలు దఫాలుగా కాంగ్రెస్‌తో చర్చలు జరిపారు. దీంతో కాంగ్రెస్‌తో వామపక్షాల పొత్తు ఖాయమని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఎట్టకేలకు పొత్తు ఖరారు అయింది. గతంలో మునుగోడు ఎన్నికల సమయంలో బీఆర్ఎస్‌కు వామపక్ష పార్టీలు మద్దతిచ్చాయి. దీంతో ఈ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్‌తో లెఫ్ట్ పార్టీల పొత్తు ఉంటుందనే వార్తలొచ్చాయి. వామపక్షాలకు బీఆర్ఎస్ రెండు, మూడు సీట్లు ఇస్తుందని టాక్ వినిపించింది. కానీ ఈ పొత్తు ముందుకు కదరలేదు. బీఆర్ఎస్‌తో పొత్తు కుదరకపోవడంతో కాంగ్రెస్‌తో టచ్‌లోకి వామపక్షాలు వెళ్లాయి. ఏపీతో పోలిస్తే తెలంగాణలో వామపక్షాలు కాస్త బలంగా ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో గణనీయమైన ఓట్లు కలిగి ఉన్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్.. వామపక్షాలను మరోసారి కలుపుకుంది.

గత ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి, వామపక్ష పార్టీలు కలిసి బరిలోకి దిగాయి. కానీ గత ఎన్నికల్లో మహాకూటమిలోని పార్టీల మధ్య ఓటు ట్రాన్స్‌ఫర్ జరగలేదు. దీని వల్ల కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని మూటకట్టుకోవాల్సి వచ్చింది. 2014 ఎన్నికల్లో కంటే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సీట్లు తగ్గాయి. అయితే వామపక్షాల ఓట్లు సులువుగా ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశముంటుంది. దీంతో కామ్రేడ్స్‌ను కలుపుకోవడంలో కాంగ్రెస్ వ్యూహత్మకంగా అడుగులు వేసింది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండలో వామపక్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆ రెండు జిల్లాల్లో పొత్తు వల్ల కాంగ్రెస్, వామపక్షాలకు కలిసొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్  కలుపుకోవాలని ప్రయత్నం చేసినా.. షర్మిల డిమాండ్ల వల్ల అది కురదలేదు.