bjp-brs-cong
తెలంగాణ రాజకీయం

కొనసాగుతున్న జంపింగ్ ల పర్వం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో జంపింగ్‌ల పర్వం కొనసాగుతోంది. ఒక పార్టీలో సీటు దక్కని నేతలతో పాటు అసమ్మతి నేతలు గోడ దూకేస్తున్నారు. తమకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీటు ఇవ్వడంతో పాటు ప్రాధాన్యత ఇచ్చే పార్టీలలో చేరుతున్నారు. ఇతర పార్టీల నుంచి ఏమైనా హామీలు లభిస్తే అసంతృప్తి నేతలు వెంటనే కండువా మార్చేస్తున్నారు. ఎన్నికల వేళ జంపింగ్‌లు సాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఈ సారి కాంగ్రెస్‌లోకి చేరికలు ఎక్కువగా జరుగుతున్నాయి.బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడంతో ఆ పార్టీలో సీటు దక్కని నేతలు కాంగ్రెస్, బీజేపీ వైపు చూస్తున్నారు. నేతలను చేర్చుకునేందుకు ఆ రెండు పార్టీలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్‌లో సీటు దక్కని పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు సీటు ఆశించి భంగపడ్డ ఆశావాహులు కూడా పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలలో చేరారు. అందులో భాగంగా ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కూడా బీఆర్ఎస్‌కు రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది.

ఉప్పల్ టికెట్‌ను బండారి లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్ కేటాయించడంతో సుభాష్ రెడ్డి అసంతృప్తికి గురయ్యారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడం, పార్టీలో ఉంటే ప్రాధాన్యత దక్కదనే ఆలోచనతో బీఆర్ఎస్‌ను వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. బీజేపీ నుంచి ఆయనకు ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కాషాయ గూటికి చేరేందుకు సిద్దమైనట్లు వార్తలొస్తున్నాయి. బేతి సుభాష్ రెడ్డితో కమలం నేతలు చర్చలు జరిపారు. ఆయనను పార్టీలోకి తీసుకుంటే లాభం జరుగుతుందా.? లేదా? అనే విషయంపై బీజేపీ ఓ సర్వే కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆ సర్వేలో సానుకూల ఫలితాలు రావడంతో బేతి సుభాష్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవాలని బీజేపీ నిర్ణయించింది. రెండు, మూడు రోజుల్లో ఆయన కమలం గూటికి చేరతారని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఉప్పల్ బీజేపీ అభ్యర్ధిగా ఆయనను బరిలోకి దింపుతారని తెలుస్తోంది. 2018 ఎన్నికల్లో ఉప్పల్ నుంచి బీజేపీ తరపున ఎన్వీఎస్ ప్రభాకర్ పోటీ చేశారు. ఈ సారి కూడా ఆయన పోటీలోకి దిగాలని చూస్తున్నారు.

2014 ఎన్నికల్లో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్వీఎస్ ప్రభాకర్ గెలిచారు. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఆయనను కాదని బేతి సుభాష్ రెడ్డికి టికెట్ కేటాయిస్తారా? అనేది కూడా అనుమానంగా మారింది.బేతి సుభాష్ రెడ్డి రాకను పలువురు బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆయన రాకను వ్యతిరేకిస్తూ ఒక లేఖను కూడా విడుదల చేశారు. బేతి సుభాష్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంటే తాము వెళ్లిపోతామని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో బేతి సుభాష్ రెడ్డి చేరితే బీజేపీలో పరిణామాలు మారిపోయే అవకాశముంది. అటు ఇప్పటికే మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్‌ను వీడారు. ఇప్పుడు బేతి సుభాష్ రెడ్డి కూడా వీడితే బీఆర్ఎస్‌కు గట్టి షాక్ అని చెప్పవచ్చు. బేతి సుభాష్ రెడ్డిపై వ్యతిరేకత ఉండటంతో ఆయనకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్‌లో సీటు దక్కని నేతలను బీజేపీ లాక్కునే ప్రయత్నాలు చేస్తోంది.