- ప్రాంతాలవారీగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు
- సాగునీటి కల్పన, వ్యవసాయరంగ అభివృద్ధితో
- రెండో హరిత విప్లవానికి తెలంగాణ నాంది
- పాడి, మాంసం, మత్స్యరంగాల్లోనూ జోరు
- పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు
- ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లపై మంత్రుల సమీక్ష
సాగునీటి కల్పన, వ్యవసాయరంగ అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రం దేశంలో రెండో హరిత విప్లవానికి నాంది పలికిందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. లక్షల టన్నుల కొద్దీ పంటలను ఉత్పత్తి చేస్తూనే.. వాటికి అదనపు విలువను జోడించేందుకు సీఎం కేసీఆర్.. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు నిర్ణయించారని చెప్పారు. వివిధ ప్రాంతాల్లో పండే వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా ఈ జోన్లను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో పండుతున్న పంటల తాలూకు ఫుడ్ మ్యాప్‌ను పరిశ్రమలశాఖ తయారు చేసిందని చెప్పారు. రాష్ట్రంలో ప్రత్యేక ఫుడ్‌ప్రాసెసింగ్ జోన్లపై బుధవారం టీఎస్‌ఐఐసీ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశం జరిగింది. మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయడంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం ఊహించిన దానికంటే ఎక్కువగా పెరిగిందని, వ్యవసాయ దిగుబడులు భారీగా వస్తున్నాయని తెలిపారు.
వ్యవసాయంతోపాటు, మాంసం, పాల ఉత్పత్తి, మత్స్య రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి జరుగుతున్నదని వివరించారు. రాష్ట్రంలో గ్రీన్, బ్లూ, వైట్, పింక్ విప్లవాలు సమాంతరంగా సాగుతున్నాయన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేయడం ద్వారా వాటికి డిమాండ్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతోపాటు ప్రత్యేకంగా ఫుడ్ ప్రాసెసింగ్‌జోన్లను ఏర్పాటుచేయడం ద్వారా పెద్దఎత్తున డిమాండ్ సృష్టిం చే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రధాన పంట వరితోపాటు ఆయిల్‌పామ్‌కు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటులో నూతన పంటల భవిష్యత్తు అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు. ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా పండేందుకు అవకాశమున్న ఉత్పత్తుల.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు 350 దరఖాస్తులు
ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు. ఒక్కో జోన్‌ను కనిష్ఠంగా 225 ఎకరాలకు తగ్గకుండా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. విద్యుత్తు, రోడ్లు, తాగునీటి సరఫరా, వ్యర్థాల నిర్వహణ, కామన్ అఫ్లుయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంటు తదితర అన్నిరకాల మౌలిక వసతులు ఉంటాయని చెప్పారు. రాష్ట్రంలో పండుతున్న ప్రధాన పంటలైన వరి, మిరప, పసుపు, చిరుధాన్యాలు, వంట నూనెలు, పండ్లు, కూరగాయలు తదితరవాటి ప్రాసెసింగ్, స్టోరేజీ, మార్కెటింగ్ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు సంబంధించి 350 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. దరఖాస్తుల గడువును పొడిగించి మరింతమందికి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. జోన్లకు అవసరమైన భూసేకరణ వంటి అంశాల్లో స్థానిక ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ చూపించాలని పిలుపునిచ్చారు.
నిరుద్యోగ సమస్యకు పరిష్కారం: మంత్రి నిరంజన్‌రెడ్డి
రాష్ట్రంలో వ్యవసాయరంగానికి అద్భుతమైన అండ లభిస్తున్నదని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ద్వారా గ్రామాల్లో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఈ జోన్లతో వ్యవసాయ ఉత్పత్తులకు అవసరమైన మార్కెటింగ్ సౌకర్యాలు పెరుగుతాయని.. ఉత్పత్తులకు దీర్ఘకాలంలో లాభసాటి ధరలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ ఉత్పత్తులకు శాశ్వత డిమాండ్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రంగంలో భారీగా పెట్టుబడులు వస్తాయన్నారు.
ధాన్యం మిల్లింగ్ సామర్థ్యం పెంపు: మంత్రి గంగుల
సీఎం కేసీఆర్ సంకల్పంతో ధాన్యం ఉత్పత్తి భారీగా పెరిగిందని, అందుకు అనుగుణంగా మిల్లింగ్ సామర్థ్యం పెంచడానికి ఈ జోన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. మిల్లింగ్ ఇండస్ట్రీకి ప్రోత్సాహం ఇచ్చేలా నూత న పాలసీని రూపొందించాలని అధికారులకు సూచించారు. పార్‌బాయిల్డ్, స్టీమ్ మిల్లులకు నీటి అవసరం ఎక్కువగా ఉంటుందని, అందుకు అనుగుణంగా ఈ జోన్లలో ఏర్పాట్లు చేయాలని తెలిపారు. మిల్లింగ్ పెరిగితే చైనావంటి దేశాలకు తెలంగాణ బియ్యం ఎగుమతి చేసేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు.
పారిశ్రామిక వికేంద్రీకరణే లక్ష్యం: కేటీఆర్
రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల ఏర్పాటు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు. ఈ మేరకు పారిశ్రామిక వికేంద్రీకరణ జరుగాల్సి ఉన్నదన్నారు. బుధవారం ఆయన ఐటీ, పరిశ్రమల శాఖలపై సమీక్ష నిర్వహించి.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించారు. ఆయా రంగాలవారీగా పరిశ్రమలు, ఐటీ శాఖ విభాగాల అధిపతుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రాధాన్య రంగాలైన ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ లాంటి రంగాల్లో అనేక కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయని అధికారులు మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. కేటీఆర్ మాట్లాడుతూ.. పారిశ్రామిక వికేంద్రీకరణలో భాగంగా ప్రతిపాదిత పెట్టుబడులను వివిధ జిల్లాలకు తరలించేలా కంపెనీలను కోరాలని సూచించారు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ప్రాంతా ల్లో అందుబాటులో ఉన్న భూముల వివరాలను ప్రభుత్వానికి అందజేశారని, ఈ పెట్టుబడులను ఆయా ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నించాలని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లతో వ్యవసాయ ఉత్పత్తులకు పెద్దఎత్తున డిమాండ్ సృష్టించే అవకాశం ఉంటుంది. స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటులో నూతన పంటల భవిష్యత్తు అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాం.
- మంత్రి కేటీఆర్