jagan
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

దొరబాబుకు తొలి వైసీపీ టిక్కెట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించారు. పెద్దాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా దొరబాబు పేరును ఆయన పేర్కొన్నారు. సామర్లకోటలో పేదలకు ఇళ్లను పంపిణీ చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దొరబాబు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా బాగా కష్టపడుతున్నారని జగన్ అన్నారు. ఆయన నియోజకవర్గం అభివృద్ధి కోసం అడిగిన నిధులన్నింటినీ తాను మంజూరు చేస్తానని తెలిపారు.మీరంతా ఆశీర్వదిస్తే దొరబాబు ఎమ్మెల్యే అవుతారని ఆయన అన్నారు. కానీ దత్తపుత్రుడి మాదిరిగా నియోజకవర్గంలో పట్టించుకోకుండా వదిలి పెట్టరని జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు. దొరబాబును ఆశీర్వదించి వైసీపీకి మద్దతు ఇవ్వాలని జగన్ కోరారు. గత ప్రభుత్వంలో ఉన్న బడ్జెట్‌తోనే ఇప్పుడు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని అన్నారు. ప్రతి గ్రామంలో పర్యటిస్తూ దొరబాబు సమస్యలను పరిష్కరిస్తున్నారని అన్నారు.పెళ్లిళ్లు వివాహ వ్యవస్థపై దత్తపుత్రుడికి నమ్మకం లేదన్నారు.

దోపిడీ దొంగల ముఠా అంతా ఏకమై వస్తుందన్నారు. దొరబాబును గెలిపిస్తే ఇక్కడే ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందుంటాడని తాను మాట ఇస్తున్నానని జగన్ అన్నారు. విపక్షాల ఫేస్ చూస్తే స్కాంలు, జగన్ మొహం చూస్తే స్కీంలు గుర్తొస్తాయని అన్నారు. ప్రతి ఇంట్లో మంచి జరిగిందని భావిస్తేనే తనకు, తన ప్రభుత్వానికి అండగా నిలవలాంటూ జగన్ పిలుపు నిచ్చారు. దొరబాబు నియోజకవర్గం కోసం అడిగిన మరికొన్ని నిధులను కూడా మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.