tdp-jana
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

టీడీపీ, జనసేన సమన్వయం అడుగులు

వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేయాలని నిర్ణయించుకున్న తెలుగు దేశం, జనసేన పార్టీలు క్షేత్ర స్థాయిలో కార్యకర్తల సమన్వయంపై దృష్టి పెట్టాయి..ఓట్ల బదలాయింపు సాఫీగా జరిగేలా చూడటంతో పాటు, ఉమ్మడి పోరాటాల కార్యాచరణపై సమన్వయ కమిటీ సమావేశాల్లో ప్రధానంగా చర్చించారు. మూడు రోజుల పాటు ఉమ్మడి జిల్లాల వారీగా ఈ సమావేశాలు జరిగాయి. పొత్తు అంశాన్ని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లాలన్న ఉద్దేశం రెండు పార్టీల నేతల్లో కనిపించింది.ఏపీలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాజమండ్రిలో అక్టోబర్ 23న టీడీపీ నేత నారా లోకేశ్.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆధ్వర్యంలో జరిగిన రెండు పార్టీల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సమావేశానికి కొనసాగింపుగా ఈ సదస్సులు ఏర్పాటు చేశారు. రెండు పార్టీలు జిల్లాల వారీ సమన్వయకర్తలను నియమించాయి. ఈక్రమంలోనే పశ్చిమగోదావరి, కృష్ణా, కడప, చిత్తూరు జిల్లాల్లో.. విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో సమన్వయ కమిటీ సమావేశాలు జరగాయి.

టీడీపీ, జనసేన పార్టీల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు సమన్వయ కమిటీల సమావేశాలు జరిగాయి. మొదటి రోజు ఐదు ఉమ్మడి జిల్లాల్లో రెండు పార్టీల నేతల మధ్య సమావేశాలు జరగ్గా రెండో రోజు నాలుగు జిల్లాల్లో మూడో రోజు మరో నాలుగు జిల్లాలో ఈ సమావేశాలు జరిగాయి. ప్రధానంగా రెండు పార్టీల్లో ముఖ్య నేతలు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఓట్ల బదలాయింపు రెండు పార్టీల మధ్య సాఫిగా జరిగేలా చూడాలన్న చర్చ జరిగింది. టీడీపీ ఓట్లు జనసేనకు అదే విధంగా జనసేన ఓట్లు టీడీపీకి బదలాయింపు ఉండేలా చూడాలని నేతలు అభిప్రాయపడ్డారు. ఇందుకు క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు, నాయకలు మధ్య సమన్వయం ఉండాలన్నారు.అదే విధంగా నియోజకవర్గాల కేటాయింపులో భాగంగా అవకాశాలు కోల్పోతున్న నేతలకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధన్యత ఉంటుందన్న అంశంపై కూడా సమావేశాల్లో చర్చ జరిగింది. రెండు పార్టీల మధ్య టికెట్ల కేటాయింపులో విభేదాలు రాకుండా చూడాలన్నారు.

అయితే ఇప్పుడప్పుడే సీట్లు కేటాయింపుపై ఎటువంటి నిర్ణయాలు ఉండవని రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాత్రమే టికెట్లు కేటాయింపుపై చర్చిస్తారన్న అభిప్రాయాలను నేతలు వ్యక్తం చేశారు.మరోవైపు ఉమ్మడి పోరాటాల కార్యాచరణపై కూడా ఈ సమావేశాల్లో జిల్లాల వారీగా చర్చ జరిగింది. ప్రధానంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో సాగునీటి కొరత అధికంగా ఉందని ప్రభుత్వంపై కలిసి పోరాటం చేయాలన్న అభిప్రాయాన్ని ఇరు పార్టీల నేతలు వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై పోరాడే క్రమంలో రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. ద్వితీయ శ్రేణి నేతల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పడు అవి పెద్దవి కాకుండా చూసే బాద్యతను సీనియర్లు తీసుకోవాలన్నారు.

మొత్తం మూడు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో ప్రధానంగా రెండు పార్టీల నేతలు కలిసి పనిచేయాలని అదే విధంగా ఓట్ల బదలాయింపు సాఫీగా ఉండేలా చూడాలన్న చర్చ జరిగింది. వివిధ నియోజకవర్గాల నుండి చర్చల్లో ఇరు పార్టీల నేతలు పాల్గొనటం వారి అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో మరింతగా నేతలు కలిసి పనిచేయవచ్చని ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారు.