తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది. ముచ్చటగా మూడోసారి గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. 9 ఏళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్…ఈ సారి ఎలాగైనా కేసీఆర్‌కు చెక్ పెట్టడమే లక్ష్యంగా పని చేస్తోంది. అటు బీజేపీ సైతం అధికారంలోకి రావాలన్న కృతనిశ్చయంతో పని చేస్తోంది. గెలుపు కోసం ప్రధాన పార్టీలు పక్కా వ్యూహాలతో పని ముందుకెళ్తున్నాయి. గెలుపోటముల్లో కీలక పాత్ర వహించే వలస ఓటర్ల సమాచార సేకరణపై పార్టీలు దృష్టి సారించాయి. తెలంగాణ వ్యాప్తంగా లక్షల మంది వలస ఓటర్లు వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను రప్పించడానికి వారి సామాజికవర్గానికి చెందిన సంఘాలతో ప్రధాన పార్టీల నాయకులు మంతనాలు చేస్తున్నారు. నోటిఫికేషన్ విడుదలైతే ప్రచారంలో తీరికలేకుండా ఉంటామని భావిస్తున్న నేతలు…ఇప్పటి నుంచే వారితో మంతనాలు సాగిస్తున్నారు. వలస వెళ్లిన వారు అనుకున్న సమయానికి పోలింగ్‌కు వచ్చే విధంగా ప్రణాళిక రచిస్తున్నారు.
గతేడాది జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో వలస ఓటర్లను ఆకర్షించిన ఓ ప్రధాన పార్టీ…తమ గెలుపునకు అదే వ్యూహాలను అమలు చేస్తోంది. అవసరం అయిన చోట్ల గంపగుత్తగా…లేదంటే ఓటర్ల వారీగా డబ్బు ముట్టజెప్పేందుకు అభ్యర్థులు వెనుకాడటం లేదు. ప్రస్తుతం జాబితా తయారీలో నిమగ్నమైన బృందాలు…త్వరలోనే పూర్తి నివేదికను అభ్యర్థులకు అందజేయనున్నాయి. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వలస ఓటర్ల చిరునామాల సేకరణకు ఓ ప్రధాన పార్టీ ప్రత్యేక బృందాలను నియమించింది. ప్రతి గ్రామంలో ఇద్దరి నుంచి ముగ్గురు సభ్యులు బృందంగా ఏర్పడి…గ్రామాల వారీగా ప్రతి వలస ఓటరు చిరునామా, ఫోన్ నంబరుతో ఓ డేటాబేస్‌ను తయారు చేస్తున్నారు. ప్రత్యేక బృందానికి రెండు నెలల పాటు నెలవారీ వేతనం ఇస్తున్నారు. నివేదిక ప్రకారం సామాజికవర్గాల వారీగా ఎంత మంది ఓటర్లున్నారో తెలుసుకొని వారందరూ తమకు మద్దతిచ్చేలా ఆయా వర్గాల నాయకులతో చర్చలు జరిపేందుకు రెడీ అవుతున్నారు.
అన్ని పార్టీల అభ్యర్థులు తేలిన తర్వాతే తాము ఏ పార్టీకి మద్దతిస్తామన్న అంశంపై చెబుతామని కుల సంఘాల నేతలు చెబుతున్నారు. వలస ఓటర్లు ఎక్కువగా ఉన్న ఓ మండలంలోని ఆయా గ్రామాల్లోని ఓటర్ల చిరునామాల సేకరణ ఓ బృందాన్ని నియమించుకున్నారు. వారికి భారీ ప్యాకేజ్‌ని సైతం ఇచ్చినట్లు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ ఓటర్లను స్వస్థలాలకు ఎన్నికల సమయంలో తీసుకురావడానికి సైతం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన పార్టీ నుంచి టిక్కెట్ దక్కించున్న ఓ నాయకుడు సైతం వలస ఓటర్ల జాబితాను తయారు చేసే పనిని ఎన్నికల బృందానికి అప్పగించారు.అత్యధికంగా మునుగోడులో సుమారు 40 వేలకుపైగా వలస ఓటర్లు ఉంటారని ప్రధాన పార్టీలు లెక్కతేల్చాయి. వీరంతా హైదరాబాద్, భీవండి, ముంబయి, సూరత్, షోలాపూర్ తదితర ప్రాంతాల్లో బతుకుదెరువుకు వెళ్లారు. మునుగోడు తర్వాత దేవరకొండ నియోజకవర్గంలో సుమారు 25 వేల వరకు వలస ఓటర్లు ఉంటారని రాజకీయ నాయకులు అంచనా వేస్తున్నారు.
వీరంతా హైదరాబాద్, మాచర్ల, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో ఉపాధి నిమిత్తం వలసవెళ్లారు. వలస ఓటర్లతో ఇప్పటి నుంచే టచ్‌లో ఉంటూ ఎన్నికలకు రెండు, మూడు రోజుల ముందుగానే స్వస్థలాలకు తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు, గతంలో పార్టీ సానుభూతిపరులుగా ఉన్న వారిని ప్రచారానికి సైతం రావాలని ఆహ్వానిస్తున్నారు. వారికి ఇస్తామన్న మొత్తాన్ని అక్కడికక్కడే ఇచ్చేందుకు పార్టీలు వెనుకాడటం లేదు.