jana-tdp
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

ఉమ్మడి ప్లాన్ లో టీడీపీ, జనసేన

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు అధికారికంగా ఖరారయింది. ఇప్పటికే ఒకసారి సమన్వయ కమిటీ భేటీ రాజమండ్రిలో జరిగింది. ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు. ఆ సమావేశంలో జిల్లా స్థాయిలో రెండు పార్టీల నేతల సమన్వయ సమావేశం జరగాలని నిర్ణయించింది. ఈ మేరకు కొన్ని రోజులుగా జిల్లాల స్థాయిలో రెండు పార్టీల నేతలు సమావేశమై పార్టీలు అనుసరించాల్సిన ఉమ్మడి పోరాటంపై చర్చించారు.  అయితే తాజాగా మరోసారి రెండు పార్టీలు భేటీ అవుతున్నాయి. ఈ నెల 9వ తేదీన జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం జరగనుంది. రెండు పార్టీల నుంచి ఆరుగురు సభ్యులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి మ్యానిఫేస్టోపై చర్చించే అవకాశాలున్నాయని తెలిసింది. దీంతో పాటు ఉమ్మడి పోరాటం పై కూడా రెండు పార్టీల మధ్య జరుగుతున్న చర్చల్లో ప్రధాన అంశంగా మారనుంది. ఏఏ అంశాలపై పోరాటం చేయాలన్న దానిపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని తెలిసింది.

చంద్రబాబు అరెస్టు సాక్షిగా తెలుగుదేశం, జనసేన ఒక్కటయ్యాయి. అధికారికంగా పొత్తు ప్రకటనతో రెండు పార్టీల క్యాడర్ లో జోష్ పెరిగింది. రెండు పార్టీలు ఉమ్మడి కార్యాచరణను సిద్ధం చేసుకొనేందుకు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకొని ఎలా ముందుకెళ్లాలో కూడా నిర్ణయించుకున్నారు. ఈలోగా చంద్రబాబు కూడా బెయిల్ మీద బయటకొచ్చారు.స్కిల్ కేసులో నెక్స్ట్ ఏం జరుగుతుందన్నది పక్కన పెడితే ఇప్పుడైతే  తెలుగుదేశం,జనసేన  ఉమ్మడిగా జగన్ ప్రభుత్వంపై అటాక్ చేసేందుకు సిద్ధమయ్యాయి. చంద్రబాబు జైల్లో ఉండడంతో అన్నీ తానైన లోకేష్ కేపబిలిటీ ఏంటో కూడా రాజకీయ వర్గాలకు అర్ధమయింది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో రాపో కూడా పెరిగింది. ఈ తరుణంలోనే ఇప్పుడు పవన్, లోకేష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. పొత్తు ప్రకటన తర్వాత ఇప్పటి వరకూ రాజ‌కీయ అంశాల‌పై ప‌వ‌న్‌తో చంద్రబాబు నేరుగా సంప్రదించలేకపోయారు.

చంద్రబాబు విడుదల సమయంలో పవన్.. నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ వివాహానికి ఇటలీ వెళ్లారు. అక్కడ నుండి వచ్చిన తర్వాత తాజాగా ఆయన నివాసానికి వెళ్లిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆ పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ నాదెండ్ల మ‌నోహ‌ర్ ఆయ‌న‌ను ప‌రామ‌ర్శించారు. అలాగే నారా లోకేష్‌తో గంట‌ల‌కు పైగా ప‌వ‌న్‌, మ‌నోహ‌ర్‌లు సుదీర్ఘ చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ క్రమంలోనే తదుపరి కార్యాచరణను అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చారు.ముందుగా ఇరు పార్టీల్లో ఉన్న అసంతృప్తుల‌ను త‌గ్గించి, పార్టీల‌ను క‌లిసి పోరాడేలా, ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేలా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అలాగే వైసీపీ ప్ర‌భుత్వ పాల‌న అంశాల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టి ఉమ్మ‌డి కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించినట్లు తెలుస్తుంది. రానున్న మూడు వారాలలో ఇరు పార్టీలలో సమస్యలను పరిష్కరించుకొని అసలు సిసలైన యుద్ధం మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు ఇరు పార్టీల వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఉమ్మ‌డి మేనిఫెస్టో రూప‌క‌ల్ప‌న‌, బ‌హిరంగ స‌భ‌లు, ప్ర‌జ‌ల‌తో నేతల ముఖాముఖీ వంటి అంశాల‌పై ఇరు పార్టీలు సంయుక్తంగా ముందుకు సాగేలా కార్యాచ‌ర‌ణ‌కు రూప‌క‌ల్ప‌న చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం.

అలాగే నవంబర్ నెలాఖరున లేదా డిసెంబర్ మొదటి వారంలో ప‌వ‌న్‌, నారా లోకేష్‌లు సంయుక్తంగా స‌భ‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. ఈ సభ అనంతరం సాధ్యమైనంత త్వరగా ఉమ్మడి మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారని చెబుతున్నారు.పవన్, లోకేష్ ల ఉమ్మడి సభ ఇప్పుడు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ అవుతున్నది. పసుపు దళానికి జనసైనికులు తోడవడం.. ప్రతిష్టాత్మక నిర్మాణం ఉన్న టీడీపీకి ఛరిష్మా గల పవన్ కళ్యాణ్ జత కలవడం అంటే రెండు పార్టీలలో జోష్ పెంచే అంశమే  అలాంటిది రెండు పార్టీలు కలిసి బహిరంగ సభ అంటే అది ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే ఆ సభ ప్రత్యర్థులకు ఏ స్థాయి హెచ్చరికలను జారీ చేయనుందో  మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ సభ ద్వారానే ఎన్నికల శంఖారావం  మోగించాలని తెలుగుదేశం, జనసేన వర్గాలు భావిస్తున్నాయి. ఈ సభ ద్వారానే ఇరు పార్టీల నేతలకు, క్యాడర్ కు అధికారం మనదే అనే సంకేతాలు  బలంగా ఇవ్వాలని భావిస్తున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన కలయికను జీర్ణించుకోలేకపోతున్న వైసీపీ శ్రేణులు ఈ సభ తర్వాత ఎలా స్పందించనున్నాయన్నది ఆసక్తిగా మారింది. ఈ సభ తర్వాత ఏపీ రాజకీయాలలో బిగ్ టర్న్ ఖాయమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు