delhi
జాతీయం ముఖ్యాంశాలు

ఢిల్లీలో సరి, బేసి విధానం…

ఢిల్లీలో కాలుష్యాన్ని  కట్టడి చేసేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 13వ తేదీ నుంచి సరిబేసి వాహనాల విధానాన్నిఅమలు చేయనున్నట్టు వెల్లడించింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ మీటింగ్ తరవాత పర్యావరణ మంత్రి గోపాల్‌ రాయ్‌ ఈ విషయం వెల్లడించారు. నవంబర్ 13 నుంచి వారం రోజుల పాటు ఈ విధానాన్ని అమలు చేయనుంది ప్రభుత్వం. కాలుష్య నియంత్రణా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు గోపాల్ రాయ్‌ తెలిపారు. “ఢిల్లీలో కాలుష్యం రోజురోజుకీ పెరుగుతోంది. దీన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 13 నుంచి వారం రోజుల పాటు సరిబేసి వాహనాల విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నాం. నవంబర్ 20 వరకూ ఈ విధానం కొనసాగుతుంది”ఢిల్లీలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

కాలుష్య స్థాయి కొంత మేర తగ్గే అవకాశముందని వెల్లడించింది. అధికారులు అంచనా వేసినట్టుగా వేగమైన గాలులు వీస్తే కాలుష్యం తగ్గిపోతుందని గోపాల్ రాయ్‌ తెలిపారు.”వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నవంబర్ 7 నుంచి ఢిల్లీ వ్యాప్తంగా గాలులు గంటకు 12 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. ఇదే జరిగితే కాలుష్యం కొంత వరకూ తగ్గిపోయే అవకాశముంది. నవంబర్ 8న గాలుల వేగం గంటకు 8-10 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తరవాత కాలుష్యం మరింత కట్టడి అయ్యే అవకాశాలున్నాయి”ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. చర్యలు తీసుకుంటోంది. కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ఈ ప్లాన్ అమలు చేస్తోంది. మొత్తం నాలుగు దశల్లో ఈ చర్యలు అమలు చేయనుంది.

ఇందులో స్టేజ్ 4 ని సివియర్ కేటగిరీగా పరిగణిస్తారు. AQI 450 కన్నా ఎక్కువగా నమోదైతే వెంటనే ఈ చర్యలు తీసుకుంటారు. ఇందులో భాగంగానే ఢిల్లీలోకి ట్రక్‌లు రావడంపై ఆంక్షలు విధించారు. నిత్యావసర సరుకులు తీసుకొచ్చే ట్రక్‌లు తప్ప మిగతావి నగరంలోకి ఎంటర్ కావద్దని అధికారులు ఆదేశించారు.