congress
తెలంగాణ రాజకీయం

అదిలాబాద్ కాంగ్రెస్ కు షాక్…

ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు సాజిత్ ఖాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, ఆదిలాబాద్ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు అంబకంటి అశోక్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఆదిలాబాద్ మండల అధ్యక్షులు సంజయ్ దూబే మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచులు మాజీ కౌన్సిలర్లు మైనార్టీ సెల్ సేవాదళ్ పలువురు రాజీనామా చేశారు. ఇటివలే అమెరికా నుండి కొత్తగా వచ్చిన ఎన్ఆర్ఐ, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న కంది శ్రీనివాస్ రెడ్డికి ఆదిలాబాద్ కాంగ్రెస్ టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడారు. ముగ్గురు సీనియర్లతో సంజీవ రెడ్డి ఇండిపెండెంట్ గా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని తెలిపారు. తనకు డబ్బులు ఉన్నాయని అహంకారంతో కాంగ్రెస్ అభ్యర్థి ఓటుకు 10,000 ఇస్తామని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హైకమాండ్ సైతం తమకు అన్యాయం చేసిందన్నారు.

పార్టీలో కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత డబ్బులకే ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని కనీసం ఐదేళ్లు కూడా పార్టీలో పనిచేయని వారికి టికెట్లు ఇచ్చి కార్యకర్తల గొంతు కోశారన్నారు. రేవంత్ రెడ్డి తమను ఉంటే ఉండండి పోతే పోనీ అని అన్న అహంకారంతో వ్యవహరిస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తాము మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నామన్నారు. డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పని చేశామని ఈ రోజు రాజీనామా చేస్తున్న అని చెప్పడానికి నోరు కూడా రావడం లేదని భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితం మొత్తం పార్టీకి అంకితం చేస్తే పార్టీ తమని కాదని ఇతరులకు టికెట్ ఇచ్చిందన్నారు. 20 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకోవాల్సి వస్తుందని కన్నీరు పెట్టుకున్నారు. చెన్నూర్ టికెట్ ను ఆశించి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి బోడ జనార్ధన్ సైతం పార్టీకి రాజీనామా చేశారు.

ఇటీవలే బిజెపి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ వివేక్ కు టికెట్టు ఇస్తున్నట్లు ఖరారు చేయడంపై ఆయన పార్టీని వీడారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పంపించారు. బోడ జనార్దన్ ఈ నెల 7న మందమర్రిలో జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.బోథ్ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీలో ఇరుకులు ఎదురవుతున్నాయి. పార్టీ కోసం కష్టపడిన వారిని కాకుండా మంచిర్యాల జిల్లాలో ఉండే వెన్నెల అశోక్ కు టికెట్ ఇవ్వడంపై స్థానిక కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ఎవరు కూడా ఆ మద్దతు ఇవ్వమని ప్రకటించారు. వారంతా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని సంప్రదించి బోథ్ టికెట్ స్థానికులకు ఇవ్వాలని చెప్పడంతో ఆయనకు బీఫామ్ కూడా ఇవ్వలేదని, దీంతో అక్కడ అభ్యర్థి మార్చే అవకాశాలు ఉన్నాయన్నట్లుగా వినిపిస్తోంది.

ఈ విషయంపై ఆదివాసి సంఘాలు తుడుందెబ్బ నాయకులు మండిపడ్డారు. బోథ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వెన్నెల అశోక్ కు టికెట్టు ఇచ్చి మళ్లీ ఆ అభ్యర్థిని మార్చి ఇతరులకు టికెట్ ఇస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ఒకవేళ అలాంటి గతి జరిగితే కాంగ్రెస్ కు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు.