supreme
జాతీయం రాజకీయం

కృష్ణా జలాలపై సుప్రీంలో విచారణ

కృష్ణా జలాల పంపిణీ విషయంలో ఏపీ వేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు 29కి వాయిదా వేసింది. కృష్ణా జిల్లాల పంపిణీలో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ వేసిన పిటిషన్‌పై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అసలు ఆ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని తెలంగాణ తరుఫున వాదించిన సి.ఎస్‌.వైద్యనాథన్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎప్పటి నుంచో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదంపై స్పందించిన కేంద్రం… కృష్ణా ట్రైబ్యునల్‌కు కొత్త విధివిధానాలు ప్రతిపాదించింది. దీని వల్ల ఏపీకి అన్యాయం జరుగుతుందని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై తమకు ఉన్న అభ్యంతరాలతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రికి లేఖ కూడా రాశారు. అయినా కేంద్రం అవేమీ పట్టించుకోకుండా గెజిట్‌ కూడా విడుదల చేసింది. దీంతో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ దీపాంకర్‌దత్తా బెంచ్‌.

ఈ పిటిషన్‌ విచారణకు తీసుకోవడంపై తెలంగాణ ప్రభుత్వ తరఫున వాదించిన సీనియర్‌ అడ్వకేట్‌ సి.ఎస్‌.వైద్యనాథన్‌ తీవ్ర అభ్యంతరం తెలిపారు. కేంద్రం ప్రపోజ్ చేసిన అంశాలను సవాల్‌ చేయడానికి వీల్లేదన్నారు. అందుకే పిటిషన్‌కు విచారణార్హత లేదని వాదించారు. ఆర్టికల్‌ 262 ప్రకారం రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రం నియంచించిన ట్రైబ్యునల్‌ లాంటి కేంద్ర సంస్థలకు ఉందని గుర్తు చేశారు. దీనిపై బెంచ్‌లో ఉన్న న్యాయమూర్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ వాటిలో సమస్యలు లేకుండా ఇరు వర్గాలను ఒప్పించి చేయాలన్నారు. ఇలాంటి వాటిలో వివాదం లేదని చెప్పడం మిథ్య అవుతందన్నారు. కృష్ణా జలాలపై తీసుకొచ్చిన ప్రతిపాదనలపై సుప్రీంకోర్టులో కేసు వేస్తున్నట్టు ట్రైబ్యునల్‌కు సమాచారం ఇచ్చినట్టు ఏపీ ప్రభుత్వ తరపున వాదిస్తున్న అడ్వకేట్‌ జైదీప్‌ గుప్తా తెలియజేశారు. అప్పుడు కూడా జోక్యం చేసుకున్న బెంచ్‌ న్యాయపరమైన సమస్యల్లోకి ట్రైబ్యునల్‌ వెళ్లబోదని తెలిపారు.

విచారణ సందర్భంగా ఈ అంశంపై కేంద్రం తరుఫున కూడా వాదనలు వినాల్సి ఉంటుందని బెంచ్ పేర్కొంది. అయితే కేంద్రం తరపున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అందుబాటులో లేనందున కేసును వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. తమకు మొదటి నుంచి అన్యాయం జరుగుతుందని అందుకే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని తెలంగాణ తరుఫున అడ్వకేట్ వాదించారు. లెక్కల ప్రకారం 70 శాతం నీళ్లు తాము వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు. అలా అయితే తమకు అన్యాయం జరుగుతుందన్నారు ఏపీ తరుఫు అడ్వకేట్. తమ ప్రాంతాన్ని ఎడారిగా మార్చేందుకు తెలంగాణ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇరు వాదనలు విన్న బెంచ్‌ అఫిడవిట్స్ సమర్పించాలని సూచిస్తూ కేసును నవంబర్‌ 29కి వాయిదా వేశారు.