దిశ యాప్ డౌన్‌లోడ్ చేయించే విషయంలో ఏపీ పోలీసుల వైఖరి చర్చనీయాంశం అవుతోంది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్లపై బారికేడ్లు పెట్టి మరి దిశ యాప్‌ను బలవంతంగా ఫోన్లలో ఎక్కించడం రివాజుగా మారింది. విశాఖలో ఈ తరహాలోనే ఫోన్‌లో దిశ యాప్ ఎక్కించే విషయంలో జరిగిన గొడవలో సైనికుడిపై నలుగురు పోలీసులు నడిరోడ్డుపై దాడి చేశారు.అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలేనికి చెందిన సయ్యద్ అలీముల్లా జమ్మూకశ్మీర్ బారాముల్లాలో 52వ రాష్ట్రీయ రైైఫిల్ క్యాంపులో సైనికుడిగా పనిచేస్తున్నారు. సెలవుపై ఈ నెల 2న ఇంటికి వచ్చారు. మంగళవారం పరవాడ సంతబయలు వద్ద బస్సుకోసం నిరీక్షిస్తున్నారు.బస్టాండులో ఉన్న వారి ఫోన్లలో కానిస్టేబుళ్లు ఎం.ముత్యాలనాయుడు, శోభారాణి… దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేయిస్తున్నారు. సోల్జర్ సయ్యద్ అలీముల్లా ఫోన్‌లో కూడా యాప్ డౌన్‌లోడ్ చేయించారు. అతని ఫోన్‌కు వచ్చిన ఓటీపీని ఓ కానిస్టేబుల్ కాగితంలో రాసుకున్నారు.
మొబైల్ ఓటీపీతో సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉంది. యూనిఫాం మీద పేరుతో కూడిన బ్యాడ్జిలు లేవు. మీ తీరుపై అనుమానం కలుగుతోంది. గుర్తింపు కార్డుల్ని చూపించాలని అలీముల్లా పోలీసుల్ని కోరారు. “తాము వేసుకున్న పోలీస్ డ్రెస్ కనిపించడం లేదా… స్టేషన్‌కొస్తే గుర్తింపు కార్డుల్ని చూపిస్తాం’ అని కానిస్టేబుళ్లు వ్యంగ్యంగా మాట్లాడారు.ఈ క్రమంలో వాదన జరగడంతో ఓ కానిస్టేబుల్ అలీముల్లా కాలర్ పట్టుకుని లాగడంతో కింద పడిపోయారు. మరో కానిస్టేబుల్ బూటుకాలితో తన్నారు. మహిళా కానిస్టేబుల్ అలీముల్లా చెంప మీద కొట్టారు. గుర్తింపుకార్డు అడిగితే దాడి చేస్తారా అని స్థానికులు నిలదీశారు.పురుషులకు దిశ యాప్ ఎందుకని నిలదీశారు. అక్కడకు వచ్చిన మరో ఇద్దరు పోలీసులతో కలిసి నలుగురూ కలసి అలీముల్లాను స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు బలవంతంగా ఆటో ఎక్కించేందుకు ప్రయత్నించారు.
బాధితుడు తీవ్రంగా ప్రతిఘటించారు.దీంతో పోలీసులు అతని ఐడీకార్డు లాక్కుని వెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణను కలసి బాధితుడు ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతం పై ఎస్పీ విచారణకు ఆదేశించారు. సైనికుడిపై దాడి చేసిన నలుగురు కానిస్టేబుల్స్ పై చర్యలు తీసుకున్నారు. శాఖపరమైన విచారణ తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ ప్రకటించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు.