పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఉన్న భారతీయ రాయబార కార్యాలయం వద్ద డ్రోన్ కలకలం సృష్టించింది. హై కమిషన్ ఆఫీసు కాంపౌండ్‌లో డ్రోన సంచరించినట్లు గుర్తించారు. ఈ ఘటన పట్ల భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. గత కొన్ని రోజుల నుంచి కశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్లు విహరిస్తున్న విషయం తెలిసిందే. కశ్మీర్‌లో ఉన్న ఓ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పైన కూడా డ్రోన్ దాడి జరిగింది. గత ఆదివారం ఎయిర్‌బేస్‌పై జరిగిన డ్రోన్ దాడిలో పాక్‌కు చెందిన ఉగ్ర సంస్థలు జేషే మొహమ్మద్, లష్కరే తోయిబాల హస్తం ఉన్నట్లు శ్రీనగర్‌లోని 15 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పాండే తెలిపారు.
జూన్ 26వ తేదీన భారతీయ ఎంబసీ వద్ద ఉన్న రెసిడెన్షియల్ ప్రాంతంలో డ్రోన్ కనిపించినట్లు తెలుస్తోంది. అదే రోజున జమ్మూలోని ఎయిర్‌బేస్‌పై డ్రోన్ దాడి జరిగింది. ఆ తర్వాత సరిహద్దుల్లో పలుమార్లు డ్రోన్లను భద్రతా దళాలు గుర్తించాయి. పాక్ ఉగ్రవాదులు డ్రోన్లు వాడుతున్న విషయం గురించి ఐక్యరాజ్యసమితిలో ఇండియా తన నిరసన వ్యక్తం చేసింది. ఆయుధాలు, డ్రగ్స్ సరఫరా కోసం పాక్ ఉగ్రవాదులు డ్రోన్లు వాడుతున్నట్లు భారతీయ భద్రతా దళాలు ఆరోపిస్తున్నాయి.