bjp-jana
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

బీజేపీ, జనసేన మధ్య సమన్వయ లోపం..

జనసేన అధినేత పవన్ కల్యాణ్  తెలంగాణ ఎన్నికల   ప్రచార బరిలోకి ఇంకా దిగలేదు. బీసీ ఆత్మగౌరవ సభకు ప్రధాని మోదీతో పాటు హాజరయ్యారు కానీ అక్కడ ఆయన  ప్రసంగం మోదీని మరోసారి ప్రధానిని చేయాలన్న కోణంలో సాగింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రచారం చేయలేదు. అదే సమయంలో ఇంకా పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించ లేదు. ఇంకా చెప్పాలంటే అసలు ఎన్నికల ప్రచారం చేస్తారో లేదో కూడా స్పష్టత లేదు. బీజేపీ, జనసేన కూటమిలో భాగంగా ఎనిమిది సీట్లలో జనసేన పోటీ చేస్తోంది. అభ్యర్థులు నామినేషన్లు వేసి ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నరు. గ్రేటర్ పరిధిలో ఒక్క కూకట్  పల్లి సీటును మాత్రమే కేటాయించారు. అక్కడ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమర్ అనే  నేత పోటీ చేస్తున్నారు. ఆయన ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇతర చోట్ల కూడా అదే పరిస్థితి. భారతీయ జనతా పార్టీ శ్రేణులు పెద్దగా కలసి రావడం లేదు. అదే సమయంలో జనసేన నేతలంతా దాదాపుగా రాజకీయాలకు కొత్త వారే. ఎన్నికల్లో గతంలో పోటీ చేసిన అనుభవం లేని వారే.

ఈ కారణంగా వారు ఎన్నికల ప్రచారాన్ని ఇతర పార్టీలతో సమానంగా చేయడంలో ఇబ్బందులు పడుతున్నారు. జనసేన పార్టీకి మంచి అవకాశాలు ఉంటాయని భావిస్తున్న కూకట్ పల్లి, ఖమ్మం, కోదాడ , తాండూరు వంటి చోట్ల.. రెండు పార్టీల మధ్య సమన్వయ లోపం స్పష్టం గా కనిపిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేస్తూ.. అభ్యర్థులకు ప్రచారం చేయకపోతే పవన్ కల్యాణ్‌పై విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అందుకే  పవన్ ఖచ్చితంగా ప్రచారం చేస్తారని అంటున్నారు. రెండు, మూడు రోజుల పాటు ఆయా నియోజకవర్గాల్లో రోడ్ షో చేసి అభ్యర్థులకు  నైతిక బలం ఇస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రచార గడువు ముగియడానికి మూడు, నాలుగురోజుల ముందు నుంచి పవన్ కల్యాణ్ ప్రచారం ఉండే అవకాశం ఉంది. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.  పొత్తులో  భాగంగా పవన్ కల్యాణ్ తమకూ ప్రచారం చేయాలని బీజేపీ అభ్యర్థులు  కోరుకుంటారు.  

ముఖ్యంగా గ్రేటర్ లో తమకు పవన్ ప్రచారం చేయాలని అభ్యర్థులు అందరూ విజ్ఞప్తి చేస్తారు. మరి పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కీలకం. తెలంగాణలో ఇక ముందు  బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా ప్రచారం చేయబోతున్నారు. ఈ నెల 17న కేంద్ర మంత్రి అమిత్ షా మరోసారి తెలంగాణ ఎన్నికల ప్రచారానికి హాజరుకానున్నారు.  17వ తేదీని సోమాజిగూడ బీజేపీ మీడియా సెంటర్‌లో తెలంగాణ బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోను అమిత్ షా విడుదల చేస్తారు. అనంతరం అదే రోజు నల్లగొండ, వరంగల్‌, గద్వాల్‌, రాజేంద్రనగర నియోజకవర్గాల్లో బీజేపీ ఎన్నికల ప్రచార సభల్లో అమిత్ షా ప్రసంగించనున్నారు. ఈ సభల్లో పవన్ పాల్గొంటారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. అలాగే ప్రధాని మోదీ తర్వాత వరుసగా మూడు రోజుల పాటు తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ సభల్లోనూ పవన్ పాల్గొనడంపై ఇంకా స్పష్టత రాలేదు. బీసీ ఆత్మగౌరవసభలో పాల్గొన్నపవన్..  మాదిగ విశ్వరూపసభలో కనిపించలేదు. మరో వైపు జనసేన నేతలు పోటీ చేస్తున్న ఎనిమిది నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయిలో  బీజేపీ నేతల నుంచి పెద్దగా  సహకారం లేదు.

కానీ బీజేపీ అగ్రనేతలు జనసేన అభ్యర్థుల కోసం కూడా పని చేస్తారని ఆ పార్ట ఆశాభావంతో ఉంది. పవన్ కల్యాణ్  బీజే్పీ అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తే.. బీజేపీ అగ్రనేతలు కూడా జనసేన అభ్యర్థులు ఉన్న చోట బహిరంగసభల్లో పాల్గొనే వకాశం ఉంది. ఈ విషయంలో రెండు పార్టీల నేతల మధ్య ఇప్పటికి సమన్వయ లోపం కనపిిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.