వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద, బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఏం చేసామనేది ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తూ ముందుకెళ్తున్నారు సీఎం జగన్. ఎన్నికలకు మరో 5 నెలలు మాత్రమే గడువు ఉండటంతో మరింత దూకుడుగా ముందుకెళ్లేలా సీఎం జగన్ ప్లాన్ చేసుకుంటున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు అధినేతగా తాను కూడా స్పీడ్ పెంచారు. గతం కంటే మరింత దూకుడుగా ముందుకెళ్తున్నారు సీఎం జగన్. ఈ నేపథ్యంలోనే జిల్లాల పర్యటనల్లో ముఖ్యమంత్రి ప్రసంగాల్లో అభివృద్ధితో పాటు ప్రతిపక్షాలపై విమర్శల దాడి ఎక్కు పెట్టారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన జిల్లాల పర్యటనల్లో మాటల దాడి పెంచారు. పలు సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయడం, అభివృద్ధి కార్యక్రమాల కోసం జిల్లాల పర్యటనలకు ముఖ్యమంత్రి వెళ్తున్నారు. ఇలాంటి పర్యటనల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చెప్పుకుంటూనే ప్రతిపక్షాల తప్పిదాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గతంలో కూడా సీఎం జగన్ తన బహిరంగ సభల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలపై విమర్శలు చేసేవారు.
కానీ టీడీపీ-జనసేన పొత్తు అధికారికంగా ప్రకటించిన తర్వాత తన విమర్శలకు మరింత పదును పెంచారు.జిల్లాల్లో స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వం అక్కడ చేసిన అభివృద్ధి, నగదు బదిలీ ద్వారా ప్రజలకు నేరుగా అందించిన సంక్షేమం, మేనిఫెస్టోలో 99 శాతం హామీలు నెరవేర్చడం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పదవుల్లో కేటాయింపులు.. ఇలా అన్ని అంశాలను వివరిస్తున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. 2014 లో రెండు పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు ఇచ్చిన హామీలు….ఆ తర్వాత వాటిని అమలు చేయకుండా పక్కన పెట్టేశారని, తిరిగి అధికారం ఇస్తే అదే జరుగుతుందని చెప్పుకొస్తున్నారు జగన్.మరోవైపు టీడీపీ-జనసేన మేనిఫెస్టోపైనా విమర్శలు మొదలు పెట్టారు ముఖ్యమంత్రి జగన్. గతంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేశారని, ఇప్పుడు ఎలా నమ్ముతారని ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన పరిస్థితికి, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రజలకు తన సభల ద్వారా వివరిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
ప్రజలతోనే నా పొత్తు….నేను ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకొను అంటూ సీఎం జగన్ ధైర్యంగా చెబుతున్న మాటలు పార్టీ కేడర్ కి మరింత భరోసా ఇస్తున్నాయని చెబుతున్నారు. టీడీపీ-జనసేన పొత్తు ప్రకటన తర్వాత వైసీపీలోని కొంతమంది నేతలు స్థానిక పరిస్థితులు అంచనా వేసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారికి సీఎం చేస్తున్న కామెంట్స్ మరింత భరోసా ఇస్తున్నాయని అంటున్నారు. తాజాగా మాచర్ల సభలో ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ ద్వారా అభివృద్ధి,సంక్షేమం నినాదాల తో ప్రజల్లోకి వెళ్తున్నారట స్థానిక నాయకులు, రాబోయే రోజుల్లో సీఎం జగన్ మరింత ఎక్కువగా విమర్శల దాడి పెంచేలా ముందుకెళ్తారని పార్టీవర్గాలు చెబుతున్నాయి.వై నాట్ 175 అంటూ తనతో పాటు పార్టీ నేతలను ప్రజాల్లోనే ఉండేలా చూస్తూ ఎన్నికలకు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే వివిధ రకాల కార్యక్రమాల ద్వారా పార్టీ కేడర్‌ను ఏడాదిన్నరగా ప్రజల మధ్యలో ఉండేలా చేశారు. గడప గడపకూ మన ప్రభుత్వం, జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష, సామాజిక సాధికార యాత్రలు, వై ఏపీ నీడ్స్ జగన్.. ఇలా అనేక కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు.
తన ప్రభుత్వం వల్ల మంచి జరిగిందని అనిపిస్తేనే మళ్లీ ఓటు వేయండని అడుగుతున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేసిన మంచిని వివరించడంతో పాటు సంక్షేమ పథకాలు సరిగా అందుతున్నాయో లేదో తెలుసుకుంటూ సాగిపోతున్నారు. ఇలా ఎన్నికల వరకూ పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.