rishikonda
ఆంధ్రప్రదేశ్ జాతీయం

రుషి కొండపై అన్ని కోట్లా…

 విశాఖలోని రుషికొండలో నిర్మాణాలపై స్పష్టత వస్తోంది. అవి సీఎం క్యాంప్ కార్యాలయం, నివాసం కోసమేనని తెలుస్తోంది. దీనికి గాను వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్లు ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ వెబ్ సైట్ లో వివరాలు పొందుపరచడంతో ఈ విషయం బయటపడింది. విలాసవంతమైన భవనాలు, ఆధునిక సౌకర్యాలతో చేపడుతున్న నిర్మాణాలు విషయంలో ప్రభుత్వం గోప్యత పాటిస్తూ వచ్చింది. కానీ కోర్టు ఆదేశాలతో వివరాలు వెల్లడించడం తప్పనిసరిగా మారింది. అంచనా వ్యయం కంటే 16% అధిక ధరలకు పనులు అప్పగించడం వెలుగులోకి వచ్చింది.చాలా రోజులుగా రుషికొండపై నిర్మాణాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. పర్యాటక ఆనవాళ్లను లేకుండా చేసి.. అక్కడ ప్రభుత్వ భవనాల నిర్మాణం చేపడుతున్నారని గత కొద్దిరోజులుగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై న్యాయస్థానాల్లో సైతం ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్నాయి.

అయినా ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తెరచాటు నిర్మాణాలు పూర్తి చేసింది. దీనిపై విపక్షాలు ఎన్ని రకాలు విమర్శలు చేసిన స్పందించిన దాఖలాలు లేవు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే నేరుగా రిషికొండ వెళ్లి పరిస్థితిని తెలుసుకున్నారు. అక్కడ జరుగుతున్న నిర్మాణాలు పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయినా సరే ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేదు.అయితే ప్రభుత్వ జీవోలు విషయంలో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ జరుగుతున్న నిర్మాణాలు ఏంటి? వాటికి చేసిన ఖర్చు ఎంత? అన్నదానిపై జీవోలను ఆన్లైన్లో పెట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.దీంతో ప్రభుత్వం ఆ వివరాలను పెట్టడం అనివార్యంగా మారింది. రూ. 433 కోట్లు ఖర్చు చేసినట్లు స్పష్టం చేసింది. ఋషికొండ పునర్ అభివృద్ధి ప్రాజెక్టు పేరుతో ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ నుంచి తొలుత రూ.350.16 కోట్లు కేటాయించింది. వాటికి అదనపు కేటాయింపులు చేసింది. కళింగ, వేంగి, గజపతి, విజయనగర బ్లాకుల పేరుతో భారీ నిర్మాణాలు చేపట్టింది. అయితే తాజా ఖర్చుతో రూ.100 కోట్లు దాటితే న్యాయ సమీక్షకు వెళ్తామన్న ఉత్తర్వులను ప్రభుత్వమే ఉల్లంఘించింది.

ప్రారంభంలో ఈ నిర్మాణాలను పర్యాటకంగా ప్రభుత్వం చూపించింది. తరువాత ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. సీఎం క్యాంప్ కార్యాలయం ఏర్పాటుకు అనుకూలమంటూ నివేదిక తెప్పించుకుంది. ఈ ప్రాజెక్టు పనుల్లో భాగంగా తొలి దశలో రూ.92 కోట్లు కేటాయించారు. అయితే రూ.159 కోట్లకు మార్చారు. రెండో దశ పనులకు రూ.94.49 కోట్లు ఖర్చు చేశారు. మూడో దశలో రూ.112.76 ఓట్లుగా చూపారు. ఇందులో రహదారులు, తాగునీరు, విద్యుత్, మురుగు నీటిపారుదల పనులకు రూ.46 కోట్లు ఖర్చు పెట్టడం విశేషం. అయితే ఇది సొంత నిర్మాణాలు మాదిరిగా అత్యాధునిక టెక్నాలజీ, ప్రైవేట్ ఆర్కిటెక్చర్ సేవలను వినియోగించడం విశేషం. అయితే ఇన్నాళ్లు గోప్యత పాటించగా.. ఇప్పుడు బయటకు వెల్లడించడం.. వందల కోట్ల ఖర్చు చేయడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.