అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరిగేందుకు అవసరమైన సకల ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
మంగళవారం రామగిరిలోని సెంటినరీ కాలనీలో ఉన్న జేఎన్టీయూ మంథని కళాశాలను పెద్దపల్లి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి పరిశీలించి కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ డిసెంబర్ 3వ తేదీన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుందని, పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గం కౌంటింగ్ జేఎన్టీయూ కళాశాలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
కౌంటింగ్ కు హాజరయ్యే సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లకు వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలని, కౌంటింగ్ నిర్వహణ కోసం అవసరమైన బారీకేడ్లను ఏర్పాటు చేయాలని అన్నారు. కౌంటింగ్ భవనం ఆవరణలో గ్రౌండ్ లెవెలింగ్ చేయాలని, నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ ఏజెంట్లు వచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, ప్రతి ఒక్కరికి నిర్దేశించిన మార్గాలను సూచిస్తూ అవసరమైన చోట్ల సూచిక బ్యానర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.
కౌంటింగ్ నిర్వహణ సమయంలో ఎన్నికల పరిశీలకుల కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని, అందులో సీసీ కెమెరాలు, వేగవంతమైన నెట్ సౌకర్యం, కంప్యూటర్ లు, సీటింగ్ ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు.
కౌంటింగ్ కేంద్రంలో మూడు నియోజక వర్గాలకు సంబంధించిన కౌంటింగ్ హాళ్లు, స్ట్రాంగ్ రూములను పరిశీలించిన కలెక్టర్, అక్కడ చేయాల్సిన ఏర్పాట్లపైఅధికారులకు పలు సూచనలు చేశారు. స్ట్రాంగ్ రూమ్ లో, కారిడార్ లో జరిగే విషయాలు కూడా రికార్డ్ చేసే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు.
కౌంటింగ్ హళ్ళలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం తగిన ఏర్పాట్లు చేయాలని, ప్రతి కౌంటింగ్ హాల్ కు మెటల్ మెష్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.
కౌంటింగ్ సమయంలో వచ్చే కౌంటింగ్ ఏజెంట్ల కోసం టాయిలెట్ల సౌకర్యం, కౌంటింగ్ హాళ్ల వద్ద ఏజెంట్ల కోసం త్రాగునీటి వసతి కల్పించాలని, కౌంటింగ్ లో పాల్గొనే సిబ్బంది కోసం భోజన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. జెఎన్టియు కళాశాలలో ఉన్న సెమినార్ హాల్లో మీడియా సెంటర్ ఏర్పాటు చేయాలని, ప్రతి రౌండ్ కౌంటింగ్ వివరాలు సకాలంలో మీడియాకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట మంథని రిటర్నింగ్ అధికారి వి.హనుమ నాయక్, తహసిల్దారులు రాజ్ కుమార్, కుమార స్వామి, రామ్ మోహన్ రావు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.