తెలంగాణ ఎన్నికల పోలింగ్ దగ్గర పడింది. మరో వారం రోజుల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచారాన్ని మరింత హోరెత్తించేందుకు పార్టీలు, పార్టీల అగ్రనేతలు సంసిద్ధమవుతున్నారు. ఊరూవాడా చుట్టేసి ఓటర్ల మదిలో ముద్రపడేలా చూసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్లాన్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సర్వే రిపోర్టులు తెప్పించుకొని వీక్‌గా ఉన్న ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. నేతలకు ఫోన్లు చేసి ఉన్న సమస్యలు తెలియజేస్తూ కేడర్‌ను కలుపుకు వెళ్లాలని సూచనలు చేస్తున్నారు. ఎన్నికల ప్రస్తావన వచ్చినప్పటి నుంచి దూసుకెళ్తున్న బీఆర్‌ఎస్… ప్రచారంలో కూడా అదే స్పీడ్ కొనసాగిస్తోంది. ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదన్న ఆలోచనతో అందివచ్చిన ఏ అవకాశాన్ని వదలడం లేదు. కచ్చితంగా హ్యాట్రిక్ సాధిస్తామని చెబుతున్న సీఎం కేసీఆర్.. ఎక్కడా అలసత్వం లేకుండా అందర్నీ పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతి నిత్యం ప్రచార సభల్లో పాల్గొంటూ కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
వారం రోజులే గడువు ఉన్నందున కేసీఆర్ తన ప్రచారాన్ని మరింత వేగం పెంచబోతున్నారు. ఇప్పటికే 70కిపైగా నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన ఆయన…ప్రచార గడువు ముగిసేలోపు వంద నియోజకవర్గాలను చుట్టేయాలని ఆలోచనలో ఉన్నారు. ఓవైపు కేసీఆర్ ప్రచారం హోరెత్తిస్తుంటే మరోవైపు హరీష్, కేటీఆర్ కూడా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. మండల స్థాయిలో ప్రచారం చేస్తూ పదేళ్లు సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తున్నారు. మిగతా మంత్రులు, ఇతర నేతలు తమ తమ నియోజకవర్గాలకే పరిమితమైన గెలుపు తలుపు తట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా అధికార పార్టీకి దీటుగా ప్రచారంలో మునిగిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చుట్టేస్తున్న రేవంత్ రెడ్డి… బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, పడుతున్న ఇబ్బందులు వివరిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే తీసుకోబోయే పథకాలతోపాటు మేనిఫెస్టో ప్రజలకు తెలియజేస్తూ విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. రేవంత్ రెడ్డికి సపోర్ట్‌గా కాంగ్రెస్ అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు.
వారితోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఫేమస్ లీడర్లు కూడా తెలంగాణలో ఓ లుక్ వేస్తున్నారు. వచ్చే వారం రోజుల పాటు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక సహా ఇతర నేతలంతా వచ్చి తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఊరూవాడా తెరగనున్నారు. తెలంగాణ పార్టీలో సీనియర్లు కూడా విభేదాల సంగతి పక్కన పెట్టి తమ నియోజకవర్గంలో విజయం కోసం మాత్రమే శ్రమిస్తున్నారు. వాళ్లెవరు కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడంలేదు. స్టార్ క్యాంపెయినర్స్‌గా ఉన్న వాళ్లు కూడా తమ నియోజకవర్గానికో తమ జిల్లాకో పరిమితమై ప్రచారం చేస్తున్నారు. బీజేపీలో కూడా ప్రచారం హోరెత్తుతోంది. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న కాషాయం దళం ఈ మధ్య కాలంలోనే క్యాంపెయిన్ స్పీడ్ పెంచారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల ముగ్గురు కూడా రాష్ట్రాన్ని చూట్టేస్తున్నారు. తమకు కీలకమైన ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం శ్రమిస్తున్నారు. వారికి తోడుగా కేంద్రమంత్రులు, ఢిల్లీ నుంచి అగ్రనేతలు వచ్చి అడపాదడపా ప్రచారం చేస్తున్నారు. ఈ వారంలోనే మోదీ, అమిత్‌షా మరోసారి ప్రచారం చేయనున్నారు.
మిగతా రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు ఉన్నందున తెలంగాణతో పోలిస్తే ఆయా రాష్ట్రాలపై వారి ఫోకస్ ఎక్కువగా ఉంది.బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్ ప్రచారం నేటి నుంచి మొదలు కానుంది. పవన్ కల్యాణ్‌తో ప్రచారం తమ పార్టీకి లాభిస్తుందని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ వారంలో రోజుల పాటు వివిధ నియోజవర్గాల్లో జనసేన ప్రచారం చేయనున్నారు. జనసేన పోటీ చేసే 8 నియోజకవర్గాలకే ఆయన ప్రచారం పరిమితం అవుతుంది. ఆయనతోపాటు ఎవరెవరు ప్రచారంలో పాల్గొంటారనేది మాత్రం క్లారిటీ లేదు. ఆఫ్‌లైన్ ప్రచారంలో ఇలా ఉంటే ఆన్‌లైన్ ప్రచారంలో ఎవరూ తగ్గడం లేదు. ఒకరికి మించి మరొకరు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నారు. పార్టీలతోపాటు నాయకులంతా ఎవరికి వారుగా టీంలను ఏర్పాటు చేసుకొని సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకుంటున్నారు. ఇన్‌ఫ్లూయెన్సర్లతో ప్రత్యేక ఇంటర్వ్యూలు, సమాన్య ప్రజల పేరుతో ప్రత్యేక ముఖాముఖీలు అంటూ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.