అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో సీఎం జగన్, సీబీఐ సహా ప్రతివాదులందరికీ జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ పంకజ్ మిత్తల్ నేతృత్వంలోని సర్వోన్నత న్యాయస్థానం నోటీసులిచ్చింది. ‘ఇప్పుడే బెయిల్ రద్దు చేయాలా.?’ అని ధర్మాసనం పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించగా, నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియ చేపట్టాలని కోర్టును కోరారు. ఇప్పటికే విచారణను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాలని రఘురామ పిటిషన్ వేయగా, ఆ పిటిషన్ సైతం జత చేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను 2024, జనవరి తొలి వారానికి వాయిదా వేసింది.అక్రమాస్తుల కేసులో జగన్ గత పదేళ్లుగా బెయిల్ పై బయటే ఉన్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్ష్యాలు చెరిపేస్తున్నారని ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలంగాణ హైకోర్టులో తొలుత పిటిషన్ దాఖలు చేశారు.
అయితే, దీనిపై సీబీఐ సమాధానంతో ఈ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో రఘురామ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారించిన న్యాయస్థానం, ‘సాక్ష్యాలు చెరిపేస్తున్నారు అనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా.?’ అని ప్రశ్నించింది. దీంతో కేసుకు సంబంధించిన వివరాలు, జరిగిన ఘటనలపై లిఖితపూర్వక వివరాలను రఘురామ తరఫు న్యాయవాది కోర్టుకు అందించారు. జగన్ కు బెయిల్ మంజూరు చేసిన తర్వాత దర్యాప్తు సంస్థలు ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేయలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు సీఎం జగన్ సహా, ప్రతివాదులకు నోటీసులిచ్చింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ పదేళ్లుగా నత్తనడకన సాగుతోందని, అందుకే మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ కూడా రఘురామ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ‘సీబీఐ నమోదు చేసిన 11 కేసులు ఇప్పటివరకూ 3,041 సార్లు వాయిదా పడ్డాయి. వీటి విచారణ త్వరగా జరిపి నిందితులను శిక్షించాలన్న ఉద్దేశం సీబీఐలో కనిపించట్లేదు.
ప్రధాన నిందితుడు జగన్ కు ఇష్టానుసారంగా వాయిదాలు కోరే స్వేచ్ఛనిచ్చారు. దీని వల్ల కేసు విచారణకు అంతు లేకుండా పోతుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే కేసు విచారణ ప్రారంభమయ్యే స్థితి కనిపించడం లేదు. అందువల్ల సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాలి. ఈ కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలి.’ అని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను బెయిల్ రద్దు అంశం పిటిషన్ తో జత చేయాలని రిజిస్ట్రీని సుప్రీంకోర్టు ఆదేశించింది.సీఎం జగన్ పై గతంలోనూ ఎంపీ రఘురామ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. అక్రమాస్తుల కేసులో నిందితులైన వారికి వివిధ పదవులు కట్టబెట్టడం, ఇతర ప్రయోజనాలు కల్పిస్తున్నారని ఇందుకు సాక్ష్యాలుగా కోర్టుకు నివేదించారు. అయితే, ఈ పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టేసింది.