తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వంలో గల్ఫ్ కార్మికులు తమ గోడు వినిపించేందుకు సమాయత్తమయ్యారు. తమ సమస్యలను గాలికొదిలివేసిన ప్రధాన రాజకీయ పార్టీలకు తమ గోసను వినిపించేందుకు గల్ఫ్ కార్మికులు అయిదుగురు ఎన్నికల బరిలో నిలిచారు. గల్ఫ్ దేశాల్లో 15 లక్షల మంది తెలంగాణ ప్రవాసి కార్మికులు పనిచేస్తున్నారు. గత పదేళ్లలో గల్ఫ్ నుంచి వాపస్ వచ్చి గ్రామాల్లో నివసిస్తున్న మరో 15 లక్షల మంది గల్ఫ్ రిటనీలున్నారు.గల్ఫ్ కార్మికుల కుటుంబ సభ్యులు, రిటనీలు తమ దీర్ఘకాల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ గత కొంత కాలంగా ఆందోళనలు చేస్తున్నారు. అయినా పాలకులు వారి సమస్యలను పట్టించుకోలేదు. దీంతో తమ హక్కులు, సంక్షేమం కోసం గల్ఫ్ కార్మికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటంలో భాగంగా ఈ సారి ఎన్నికల్లో పోటీకి దిగారు. గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, గల్ఫ్ బోర్డు, ఎన్నారై పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రాజకీయ పక్షాలకు తమ గల్ఫ్ గోసను వినిపిస్తున్నారు.
గతంలో ఏ పార్టీ కూడా గల్ఫ్ కార్మికుల గోడును పట్టించుకోలేదు. గల్ఫ్ కార్మికుల పోరాటంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని వారి మ్యానిఫెస్టోల్లో హామీలిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ గల్ఫ్ కార్మికుల కష్టాల గురించి మ్యానిఫెస్టోలో ప్రస్థావించలేదు. గల్ఫ్ కార్మికులు ఎన్నికల బరిలోకి దిగడంతో స్పందించిన సీఎం కేసీఆర్ ఇటీవలి డిచుపల్లి బహిరంగ సభలో తెల్ల రేషన్ కార్డుదారులకు ఇవ్వనున్న రూ.5 లక్షల బీమా పథకాన్ని గల్ఫ్ కార్మికులకు కూడా వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు.విదేశీ మారక ద్రవ్యాన్ని పంపిస్తూ దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్న గల్ఫ్ కార్మికులు ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిరసనగా తమ గల్ఫ్ సంఘాల నేతలను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించారు. సిరిసిల్ల నుంచి గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక అధ్యక్షులు దొనికెని క్రిష్ణ ఇండిపెండెంట్ అభ్యర్థిగా మంత్రి కేటీఆర్ తో తలపడుతున్నారు.
నాలుగు నియోజకవర్గాల్లో గల్ఫ్ లీడర్లు రంగంలో దిగారు.వేములవాడ, కోరుట్ల,నిర్మల్,ధర్మపురి నుంచి పోటీలో నిలిచారు. గ్రామాల వారీ గల్ఫ్ వాట్సాప్ గ్రూపులే రాజకీయ వేదికలుగా ప్రచారం చేస్తున్నారు.ఐదు స్థానాల్లో పోటీలో ఉన్న గల్ఫ్ సంఘాల నాయకులకు ఓటు వేసి గెలిపించాలని సౌదీ అరేబియా, యూఏఈ (దుబాయి), ఓమాన్ (మస్కట్), కువైట్, ఖతార్, బహరేన్ ఆరు అరబ్ దేశాలతో పాటు సింగపూర్, మలేసియా తదితర దేశాల నుంచి గ్రామాల్లోని తమ కుటుంబ సభ్యులకు పెద్ద ఎత్తున వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, జూమ్, బోటిమ్, ఐఎంఓ లాంటి యాప్ లతో ఆడియో, వీడియో కాల్స్ చేస్తున్నారు.తెలంగాణలోని 32 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ఆర్ఐ కుటుంబాల ప్రభావం ఎక్కువగా ఉంది. గల్ఫ్ వలసలు అధికంగా ఉన్న ముధోల్, ఖానాపూర్ (ఎస్టీ), చొప్పదండి (ఎస్సీ), బాల్కొండ, ఆర్మూర్, జగిత్యాల, ఎల్లారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో గల్ఫ్ వలసలున్నాయి.
ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, హుజూరాబాద్, హుస్నాబాద్, మానకొండూరు (ఎస్సీ), నిజామాబాద్ అర్బన్, బోధన్, పెద్దపల్లి, దేవరకద్ర, మక్తల్, మెదక్, సిద్దిపేట, దుబ్బాక, నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరి, పరిగి లలో గల్ఫ్ ఓటు బ్యాంకు ఓ మోస్తరుగా ఉంది. వీరు ఏ రాజకీయ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనేది చర్చ నడుస్తోంది.గల్ఫ్ కార్మికులతోపాటు ఎన్ఆర్ఐ కుటుంబాల ఓట్లను కైవసం చేసుకునేందుకు అన్ని రాజకీయ పక్షాలు యత్నిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల ప్రణాళికలో గల్ఫ్ సంక్షేమానికి కృషి చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తామని, గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. దీనిలో భాగంగా కోరుట్లలో గల్ఫ్ గర్జన సభ నిర్వహించారు. గల్ఫ్ కార్మికుల గోడును రాజకీయపార్టీలకు వినిపించేందుకు తమ కార్మికులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని గల్ఫ్ కార్మికు నాయకుడు మంద భీంరెడ్డి చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యూఎస్, ఆస్ట్రేలియా, గల్ఫ్ కంట్రీస్ నుంచి ఎన్ఆర్ఐలు వచ్చి హైదరాబాద్ నగరంలో మంగళవారం సమావేశమయ్యారు. విదేశాల్లో మరణించినా వారి మృతదేహాలను స్వదేశానికి తీసుకురావాలని ఎన్ఆర్ఐలు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికల్లో గల్ఫ్, ఎన్ఆర్ఐల ప్రభావం ఏ మేర ఉంటుందనేది డిసెంబర్ 3వతేదీ ఓట్ల లెక్కింపు తేదీ వరకు వేచి చూడాల్సిందే.