kcr
తెలంగాణ రాజకీయం

ప్రజలను రెచ్చగొట్టవద్దు కేసీఆర్ కు ఈసీ లెటర్

సీఎం కేసీఆర్  కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఈసీఐ అడ్వైజరీ కమిటీ లేఖను సీఈవో వికాస్ రాజ్  శుక్రవారం ముఖ్యమంత్రికి పంపించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అనుచిత వ్యాఖ్యలు సరికాదని ఈసీ తెలిపింది. ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగించొద్దని హితవు పలికింది. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి జరిగిన ఘటనపై స్పందిస్తూ బాన్సువాడ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘భిన్న కులమతాలు, వర్గాల ప్రజల మధ్య వైషమ్యాలు పెంపొందించేలా ఈ ప్రసంగం ఉంది. ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనే’ అని ఈసీఐ స్పష్టం చేసింది. ఇకపై అలాంటి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చెయ్యొద్దని సూచించింది.మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై అక్టోబర్ 30న దాడి జరిగింది. ఈ ఘటనపై స్పందించిన సీఎం కేసీఆర్ అదే రోజు నిజామాబాద్ జిల్లా బాన్సువాడలోని ఎన్నికల ప్రచారంలో సభలో మాట్లాడారు.

అయితే, ఈ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీన్ని పరిశీలించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ భారత ఎన్నికల సంఘానికి రిపోర్ట్ చేశారు. దీన్ని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ అడ్వైజరీ కమిటీకి లేఖ రాసింది. ఈ లేఖను కేసీఆర్ కు పంపాలని అడ్వైజరీ కమిటీ నిర్ణయించి, తగు ఆదేశాలిచ్చింది. దీంతో సీఎంకు సీఈవో వికాస్ రాజ్ లేఖను పంపించారు.