- పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం
- ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కేటీఆర్
1,320 డబుల్‌బెడ్రూం ఇండ్లు. ముచ్చటగా మూడు వైపులా భగీరథ ట్యాంకులు, చక్కటి రోడ్లు, సౌకర్యాలు. సిరిసిల్లలో డబుల్ బెడ్రూం ఇండ్లను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదివారం ప్రారంభించనున్నారు.
కరీంనగర్, జూలై 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/రాజన్న సిరిసిల్ల, (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. సీఎం కేసీఆర్ రాక కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో కార్మికక్షేత్రాన్ని గులాబీమయం చేశాయి. సీఎం పర్యటనను మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. శనివారం విరామం లేకుండా పర్యటించారు. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న అన్ని కార్యాలయాలను సందర్శించారు. పలు సూచనలు చేశారు.
ముఖ్యమంత్రి పర్యటన ఇలా..
సీఎం కేసీఆర్ ఆదివారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో బయలుదేరుతారు. 10.30 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లి గ్రామానికి చేరుకుంటారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు బయలుదేరి 7 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. సీఎం పర్యటన సందర్భంగా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో 2,100 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
ఆరోగ్య తెలంగాణే లక్ష్యం: మంత్రి కేటీఆర్
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సర్కారు ముం దు కు పోతున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. అం దుకే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. వేములవాడలో శనివారం ఆయన పర్యటించారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మొక్కనాటారు. మున్సిపల్ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్ రామతీర్థపు మాధవితో కలిసి కౌన్సిలర్లు, అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షించారు. అనంతరం మొబైల్ షీ టాయిలెట్స్ ను ప్రారంభించి, 10వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమాల్లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, కృష్ణభాస్కర్, ఐజీ నాగిరెడ్డి, ఎస్పీ రాహుల్ హెగ్డే, జడ్పీ చైర్‌పర్సన్ అరుణ, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, టీఆర్‌ఎస్ నేతలు చీటి నర్సింగరావు, చిక్కాల రామారావు, తోట ఆగయ్య, గోపాల్‌రావు ఉన్నారు.
నేటి ప్రారంభోత్సవాలు
- 82 ఎకరాల్లో రూ.70 కోట్లతో జీ ప్లస్ 3 అంతస్తులతో ఆధునిక హంగులతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనం
- 5 ఎకరాల్లో రూ.36 కోట్లతో నిర్మించిన నర్సింగ్ కళాశాల
- తంగళ్లపల్లి మండలం మండెపల్లి శివారులో 20 ఎకరాల్లో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్
- రూ.80 కోట్లతో విల్లాలను తలపించేలా నిర్మించిన 1,320 డబుల్ బెడ్‌రూం ఇండ్లు
- రూ. 22 కోట్లతో నిర్మించిన మోడ్రన్ మార్కెట్ యార్డుకు ప్రారంభోత్సవం
- పద్మశాలీ ట్రస్ట్ భవన్‌కు శంకుస్థాపన