karnataka-leaders
తెలంగాణ రాజకీయం

హైదరాబాద్ లో కర్ణాటక నేతలు…మకాం

ఆరు నెలల క్రితం కర్ణాటక అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అనూహ్య విజయం సాధించింది. ఇదే స్ఫూర్తితో కాంగ్రెస్‌ అధిష్టానం తెలంగాణపై ప్రత్యేక దృష్టిపెట్టింది. తెలంగాణలో గెలిచి వరుసగా రెండో రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాలని చూస్తోంది. ఇందకోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ క్రమంలో కర్ణాటక ఎన్నికల్లో అమలు చేసిన వ్యూహాలనే తెలంగాణలో అమలు చేస్తోంది. ప్రణాళిక బద్ధంగా అధికార బీఆర్‌ఎస్‌ను ఢీకొడుతోంది.ఆరునెలల క్రితమే కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడి నేతలతో తెలంగాణలో ప్రచారం చేయించడం ద్వారా ఎక్కువ ఫలితం ఉంటుందని కాంగ్రెస్‌ అగ్రనేతలు భావించారు. ఈమేరకు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయడానికి కర్ణాటక నుంచి దాదాపు 3/4 వంతు మంది నాయకులను తెలంగాణలో మోహరించింది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం కోసం కాంగ్రెస్‌ వ్యూహత్మకంగా కర్ణాటక క్యాబినెట్‌లోని 75 శాతం మంత్రులను రంగంలోకి దించింది.

బి. నాగేంద్ర వంటి(ఎస్టీ సంక్షేమం మరియుక్రీడలు), జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌(హౌసింగ్‌), డి.సుధాకర్‌ (ఉన్నత విద్య), ఇతరులతో పాటు పలువురు కొంతకాలంగా తెలంగాణలో క్యాంపులు చేస్తున్నారు . ఆదివారం సిద్ధరామయ్యతో కలిసి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్‌ ప్రత్యేక విమానంలో వారితో చేరారు. శివకుమార్‌ కూడా గత కొంతకాలంగా తెలంగాణలో ఉన్నారు. చివరి రోజు ప్రచారానికి రవాణా మంత్రి ఆర్‌ రామలింగారెడ్డి, ఇంధన శాఖ మంత్రి కేజే జార్జ్, ఖాన్, హెబ్బాల్కర్‌ మరియు ఇతరులు రానున్నారు.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ ఐదు గ్యారెంటీలు హామీ ఇచ్చింది. ఇప్పుడు అవే హామీలు అమలు చేస్తున్నట్లు మంత్రులతో తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేయిస్తోంది. కర్ణాటకలో గ్యారెంటీలు అమలు కావడం లేదని బీఆర్‌ఎస్‌ చేస్తున్న ప్రచారాన్ని తిప్పకొడుతున్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే తెలంగాణలో కూడా ఆరు గ్యారెంటీలు అమలవుతాయని చెబుతున్నారు. కర్ణాటకాలో హామీలు అమలు కావడం లేదని కేసీఆర్‌ చేసిన ఆరోపణలను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఖండించారు.

ఐదు హామీల్లో నాలుగింటిని కాంగ్రెస్‌ పార్టీ విజయవంతంగా అమలు చేసిందని, ఐదో హామీని త్వరలో ప్రారంభిస్తామని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కర్నాటకలో ఐదేళ్లపాటు మా హామీలు కొనసాగుతాయని, తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ తన ఆరు హామీలను అమలు చేస్తుందన్న నమ్మకం ఉందని తెలిపారు.