తెలంగాణ ముఖ్యాంశాలు

శ్రీశైలంలో ఏపీ జలదోపిడీ

  • విద్యుత్‌ ప్రాజెక్టును సాగునీటి ప్రాజెక్టుగా మార్చిన సీమాంధ్ర నేతలు
  • 1500 క్యూసెక్కులు వెళ్లాల్సిన చోట 75 వేల క్యూసెక్కులకు కాలువలు
  • తెలంగాణను ఎడారిచేసి పెన్నా బేసిన్‌కు నీటి తరలింపు కుట్రలు
  • రాయలసీమ పూర్తయితే రోజుకు 10 టీఎంసీల నీటి తరలింపు

నిధులు, నీళ్లు, నియామకాల దోపిడీ లక్ష్యం దాదాపు అరు దశాబ్దాలు తెలంగాణను వంచించిన సీమాంధ్ర నేతలు.. తెలంగాణ వనరులను ఎలా తమ వశం చేసుకున్నారనేదానికి సజీవ సాక్ష్యం శ్రీశైలం ప్రాజెక్టు. ఎక్కడి నుంచి ఏ లక్ష్యంతో ప్రారంభమై.. ఏ దిశగా మళ్లించారనేదానికి నిలువెత్తు నిదర్శనం శ్రీశైలం. కేవలం జల విద్యుత్తు ఉత్పత్తి కోసమే కృష్ణా బేసిన్‌లో నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టును ఏకంగా పెన్నా బేసిన్‌కు తరలించుకు పోయేందుకు సీమాంధ్ర నేతలు, అప్పటి ప్రభుత్వాలు చేయని కుతంత్రాలు, కుయుక్తులు, మోసాలు లేవు. ఈ ప్రాజెక్టును సాగునీటి కోసమే నిర్మించారని ప్రస్తుత ఏపీ ప్రభుత్వం దబాయింపులకు దిగుతుండటం వెనుక దశాబ్దాలుగా జరిగిన కుట్రల దాగున్నాయి.

1952లో ఏఎన్‌ ఖోస్లా కమిటీ సిఫారసుల మేరకు కృష్ణానదిపై నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టారు. కేంద్ర జల సం ఘం (సీడబ్ల్యూసీ) ముందుకు శ్రీశైలం ప్రాజెక్టు ప్రతిపాదన రాగానే మహారాష్ట్ర, కర్ణాటక తీవ్రం గా వ్యతిరేకించాయి. దాంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు జల విద్యుత్తు ఉత్పత్తికి రాతపూర్వక హామీ ఇచ్చారు. సీడబ్ల్యూసీ ఉత్తర్వుల్లోనూ, 1969లో ప్లానింగ్‌ కమిషన్‌ ప్రాజెక్టు మంజూరు విషయంలోనూ శ్రీశైలం జల విద్యుత్తు కోసమేనని స్పష్టంగా పేర్కొన్నాయి. 1976లో బచావత్‌ ట్రిబ్యునల్‌ తుది నివేదిక ప్రకారం కృష్ణా నది జ లాలను పంపిణీ చేస్తూ.. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 800 టీఎంసీల నీటిని కేటాయించింది. ఇందులో శ్రీశైలం ప్రాజెక్టును కేవలం జల విద్యు త్తు కోసమే కట్టినందున దీనికి సాగునీటి కేటాయించలేదు. నీటి ఆవిరి కింద 33 టీఎంసీలను కేటాయించింది. ఇవి కూడా ఏపీకి కేటాయించిన 800 టీఎంసీలలోనే చూపించారు. కృష్ణా బేసిన్‌లో రీజనరేట్‌ అయ్యే 70 టీఎంసీలలో 11 టీఎంసీలు ఏపీకి, 35 టీఎంసీలు కర్ణాటకకు, 24 టీఎంసీలు మహారాష్ట్రకు కేటాయించింది. ఏపీకి మొత్తం 811 టీఎంసీలు అయ్యింది.

ప్రణాళికాబద్దంగా కుట్ర..

మూడు రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల కేటాయింపు పూర్తికాగానే అప్పటి సీమాంధ్ర పాలకు లు కుట్రలకు తెరతీశారు. ప్రణాళికాబద్దంగా తెలంగాణకు దక్కాల్సిన నీటిని మెల్లగా కృష్ణా బేసిన్‌ అవతల ఉన్న పెన్నా బేసిన్‌లోకి తరలించడం ప్రారంభించారు. తెలంగాణలోని కృష్ణా బేసిన్‌ అవసరాలు తీర్చకుండా చెన్నైకి తాగునీటి పేరుతో 1,500 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో శ్రీశైలం నుంచి మొదలైన జలచౌర్యం పెరుగుతూ ఇప్పుడు 75,000 క్యూసెక్కులకు చేరింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే శ్రీశైలం నుంచి తరలించే నీటి పరిమాణం రోజుకు 10 టీఎంసీలకు పైగా ఉంటుంది.

  • 1976లో చెన్నై తాగునీటి కోసం ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర కలిసి 15 టీఎంసీల నీటిని ఇవ్వాలని నిర్ణయించాయి. నిజానికి ఈ నీటి ని ఒంగోలు వరకు ఉన్న నాగార్జున కుడి కా లువ నుంచి తీసుకోవచ్చు. ప్రకాశం బ్యారేజీ నుంచి ఉన్న కాలువను జాతీయ రహదారి వెంట చెన్నై వరకు తీసుకెళ్ళినా ఇవ్వవచ్చు. కానీ సీమాంధ్ర నేతలు కుట్రతో శ్రీశైలం నుం చి 15 టీఎంసీలు ఇవ్వాలని నిర్ణయించారు.
  • చెన్నైకి తాగునీటిని తరలించేందుకు పోతిరెడ్డిపాడు వద్ద స్లూయిస్‌ కట్టాలని నిర్ణయించారు. కాలువకు లైనింగ్‌ చేసి నీటిని తీసుకువెళ్ళాలి. అదే సమయంలో ఎస్సార్‌బీసీ (శ్రీశైలం రైట్‌ బ్రాంచ్‌ కెనాల్‌)ను తెరపైకి తీసుకొచ్చారు. దీనికి నీటి కేటాయింపులు లేవు. కానీ కేసీ కెనాల్‌ (కర్నూలు-కడప కాలువ) కు సుంకేశుల ఆనకట్ట నుంచి నీటిని తీసుకెళ్ళేవారు. ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలలో సుం కేశులకు 39.9 టీఎంసీలు కేటాయించేలా కుట్రచేశారు. కేసీ కెనాల్‌ను ఆధునీకరిస్తే 8 టీఎంసీలు ఆదా చేయవచ్చని దొంగ లెక్కలు చెప్పారు. ఇలా మిగిలిన 8 టీఎంసీలు, రీజనరేట్‌ అయిన 11 టీఎంసీలు, చెన్నై తాగునీటి కోసం (తెలుగు గంగ) కేటాయించిన 15 టీఎంసీలు.. మొత్తం 34 టీఎంసీలను తీసుకెళ్లేలా గేట్లు పెట్టాలని నిర్ణయించారు.
  • 5 నెలల్లో 34 టీఎంసీలు తీసుకెళ్లాలి. అంటే నెలకు 7 టీఎంసీలు అయితే 2,250 క్యూసెక్కుల విడుదల సామర్థ్యంతో (1,500 క్యూ సెక్కులు తెలుగు గంగకు, 750 క్యుసెక్కులు ఎస్సార్‌బీసీకి) తూములు సరిపోతాయి. కానీ 11,500 క్యూసెక్కుల సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు వద్ద మోసపూరితంగా 4 తూ ములు కట్టారు. వాస్తవానికి మూడు తూము లు సరిపోతాయి. కానీ ఇందులో ఒకటి స్టాండ్‌ బై అని చెప్పారు.
  • ఒక్కో తూము నుంచి 4 వేల క్యూసెక్కులు మాత్రమే ప్రవహిస్తాయని సీమాంధ్ర నేతలు నమ్మబలికారు. కానీ ఒక్కో తూము నుంచి 5,000 క్యూసెక్కులు వెళ్లేలా నిర్మించారు. హైదరాబాద్‌లోని సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ (సీడీవో) ద్వారా కాకుండా పోతిరెడ్డిపాడు వద్ద చేపట్టిన తూముల నిర్మాణం కోసం మాత్రం ప్రత్యేక డిజైన్‌ విభాగాన్ని రాయలసీమలోనే ఏర్పాటుచేసుకున్నారు. 2,250 క్యూసెక్కులకు అనుమతి ఉంటే 11,500 క్యూసెక్కుల కోసం నిర్మించిన 4 తూముల నుంచి 20 వేల క్యూసెక్కుల నీటిని తరలించేలా పోతిరెడ్డిపాడును నిర్మించారు. దీంతో నీటి దోపిడీ ప్రారంభమైంది.
  • పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్ల రెగ్యులేటర్‌ వరకు 16.5 కిలోమీటర్లు. ఇక్కడి నుంచి కుడి కాలువ ద్వారా ఎస్సార్బీసీకి, ఎడమ కా లువ (తెలుగుగంగ) ద్వారా మద్రాసుకు వెళ్లే లా కాలువలు ఉన్నాయి. ఇందుకు 11.5 మీటర్ల వెడల్పు (బెడ్‌ విడ్త్‌) కాలువ సరిపోతుంది. కానీ 18 మీటర్ల వెడల్పుతో కాలువను నిర్మించారు. బనకచర్ల వద్ద రెండు కాలువల మధ్యలో మరో ఎస్కేప్‌ రెగ్యులేటర్‌ కూ డా నిర్మించారు. దీని ద్వారా విడుదలయ్యే నీళ్లు నేరుగా వెళ్ళి కేసీ కెనాల్‌లో కలుస్తాయి. ఇలా మొత్తం 11,500 క్యూసెక్కుల సామ ర్థ్యం పేరుతో బనకచర్ల వద్ద నిర్మించిన మూ డు రెగ్యులేటర్లు ఒక్కొక్కటి 11,500 క్యూసెక్కులతో నిర్మించారు. ఇలా తెలంగాణను మోసగించేలా, కుట్ర పూరితంగా మొత్తం 34,500 క్యూసెక్కుల సామర్థ్యంతో నీరు విడుదలయ్యేలా ఏర్పాట్లు చేశారు.
  • 11.5 మీటర్ల వెడల్పుతో నిర్మించాల్సిన కాలువను 18 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. దీని కి లైనింగ్‌ చేస్తే నీటి ప్రవాహ సామర్థ్యం రెట్టింపు అవుతుంది. మధ్యలోనే 18 మీటర్ల నుంచి 32 మీటర్లకు ఈ కాలువ వెడల్పు చేశారు. ఎందుకంటే బనకచర్ల వద్ద 11,500 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించిన మూడు రెగ్యులేటర్లకు సరిపోయేంత నీరు (34,500 క్యుసెక్కులు) కావాలంటే కాలువను వెడల్పు చేసుకోవాలి. సాంకేతికంగా చూస్తే 18 మీటర్ల కాలువకు లైనింగ్‌ చేస్తే సరిపోతుంది. కానీ 32 మీటర్లకు కాలువను వెడల్పు చేసి ప్రవా హ సామర్థ్యాన్ని మరింత పెంచారు. ఇక్కడ ఇంకో ప్రమాదం ఉన్నది. 32 మీటర్ల కాలువకు లైనింగ్‌ చేస్తే నీటి ప్రవాహ సామర్థ్యం మళ్ళీ రెట్టింపు అవుతుంది. 11.5 మీటర్లు కా లువ అని చెప్పి 18 మీటర్ల వెడల్పుతో మొదలుపెట్టి 32 మీటర్లకు పెంచారు. ఇదీ సీమాం ధ్ర నేతల కుట్ర. 32 మీటర్ల కాలువకు లైనిం గ్‌ చేస్తే 36,000 క్యూసెక్కుల నీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రవహిస్తుంది.
  • వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తర్వాత రాయలసీమకు 150 టీఎంసీల సామర్థ్యం ఉండేలా వరద జలాల ప్రాజెక్టులను మంజూ రు చేసుకున్నారు. పోతిరెడ్డిపాడు నుంచి నీటిని 44 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో తీసుకెళ్ళేలా రాజకీయ మంత్రాంగం నడిపారు. కర్ణాటకలో ఆల్మట్టి ఎత్తు పెంచడంతో వరద జలాలు కేవలం 30 రోజులపాటే వస్తున్నాయని.. అందుకే పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామ ర్థ్యం ఉండేలా 9 తూములు నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం పాత తూములకు అదనంగా మరో ఐదు నిర్మిస్తే సరిపోయేది. కానీ పాత 4 తూములను మూసివేయకుండానే మరో 10 తూములను సముద్ర మట్టానికి 841 అడుగుల వద్ద (శ్రీశైలం ఎఫ్‌ఆర్‌ఎల్‌ 885 అడుగులు) నిర్మించారు. ఇం దులో ఒకటి స్టాండ్‌బై అని చెప్పారు. దీంతో 10 గేట్ల నుంచి 44 వేలు, 4 గేట్ల నుంచి 11,500, పవర్‌హౌజ్‌ ద్వారా మరో 5 వేల క్యూసెక్కులు.. మొత్తం 70 వేల క్యూసెక్కుల నీటిని తరలించటం మొదలుపెట్టారు. వైఎస్సార్‌ మరో కుట్రచేసి 32 మీటర్ల కాలువను 78 మీటర్లకు పెంచారు. వైఎస్‌ జగన్‌ సీఎం అయిన తర్వాత 80 వేల క్యూసెక్కుల నీటిని తరలించేలా 2020లో ఆదేశాలిచ్చారు. కాలువ లైనింగ్‌ పూర్తిచేస్తే 1.40 లక్షల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లేలా ప్లాన్‌ వేశారు.

‘రాయలసీమ’తో మరింత దోపిడీ

ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సముద్ర మట్టానికి 797 ఫీట్ల వద్ద రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే ఇప్పటికే రోజుకు 7 టీఎంసీల నీటిని దోచుకుపోతున్న ఏపీ.. మరో 3 టీఎంసీల నీటిని అదనంగా తరలించుకుపోతుంది. అంటే రోజుకు 10 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు నుంచి ఏకంగా కృష్ణా నదినే తరలించుకుపోయేలా కుట్రపన్నారు.

శ్రీశైలంలో ఏపీ జలదోపిడీ