nagarjun sagar-dispute
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

నాగార్జున సాగర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు

నాగార్జున సాగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. డ్యామ్‌ 13వ గేట్‌ వరకు ఆక్రమించుకున్న ఆంధ్రా పోలీసులు కుడి కాలువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టులో ప్రస్తుతం నీటినిల్వ 522 అడుగులకు చేరింది. నీటి విడుదల ఇలాగే కొనసాగితే ప్రాజెక్టు డెడ్‌ స్టోరేజీకి చేరే అవకాశం ఉన్నది. ఇప్పటి వరకు సుమారు 4 వేల క్యూసెక్కుల నీటిని ఏపీ విడుదలచేసుకున్నది. మరో 12 అడుగుల మేర నీటిని విడుదల చేస్తే డెడ్‌ స్టోరేజీకి చేరుతుందని అధికారులు తెలిపారు. కాగా, డ్యామ్‌కు ఇరువైపులా ఇరు రాష్ట్రాలు భారీగా పోలీసులను మోహరించాయి. ఐజీ స్థాయి అధికారులు సాగర్‌ చేరుకుని పరిస్థితిని అంచనా వేసే అవకాశం ఉన్నది.నాగార్జునసాగర్‌ డ్యామ్‌పై బుధవారం రాత్రి నుంచి ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. ఏపీ ఇరిగేషన్‌ అధికారులు సుమారు 500 మంది పోలీసులతో బుధవారం అర్ధరాత్రి ఆంధ్రా ప్రాంతం వైపు ఉన్న ఎంట్రెన్స్‌ నుంచి డ్యామ్‌పైకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు.

ఈ క్రమంలో ఆంధ్రా పోలీసులు డ్యామ్‌ సెక్యూరిటీ గేట్‌పైనుంచి దూకి, గేట్‌ మోటర్‌ను ధ్వంసం చేసి గేట్‌ను తెరుచుకొని లోపలికి చొరబడ్డారు. వారిని నియంత్రిస్తున్న ఎస్‌పీఎఫ్‌ సిబ్బందిపై దాడిచేశారు.డ్యామ్‌ సీసీ కెమెరాలు, ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది ఫోన్లను ధ్వంసం చేశారు. డ్యామ్‌ 13వ గేట్‌ వరకు డ్యామ్‌ తమదని, అక్కడ ముళ్ల కంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేసి రోడ్డును మూసి వేశారు. దాంతో రాకపోకలు నిలిచిపోయాయి. డ్యామ్‌పై విధులు నిర్వహించే సిబ్బంది 13వ గేట్‌ దాటి అటువైపు ఉన్న తెలంగాణ కంట్రోల్‌ రూమ్‌ వైపు వెళ్లలేకపోయారు. తెలంగాణ పోలీస్‌ అధికారులు వచ్చి పరిస్థితిని పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్యామ్‌ పైన ఇదే పరిస్థితి నెలకొన్నది. కాగా డ్యామ్‌ నిర్వహణ అంతా తెలంగాణ ప్రభుత్వం చేపడుతుంది.

ఆంధ్రా సర్కారుకు ఆ బాధ్యత లేదు. కృష్ణా రివర్‌ బోర్డు సూచించిన నీటి వాటాల ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు డ్యామ్‌లోని నీటిని వినియోగించుకుంటాయి. ఈ నీటి వినియోగం విషయంలో పలుమార్లు ఇరు రాష్ర్టాల అధికారుల మధ్య వివాదాలు చోటుచేసుకున్నాయి. కాగా, సాగర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో అక్రమంగా నీటిని విడుదల చేసుకుంటుండటంతో కృష్ణా ట్రిబ్యునల్‌కు తెలంగాణ అధికారులు ఫిర్యాదు చేశారు.