ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిశంబర్ 3వ తేది ఆదివారం విడుదల కానున్నాయి. అయితే ఈ సమయంలోనే కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నాలుగు నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో శనివారం అఖిలపక్ష భేటీకి కేంద్రం పిలుపునిచ్చింది. ఈసారి జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఐదు రాష్ట్రాల ఎన్నికల హోరా హోరీ సమావేశాల తరువాత జరగనున్న పార్లమెంట్ సమావేశాలు కావడంతో ఆసక్తికరంగా మారింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహణపై అఖిలపక్ష భేటీకి కేంద్రం పిలుపునిచ్చింది. సమావేశానికి రావాలంటూ పార్టీలను ఆహ్వానించింది. ఈ సెషన్‌లో పలు కీలక బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలనుకుంటోంది మోదీ సర్కార్. ప్రస్తుతం 37 బిల్లులు పెండింగ్‌లో ఉండగా.. కొత్తగా మరో 7 బిల్లులను ప్రవేశపెట్టబోతోంది.టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు వేయాలన్న సిఫార్సును కూడా సభలో ప్రవేశపెట్టనుంది.
అలాగే, భారతీయ శిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి, సాక్ష్యాధారాల చట్టాల స్థానంలో కొత్త బిల్లులను సభ ముందుంచనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ల నియామక బిల్లునూ ప్రవేశపెట్టే అవకాశముంది. ఈసారి శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతాయని చెప్పాలి. దీనిపై ప్రతిపక్షాలు ఏవిధంగా స్పందిస్తాయో కూడా వేచి చూడాలి. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులను స్వాగతిస్తుందా.. లేక తిరస్కరిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ కూటమికి ఉన్న మెజార్టీతో ఏ బిల్లులనైనా ఆమోదం చేసుకునే సత్తా బీజేపీకి ఉంది. అయితే కేవలం చర్చ చేసేందుకు కాంగ్రెస్ బిల్లులను అడ్డుకుంటే అడ్డుకోవచ్చు.