తెలుగుదేశంపార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర పిఠాపురం నియోజకవర్గంలోకి చేరుకుంది.పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంవద్ద తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి,పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్.వీ.ఎస్.ఎన్.వర్మ ఆధ్వర్యంలో తెలుగుదేశంపార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులతో,తీన్మార్ డప్పులు,తప్పెటగుళ్ళు,మేళతాళాలు,భారీ బాణసంచా పేలుళ్ళ నడుమ నారా లోకేశ్ కు ఘన స్వాగతం పలికారు.ముందుగా పిఠాపురం నియోజకవర్గ తెలుగు మహిళా నాయకురాలు శ్రీవత్సవాయి లక్ష్మీదేవి మహిళలతో కలిసి నారా లోకేశ్ కు హారతి ఇచ్చారు.అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ గజమాలతో నారా లోకేశ్ ను ఘనంగా సన్మానించారు.అక్కడినుంచి నారా లోకేశ్ తన పాదయాత్రను కొనసాగించారు.చిత్రాడ గ్రామంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను,సమస్యలను నారా లోకేశ్ కు మాజీ ఎమ్మెల్యే వర్మ వివరించారు.
అదేవిధంగా ప్రజలు కూడా తండోపతండాలుగా తరలివచ్చి నారా లోకేశ్ కు సమస్యలు చెప్పుకున్నారు.పాదయాత్రలో అడుగడుగునా ప్రజలు నారా లోకేశ్ పై పూలవర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పట్టారు.వేలాదిగా తరలివచ్చిన తెలుగుదేశంపార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు,జనాలతో 216 జాతీయ రహదారంతా కిక్కిరిసిపోయింది. ఈ పాదయాత్ర చిత్రాడ గ్రామంనుంచి పిఠాపురం మహారాజా రైల్వే వారధి మీదుగా పిఠాపురం పట్టణానికి చేరుకుంది.దారి పొడవునా నారా లోకేశ్ జిందాబాద్,వర్మ జిందాబాద్ లతో మార్మోగిపోయింది..