తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక ఎవరు ఉన్నారు. రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీ.. ప్రియాంక… డీకే శివకుమార్ ఇలా లిస్ట్ పెద్దదే. కానీ వీరంతా కాంగ్రెస్ నేతలు కాబట్టి కాంగ్రెస్ కోసం పని చేస్తారు. కానీ అసలు కాంగ్రెస్ విజయం వెనుక ఉన్నది బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలే. నేరగా కాకపోయినా వారి వ్యూహాత్మక తప్పిదాలే.. కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడ్డాయి. ఆరు నెలల కిందటి వరకూ తెలంగాణలో రాజకీయం బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా ఉండేది. కాంగ్రెస్ రేసులో ఉందో లేదో కూడా ఎవరూ చెప్పలేకపోయేవారు. బండి సంజయ్ తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఉన్నప్పుడు బీజేపీ దూకుడుగా ఉంది. కాంగ్రెస్ పూర్తిగా వెనుకబడిపోయింది. బండి సంజయ్ దూకుడుపై విమర్శలు వస్తే వచ్చి ఉండవచ్చు కానీ బీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే ఆయనే కరెక్ట్ అన్న అభిప్రాయానికి వచ్చారు. అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెరపైకి వచ్చింది. కవితఅరెస్టు ఖాయమనుకున్నారు. బండి సంజయ్ అంతకు ముందు నుంచీ అరెస్టుల గురించి చెబుతున్నారు. అరెస్టు జరిగి ఉంటే.. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నది పూర్తి స్థాయిలో సాక్షాత్కరించేది. కానీ ఒక్క సారిగా బీజేపీ హైకమాండ్ బ్యాక్ ఫుట్ తీసుకుంది.
బండి సంజయ్ ను పదవి నుంచి తప్పించింది. కవిత కూడా అరె్స్టు కాలేదు. అదే సమయంలో కేసీఆర్ బీజేపీని విమర్శించడం మానుకున్నారు. ఈ పరిణామం వల్ల బీజేపీ తీవ్రంగా నష్టపోయింది. రెండు పార్టీలు ఒక్కటేనని ప్రజలు గట్టిగా నమ్మడం ప్రారంభించారు. అందుకే బీజేపీలో చేరికలు కూడా ఆగిపోయాయి. ఇతర పార్టీల్లో టిక్కెట్లు రాని వారు కూడా బీజేపీలో చేరలేదు.ప్రధాని మోదీ నిజామాబాద్ లో చేసిన వ్యాఖ్యలు అటు బీజేపీతో పాటు ఇటు బీఆర్ఎస్ కూ మైనస్ గా మారాయి. రెండు పార్టీలు ఒకటేనన్న ప్రచారం ప్రజల్లోకి వెళ్లిపోయింది. నిజామాబాద్‌లో కేసీఆర్ పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేయలేదు… విమర్శలు చేయలేదు. కేసీఆర్‌కు.. తనకు మధ్య జరిగిన సంభాషణల వివరాలు మాత్రం వెల్లడించారు. గ్రేటర్ ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్ తన వద్దకు వచ్చి ఎన్డీఏలో చేరుతానని గ్రేటర్ మేయర్ పదవి ఇస్తానని ప్రతిపాదన పెట్టారని మోదీ అన్నారు. అయితే ఎన్డీఏలో చేర్చుకునేందుకు తాము సిద్ధంగా లేమని చెప్పామని మోదీ స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో అయినా కూర్చుకుంటాము కానీ బీఆర్ఎస్‌తో కలిసేది లేదని చెప్పి పంపిచానన్నారు.
అప్పుడే కేసీఆర్ అవినీతి చిట్టా అంతా తాను చెప్పానన్నారు. అప్పట్నుంచి కేసీఆర్ తనను కలవడం మానేశారని చెప్పారు. గ్రేటర్ ఎన్నికలకు ముందు వరకూ తాను వస్తే.. స్వాగతం చెప్పేందుకు కేసీఆర్ వచ్చే వారని.. ఆ తర్వాత నుంచి మొహం చాటేస్తున్నారని మోదీ తెలిపారు. ఈ మాటలు తాము వ్యతిరేకమని చెప్పుకునేందుకు ఉపయోగపడ్డాయి కానీ.. ప్రజల్లో నమ్మకం కలిగించలేదు.తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయం గోడ మీద పిల్లిలా ఉంటుందని రాజకీయవర్గాలు చెబుతూ ఉంటాయి. బీజేపీతో ఎప్పుడు యుద్ధం ప్రకటిస్తారో.. ఎప్పుడు కాల్పుల విమరణ ప్రకటిస్తారో ఆయనకే తెలియదు. 2018 ఎన్నికల సమయంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు బీజేపీ పూర్తి స్థాయిలో కేసీఆర్‌కు సహకరించింది. అందుకే చివరి క్షణంలో అసెంబ్లీని రద్దు చేసినప్పటికీ నాలుగు రాష్ట్రాలతో పాటు ఎన్నికలు నిర్వహించేశారు. మోదీ బయట పెట్టిన ఈ అంతరంగిక విషయాల వల్ల బీజేపీకి ఏమైనా మేలు జరిగిందా అని ఆలోచిస్తే.. ఏ కోణంలోనూ ఒక్క ఓటు కూడా కలవదు కదా అన్న అభిప్రాయ రాజకీయాలపై ఓనమాలు తెలిసిన వారికీ వస్తుంది. పైగా ఆ రెండు పార్టీలు ఇవాళ కాకపోతే రేపైనా కలుస్తాయన్న అభిప్రాయానికి జనం వస్తారు. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంది.
ఎందుకంటే బీఆర్ఎస్ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న దళిత, ముస్లింల ఓటర్లు .. మోదీ ప్రకటన తర్వాత బీఆర్ఎస్ వైపు అనుమానంగా చూడటం ప్రారంభించారు. చివరికి అది ఓట్లలో తేలిపోయింది. పైగా మజ్లిస్ విషయంలో ఇతర ప్రాంతాల్లోని ముస్లింలు గుర్రుగా ఉన్నారు. తమను పావుగా పెట్టి బీజేపీకి మేలు చేస్తున్నారన్న అభిప్రాయంతో ఎక్కువ మంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ తమతో కలవడానికి ప్రయత్నించింది అని చెప్పడం ద్వారా డైలమాలో ఉండే ముస్లిం ఓటర్లను కూడా కాంగ్రెస్ వైపు నెట్టేశారు. ముస్లిం ఓట్ల శాతం కాంగ్రెస్‌కు పెరిగిందని వివిధ రకాల విశ్లేషణలు వెలుగు చూశాయి. టే బీఆర్ఎస్ నష్టపోతుంది. బీజేపీకి లాభం లేదు. మరి ఎవరికి లాభం. కాంగ్రెస్ పార్టీకి మాత్రమే. తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఉన్న సంజయ్ ను మార్చడంతో పాటు కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకోలేకపోవడం.. అరెస్టు చేాయల్సిన కవితను వదిలేయడం వంటి అంశాల ద్వారా.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టికి ఊపిరి పోశారు. ఇప్పుడు కేసీఆర్ ను ఇరుకున పెట్టేందుకు బయటపెట్టిన విషయాల ద్వారా మరోసారి కాంగ్రెస్ పార్టకి మేలు చేశారు. కాంగ్రెస్‌కు మేలు చేయాలని కలలో కూడా మోదీ అనుకోరు. దక్షిణాది రాజకీయాల్ని అర్థం చేసుకోలేక వ్యూహాత్మక తప్పిదాలతో కాంగ్రెస్ పార్టీని బలపరిచినట్లయింది.