seigniorage
ఆంధ్రప్రదేశ్ జాతీయం

మాయమవుతున్న సీనరేజ్

కంచే చేను మేస్తున్న చందంగా ఒక ప్రయివేట్‌ సంస్థ వ్యవహరిస్తోంది. కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేస్తున్న సీనరేజిని ప్రభుత్వానికి సక్రమంగా కట్టడం లేదు. పైగా, అక్రమంగా మట్టి తవ్వకాలు చేసి అమ్ముకుంటోంది. ఇదంతా బహిరంగంగా జరుగుతున్న గనుల శాఖ చోద్యం చూస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సీనరేజ్‌ వసూలు చేసే బాధ్యతను ఉమ్మడి అనంతపురం జిల్లాలో అమిగోస్‌ సంస్థకు ఈ ఏడాది మార్చి మూడు నుంచి అప్పగించింది. మట్టిని తవ్వుతున్న కాంట్రాక్టర్ల నుంచి సీనరేజ్‌ వసూలు చేసి నెలకు 10.50 కోట్ల చొప్పున గనుల శాఖకు చెల్లించాలి. కానీ, ఒప్పందం ప్రకారం ఆ సంస్థ ఏ నెల కూడా ఆ మేరకు చెల్లించిన దాఖలాలు లేవు. మట్టి తవ్వకాలకు ప్రభుత్వ పనులకు మాత్రమే తాత్కాలిక పర్మిట్లు ఇస్తారు. కాంట్రాక్టరు చేస్తున్న పనికి సంబంధించిన వివరాలను తీసుకుని పర్మిట్లు మంజూరు చేయాలి. అయితే, కాంట్రాక్టర్లకు బదులు అమిగోస్‌ సంస్థకు చెందిన కొంతమంది వారికే ఆ సంస్థ తాత్కాలిక పర్మిట్లు జారీ చేసినట్లు, తద్వారా లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిని అక్రమంగా తరలించి అమ్ముకున్నట్లు ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.

బుక్కరాయసముద్రంలో సర్వే నంబర్‌ 113, ఆత్మకూరు మండల కేంద్రంలో సర్వే నెంబరు 290, పెద్దపప్పురు మండలం జూటూరులోని సర్వే నంబరు 1,281, పామిడి మండలం వంకరాజు కాలువ గ్రామం పరిధిలో సర్వే నెంబరు పేర్కొనకుండానే తాత్కాలిక పర్మిట్లు ఇచ్చింది. ఆత్మకూరులో రాజశేఖర్‌, వంకరాజు కాలువలో ప్రవీణ్‌కుమార్‌ పేరున ఇవి మంజూరయ్యాయి. అయితే, ఈ ఇద్దరికీ ఎక్కడా ప్రభుత్వ అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టులు లేవని సమాచారం. అయినా, హంపాపురం, నరసినేకుంట, బుక్కరాయసముద్రం, నరసాపురం, యల్లనూరు మండలాల్లో పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు వారు జరిపారు. వారిద్దరూ ఆ సంస్థకు సంబంధించిన వారేనని ఆయా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.తమకు తవ్వకాలకు అనుమతులు ఉన్నా తవ్వడానికి వీల్లేదంటూ అమిగోస్‌ సంస్థ ప్రతినిధులు అడ్డుపడుతున్నారని కొంతమంది లీజుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై గనుల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని చెప్తున్నారు.

లీజుదారుడిని అయినందున తవ్వకాలు జరపకున్నా సీనరేజీ చెల్లించాలంటూ అమీగోస్‌ సంస్థ ప్రతినిధులు ఒత్తిడి తెస్తున్నారంటూ గుంతకల్లులో 5వ వార్డు కౌన్సిలరు కుమారుడు దర్గా రమేష్‌ ఇటీవల ఆత్మహత్యానికి పాల్పడ్డారు. వీటిపై గనుల శాఖ ఇంఛార్జి డిప్యూటీ డైరెక్టర్‌ను వివరణ కోరేందుకు  ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.అమిగోస్‌ సంస్థకు సీనరేజ్‌ ఛార్జీలు వసూలు చేసే బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది. దీన్ని సాకుగా తీసుకొని అక్రమంగా ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధులే తవ్వకాలను జిల్లాలో జరుపుతున్నారు. మట్టి అక్రమ తవ్వకాలపై ఉన్నతాధికారులకు సిపిఎం ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. సీనరేజ్‌ ఛార్జీలను వసూలు చేసే బాధ్యతను ప్రభుత్వం ప్రయివేటు సంస్థలకు అప్పగించడం సరైంది కాదు. అమిగోస్‌ సంస్థపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.