lokesh-padayatra
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

లోకేష్ పాదయాత్ర మళ్లీ షురూ

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం, శీలంవారిపాకలు జంక్షన్ నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర మళ్లీ మొదలైంది. ఇటీవల తుపాను కారణంగా ఆయన యువగళానికి విరామం ఇచ్చారు. ఈరోజు యువగళం 217వ రోజుకు చేరుకుంది. ఈ రోజుతో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి యాత్ర పూర్తవుతుంది. మధ్యాహ్నం పిఠాపురం నియోజకవర్గం కోనపాపపేటకు చెందిన హేచరీస్ రైతులు నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కాకినాడ సెజ్ ప్రాంతంలో 500  రొయ్యల హేచరీలు ఉన్నాయని, దేశానికి అవసరమైన రొయ్యల సీడ్ లో 50శాతం ఇక్కడే ఉత్పత్తి చేస్తున్నామని వారు తెలిపారు. రూ.50వేల కోట్ల నికర విదేశీ మారక ఆదాయాన్ని కలిగిన రొయ్యల పరిశ్రమలో తామంతా భాగస్వాములం అని వారు చెప్పారు. తమ ఉత్పత్తులకు నాణ్యమైన సముద్రపు నీరు, గాలి, భూగర్భ జలాలు అవసరం అని వారు లోకేష్ కి తెలిపారు. రొయ్యల హేచరీలపై ప్రత్యక్షంగా లక్షలాది మంది ఆక్వారైతులు, వేలాది ఉద్యోగులు ఆధారపడి జీవిస్తున్నారని, సెజ్ ప్రాంతంలో నిర్మించబోయే పరిశ్రమల నుంచి హేచరీలను కాపాడాలని వారు లోకేష్ కి విజ్ఞప్తి చేశారు.

రొయ్యల పరిశ్రమను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. హేచరీస్ యజమానులకు నారా లోకేష్ భరోసా ఇచ్చారు. సీఎం జగన్ జె-ట్యాక్స్ విధానాల కారణంగా ఆక్వారంగం సంక్షోభంలో కూరుకుపోయిందని విమర్శించారు లోకేష్. సీడ్, ఫీడ్, మందుల ధరలు, కరెంటు ఛార్జీలు పెంచి ఆక్వా రైతులను అప్పుల్లో ముంచుతున్నారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో ఆక్వా రంగంలో రాష్ట్రాన్ని భారతదేశంలోనే మొదటిస్థానంలో నిలిపామని లోకేష్ తెలిపారు. 2014లో తాము అధికారంలోకి వచ్చాక ఆక్వా రైతులు, హేచరీలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని గుర్తు చేశారు. జోన్లతో సంబంధం లేకుండా ఆక్వా రైతులకు యూనిట్ కరెంటును రూ.1.50కు అందిస్తామని భరోసా ఇచ్చారు. తిరిగి అధికారంలోకి వచ్చాక ఆక్వా రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పారు లోకేష్. హేచరీస్ దెబ్బతినకుండా అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. హేచరీలు ఉన్న ప్రాంతంలో నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

గుండ్లకమ్మ ఘటనపై లోకేష్ ఘాటు ట్వీట్..
గత రాత్రి గుండ్లకమ్మ రిజర్వాయర్ కి సంబంధించి రెండో గేటు కొట్టుకుపోయింది. గతేడాది ఆగస్ట్ లో మూడో గేటు ఇలాగే వరదలకు కొట్టుకుపోయింది. అప్పుడు కూడా రిజర్వాయర్ నీరు వృథాగా సముద్రంపాలయింది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అయితే ఇదంతా గత ప్రభుత్వం తప్పిదమని అంటున్నారు వైసీపీ నేతలు. గత ప్రభుత్వం గేట్ల మరమ్మతులు, రంగులు వేయడం అనే పేరుతో.. నిధులు కాజేసిందని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను లోకేష్ ఖండించారు. “జగన్ ఉత్తుత్తి బటన్లు నొక్కుతూ, పాలన గాలికొదిలేశారు. ప్రజాధనం దోచి దాచుకునే బిజీలో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు. ప్రాజెక్టులు కొత్తవి కట్టకపోగా, ఉన్న వాటి నిర్వహణనీ పట్టించుకోలేదు. ప్రాజెక్టు గేట్లకు గ్రీజు పెట్టేందుకు కూడా నిధులు ఇవ్వలేని దిక్కుమాలిన పాలనలో గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు విరిగిపోయింది. గతేడాది గుండ్లకమ్మ ప్రాజెక్టు మూడో గేటు కొట్టుకుపోయింది. నీరు వృథాగా పోతోంది.” అంటూ ట్వీట్ వేశారు లోకేష్.