ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌కు సీఎం జగన్ లేఖ

తెలంగాణ అక్ర‌మ ప్రాజెక్టులు నిర్మిస్తోంది.. ముందు వారి ప్రాజెక్టుల‌ను ప‌రిశీలించండి.. సీఎం జ‌గ‌న్

సీఎం జగన్ కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు లేఖ రాశారు. తెలంగాణ‌లోని అక్ర‌మ ప్రాజెక్టుల‌ను తొలుత సంద‌ర్శించాలని, ఆ త‌ర్వాతే రాయ‌ల‌సీమ లిఫ్ట్ సంద‌ర్శించాలని జ‌గ‌న్ అందులో పేర్కొన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల‌ను ముందు ప‌రిశీలించేలా కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)ని ఆదేశించాలని ఆయ‌న గజేంద్రసింగ్‌ షెకావత్‌ను కోరారు. కేఆర్ఎంబీ సూచ‌న‌ల‌ను తెలంగాణ ప‌దేప‌దే ఉల్లంఘిస్తోందని ఆయ‌న ఆరోపించారు. తెలంగాణ వైఖ‌రితో ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌న వాటా జ‌లాల‌ను కోల్పోతోందని అన్నారు.

అంతేగాక‌, తెలంగాణ తీరుతో కృష్ణా జ‌లాలు అన‌వ‌స‌రంగా స‌ముద్రంలో క‌లిసి పోతున్నాయని ఆయ‌న తెలిపారు. ఏపీ ప్రయోజనాలు దెబ్బతినేలా తెలంగాణ వ్యవహరిస్తోందని వివరించారు. కాగా, రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్‌ అక్రమ ప్రాజెక్టేని, ఈ నెల 9న నిర్వహించబోయే కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశాన్ని రద్దు చేయాలని, ఈ నెల 20 తర్వాత పూర్తి స్థాయి బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని ఇప్ప‌టికే తెలంగాణ ప్ర‌భుత్వం కోరింది. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ విజ్ఞ‌ప్తుల‌పై కేంద్ర ప్ర‌భుత్వం స్పందించాల్సి ఉంది.