పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా ఈ అంశాన్ని కేటీఆర్ లేవనెత్తారు. గత పాలకుల గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ నాయకులకు అప్పట్లో జరిగిన తప్పులు గుర్తు చేస్తున్నామని అన్నారు. పోతిరెడ్డిపాడు విషయంలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి అన్యాయం చేస్తుంటే అడగాల్సిన వాళ్లంతా హారతులు పట్టి సత్కారాలు చేశారని ఎద్దేవా చేశారు. అలాంటి వాళ్లను ఇక్కడ సభలో కీర్తిస్తూ బానిసలకు బానిసలుగా మిగులుతున్నారని శ్రీశ్రీ కవితను చదవి వినిపించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. అసలు పోతిరెడ్డిపాడు విషయంలో నిజంగా దమ్ముగా పోరాడింది పీ జనార్దన్ రెడ్డి అని గుర్తు చేశారు. అప్పుడు అధికార పక్షమైన ఆయన రాజకీయ అంశాలు పట్టించుకోకుండా తెలంగాణ ప్రజల హక్కుల కోసం తిరగబడ్డారని చెప్పారు. పోతిరెడ్డిపాడు విషయంలో అన్యాయం చేయొద్దని కొట్లాడిన క్రెడిట్ పీజేఆర్‌కే దక్కుతుందన్నారు.
ఆ టైంలోనే కడప జిల్లా ఇంఛార్జ్ గా నాయిని నర్సింహారెడ్డి ఉండేవారని తెలిపారు. పోతిరెడ్డిపాడు విషయంలో పీజేఆర్ మినహా పోరాటం చేసిన వాళ్లు ఎవరూ లేరని తేల్చి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు. పోతిరెడ్డిపాడు విషయంలో సభకు సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు సమాచారం ఇచ్చారని రికార్డులను సరిచేయాలని చెప్పుకొచ్చారు. మా నాయకులే కొట్లాడారని ఆ రోజు రాజశేఖర్‌రెడ్డి కేబినెట్‌లో ఉన్న మంత్రులు మాట్లాడలేదని చెప్పడం సరికాదన్నారు. దీనిపై ప్రత్యేకంగా చర్చ పెడితే అన్నింటినీ చర్చించడానికి తాము సిద్ధమన్నారు హరీష్. రికార్డులు, వీడియో ఫుటేజ్ కూడా ఉంటుందన్నారు. రాజశేఖర్‌రెడ్డి కేబినెట్‌లో ఉన్న ఆరుగురు మంత్రులం 14 నెలలకే రిజైన్ చేశామని గుర్తు చేశారు హరీష్. ఎందుకు రిజైన్ చేస్తున్నాం ఆరు కారణాలు చెప్పామన్నారు. అందులో మొదటి కారణం పోతిరెడ్డిపాడు అంశాన్నే ప్రస్తావించాం. పోతిరెడ్డిపాడు నుంచి అక్రమంగా నీళ్లులు ఎత్తుకుపోతున్నారని చెప్పాం. తెలంగాణకు రావాల్సిన నీళ్లను సీమకు తరలించుకుపోతున్నందుకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్టు స్పష్టం చేశాం.
తెలంగాణను ముంచి పులిచింతల ప్రాజెక్టు కడుతున్నందుకు రాజీనామా చేస్తున్నాం అని వివరించాం. 610 జీవో అమలు చేయడంలో నిర్లక్ష్యం చేసినందుకు, నక్సల్స్‌ను ఫేక్ ఎన్‌కౌంటర్ చేస్తున్నందుకు రాజీనామా చేస్తున్నామని ఆనాడు వెల్లడించామన్నారు. పోతిరెడ్డిపాడు ఆపాలని తామంతా 45 రోజుల పాటు ఇదే శాసనసభలో పోడియంను చుట్టుముట్టామని గుర్తు చేశారు హరీష్. బడ్జెట్ సెషన్ మొత్తం పోరాడామన్నారు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ నేతలు చాలా మంది అప్పట్లో మంత్రులుగా ఉన్నారు వాళ్లెవరూ నోరు ఎత్తలేదు అని తెలిపారు. 2004లో అసలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిందే టీఆర్‌ఎస్ పార్టీ అన్నారు. చంద్రబాబు హయాంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోతే టీఆర్‌ఎస్ దయతో అధికారంలోకి వచ్చిందని అన్నారు. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో తెలంగాణ అంశాన్ని ప్రస్తావిస్తేనే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నామని వివరించారు. ఇంతలో మంత్రి శ్రీధర్‌బాబు కలుగుజేసుకొని ఇలాంటి అంశాలపై చర్చ పెట్టుకోవాలంటే చాలా సమయం ఉందని… ఇప్పుడు మాత్రం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడాలని సూచించారు.