హైదరాబాద్ నగరంలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో కూరగాయలు కొనాలి అంటేనే నగరవాసులు ముందు వెనుక ఆలోచన చేస్తున్నారు. గతంలో బజారుకు 200 రూపాయలను తీసుకువెళ్తేనే సంచి నిండా కూరగాయలు వచ్చేవి.. కానీ, ఇప్పుడు చేతినిండా డబ్బులు తీసుకెళ్లిన సంచి సగానికి కూడా కూరగాయలు రావట్లేదంటూ వాపోతున్నారు సామాన్య మధ్య తరగతి ప్రజలు. అయితే ప్రస్తుతం మార్కెట్లో కూరగాయ ధరల పెరుగుదల, దానికి వెనుక అసలు కారణం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..మొన్నటి వరకు కార్తీక మాసం కావడంతో నాన్ వెజ్ ధర విపరీతంగా పడిపోయింది. దీంతో కూరగాయ ధరలకు రెక్కలు వచ్చాయి. దానితోపాటు చలికాలం కావడంతో పంట దిగుబడి తక్కువగా ఉండడం, పంట చేతికి సరిగా అందకపోవడంతో అమాంతం ధరలు పెరిగిపోయాయి. ప్రస్తుతం కిలో చిక్కుడుకాయ ధర 65 రూపాయలు పలుకగా బీన్స్ 45 రూపాయలు, దొండకాయలు 50 రూపాయలు, బెండకాయలు 60 రూపాయలు, అతి తక్కువగా అంటే టమాటో ధర కిలో 25 రూపాయలు ధర పలుకుతోంది.
6 నెలల క్రితం డబుల్ సెంచరీ కొట్టినటువంటి టమాటో ధర ప్రస్తుతం నేల చూపులు చూస్తుంటే మిగతా కూరగాయలు అన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ఈ మధ్యకాలంలో నాన్ వెజ్ కన్నా కూరగాయల భోజనం ఆరోగ్యానికి ఉత్తమం అని వైద్యులు చెప్పడంతో ఎక్కువమంది కూరగాయ భోజనాన్ని తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది కూడా కూరగాయల ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా అభిప్రాయ పడుతున్నారు. ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో 500 రూపాయలు పెట్టి కొన్న కనీసం సంచి కూడా నిండడం లేదని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ ధరలు తగ్గితే కాస్త ఉపశమనంగా ఉంటుందని అంటున్నారు. ఇక సామాన్య మధ్యతరగతి కుటుంబాలు మాత్రం కూరగాయలు కొనాలి అంటేనే ఆలోచించాల్సి వస్తుందని వాపోతున్నారు. కానీ కొనక తప్పదంటూ ఆవేదనగా చెబుతున్నారు. కాకపోతే, రెండు మూడు వెరైటీస్ కొనేవాళ్లు ఇప్పుడు కేవలం ఒకదానితోనే సరిపెట్టుకొని కొంటున్నారు.షామీర్పేట్, వికారాబాద్ లాంటి ప్రదేశాల నుండి టమాటో చిక్కుడుకాయ నగరానికి చేరుకుంటుంది.
వాటిని ఇక్కడికి చేర్చేందుకు ట్రాన్స్‌ఫోర్ట్ ఖర్చులు, ఇతరాత్ర ఖర్చులు కూడా పెరిగిపోవడంతో ఆ భారం జనాలపై పడుతోంది అంటున్నారు ప్రజలు. మరోవైపు ఆకుకూర ధరలతో పాటు అల్లం వెల్లుల్లి ధరలు కూడా అమాంతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం పావు కిలో వెల్లుల్లి ధర 60 రూపాయలు పలుకగా హోల్‌సేల్ లో కిలో వెల్లుల్లిపై ధర 240 పలుకుతోంది ఇక పావు కిలో అల్లం ధర 40 రూపాయలు ఉండగా కిలో అల్లం ధర 150 రూపాయలకు పైనే ఉంది అంటూ వ్యాపారాలు చెప్తున్నారు. అయితే హోల్‌సేల్‌లో కొన్నటువంటి ధరలు మార్కెట్‌కు వచ్చేసరికి కొంత తగ్గుతూ ఉండగా పెద్దగా గిట్టుబాటు ధర రావడంలేదని చెప్తున్నారు కూరగాయల వ్యాపారులు. దీంతో ఈ భారం అంతా ప్రజలపైనే పడుతోందని మరి కొంతమంది వాపోతున్నారు. మొత్తానికి కూరగాయలతో పోటీపడుతూ అల్లం వెల్లుల్లి ధర కూడా విపరీతంగా పెరిగిపోయింది.