అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ @ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) బద్వేల్ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో 9 రోజు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం బద్వేల్ ఐసీడీఎస్ కార్యాలయం నుండి ప్రధాన రహదారులంబడి అంగన్వాడీ కార్యకర్తలు చేసి ప్రభుత్వానికి వేతిరేకంగా బిక్షాటన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి గండి సునీల్ కుమార్ బీసి చైతన్య రాష్ట్ర సమితి రమణ మాట్లాడుతూ…
అంగన్వాడీలతో పాటు సామాన్య జనాన్ని కూడా ముఖ్యమంత్రి మోసం చేశారని, అంగన్వాడి సిబ్బందిని వేదిస్తున్నారని, అసలు విధులు పక్కనపెట్టి పార్టీ కార్యక్రమాలకు వెళ్ళమంటున్నారని, వారికి గట్టి సమాధానం చెప్పాలని సూచించారు. తాము ఆడవాళ్ళం కాదు మహాశక్తులమని గుర్తించేలా చేయాలన్నారు. తనకు మించిన మహిళా పక్షపాతి మరెవరు లేనట్టు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన జగన్…. అదే మహిళలు తమ సమస్యల ను పరిష్కరించాలని పలుమార్లు రోడ్డు ఎక్కి నిరసన తెలుపుతున్నా… ఆందోళన చేస్తున్నా….. కనీసం వారి సమస్యలు ఏంటని అడిగిన పాపాన పోలేదని,వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టగానే 2019 జూన్ లో అంగన్వాడీ కార్యకర్తల వేతనాన్ని రూ.1,000/- రూపాయలు చొప్పున పెంచింది. దీంతో వారి వేతనం 11,500 చేరింది. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడంలో ఆరితేరిపోయిన జగన్ అంగన్వాడీలకు రూ.1,000/- పెంచి వారికి ఇచ్చే సంక్షేమ పథకాలకు ఎసరు పెట్టారు. రూ.1,000/- పెంపుతో గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కార్యకర్తల వేతనం నవరత్నాల పథకాల అమలకు నిర్దేశించిన రూ.10,000 ఆదాయ పరిమితి నిబంధనను దాటిపోయింది.
దీంతో సంక్షేమ పథకాలు వారికి వర్తించకుండా చేశారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, చేయూతతో పాటు ఒంటరి, వితంతు, దివ్యాంగ పింఛన్లు తీసేశారు. రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కేంద్రాలుంటే అందులో సుమారు 46,899 కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఇక్కడ పనిచేసే కార్యకర్తలకు సంక్షేమ పథకాల్లో కోత పడింది. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు నాణ్యమైన ఆహారం పెట్టాలని ఆదేశించే వైకాపా ప్రభుత్వం మెనూ చార్జీలు పెంచాలని అంగన్వాడీలు గగ్గోలు పెడుతున్న పట్టించుకోవడం లేదు. నిత్యవసరాల ధరలు రెట్టింపు అవుతున్నాయి లబ్ధిదారుల సంఖ్యను బట్టి సరాసరి ఒక్కో అంగన్వాడి కేంద్రానికి నెలకు రూ.1500-2000 వరకు వంట ఖర్చు వస్తుందని వారు చెబుతున్న ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది. గ్యాస్ బండ భారము అంగన్వాడీ కార్యకర్తల పైనే వేస్తోంది. రోజుకు గర్భిణీలు, బాలింతలకు ఒక్కొక్కరికి రూ.1.75 పైసలు, 3-6 ఏళ్లలోపు చిన్నారులకు 50 పైసల చొప్పున ప్రభుత్వం గ్యాస్ వినియోగానికి చెల్లిస్తోంది. కొన్ని కేంద్రాల్లో కార్యకర్తలకు గ్యాస్ పై నెలకు రూ.500-800 వరకు చేతి నుంచి పడుతోంది.
అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యూటీని వర్తింపజేయాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం గతేడాది తీర్పు ఇచ్చింది. దాన్ని అమలుకు చర్యలు తీసుకోవాలని అంగన్వాడీలు విన్నవిస్తున్న ప్రభుత్వం నుంచి స్పందన లేదు. పదవీ విరమణ చేసిన కార్యకర్తలకు గత ప్రభుత్వంలో రూ. 50,000 ఇచ్చేవారు దాన్ని రూ.5 లక్షలకు పెంచాలని వారు కోరుతున్నారు. కానీ ఇప్పటికే పదవీ విరమణ చేసిన చాలా మందికి రూ.50 వేలు కూడా ఇవ్వలేదని ఆమె ఈ సందర్భంగా ఆరోపించారు.
ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలపై స్పందించకపోగా, దుర్మార్గంగా వ్యవహరిస్తూ కేంద్రాల తాళాలు పగలగొట్టడం దారుణమని అంగన్వాడీ కార్యకర్తలను బెదిరించాలనుకోవడం ప్రభుత్వ మూర్ఖత్వమే అని, అంగన్వాడి కార్యకర్తల పై అణిచివేత చర్యలు మాని వారిని చర్చలకు పిలిపించి న్యాయమైన వారి సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాని డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు చిన్ని, ఎస్.ఎఫ్.ఐ నాయకులు రాజశేఖర్, కె.వి.పి.ఎస్ పట్టణ నాయకులు రయప్ప, నరసింహులు, ఆంజనేయులు, అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్టు గౌరవాధ్యక్షురాలు కె. సుభాషిని, ప్రధాన కార్యదర్శి ఆర్.హుసేనమ్మ, నాయకురాళ్లు సత్యవతి, కళావతి, విజయమ్మ, తులసమ్మ, వెంకట నరసమ్మ, వసంతమ్మ, శ్రీలత, లీలావతి, కళావతి, కృష్ణవేణి, ప్రవీణ, ఉమాదేవి, మహాలక్ష్మి, రాధమ్మ, అరుణమ్మ పెద్ద సంఖ్యలో అంగన్వాడి వర్కర్లు హెల్పర్లు పాల్గొనడం జరిగింది.